3. రూతు బోవసు కళ్ళముకడ నిద్రించుట
3 1. అంతట నవోమి కోడలితో ”తల్లీ! నిన్నొక యిిిందానిని చేయవలసినదానను నేనేకదా.
2. నీవు బోవసు పనికత్తెలతోకూడి వెన్నులేరుకొనుచున్నావు గదా! అతడు మన బంధువు. నేిరేయి అతడు కళ్ళమున ధాన్యము త్రొక్కించును.
3. కనుక నీవు స్నానము చేసి అత్తరుపూసుకొని మంచి దుస్తులుతాల్చి కళ్ళము నొద్దకు వెళ్ళుము. కాని బోవసు అన్నపానీ యములు సేవించువరకు నీవు అతని కంటబడరాదు.
4. అతడెక్కడ పండుకొనునో గుర్తుంచుకొనుము. అతనికి నిద్రప్టిన తరువాత నీవతని పాదములమీద వస్త్రమును తొలగించి అతని ప్రక్కన పరుండుము. తరువాత నీవేమిచేయవలసినది అతడే చెప్పును” అనెను.
5. రూతు అత్తతో ”నీవు చెప్పినట్లే చేసెదను” అనెను.
6. ఆమె కళ్ళముకడకు వెళ్ళి అత్త చెప్పినట్లే చేసెను.
7. బోవసు అన్నపానీయములు సేవించి తృప్తిచెంది వెళ్ళి ధాన్యరాశిచెంత పరుండెను. రూతు మెల్లగావచ్చి అతని పాదములమీది వలువను తొల గించి అచట అతని చేరువనేపరుండెను.
8. బోవసు నడిరేయి ఉలిక్కిపడి నిద్రమేల్కొని ప్రక్కకు మరలి చూడగా పాదములచెంత ఒక స్త్రీ పరుండియుండెను.
9. అతడు నీవెవ్వరవని ప్రశ్నించెను. ఆమె ”అయ్యా! నేను నీ దాసురాలనైన రూతును. నీవు మాకు దగ్గరి చుట్టము. మా సంగతి విచారింపవలసినవాడవు నీవే. కనుక నన్ను దేవరన్యాయమున2 పెండ్లియాడుము. ఈ నీ దాసురాలిపై నీ వస్త్రము కప్పుము” అని వేడుకొనెను.
10. బోవసు ”అమ్మా! నీవు యావే దీవెననొందినదానవు. నీవు ధనవంతునిగాని, దరిద్రుని గాని, మరియొక యువకుని కోరుకొనక నా యొద్దకే వచ్చితివి. నీవు మునుపు మెలగిన తీరుకంటెను ఇప్పుడు మెలగిన తీరు నీకు అధికగౌరవమును చేకూర్చును.
11. ఇక నీవు విచారింపవలదు. నీవు అడిగినందంతయు నీకు చేసెదను. బేత్లెహేములోని వారందరు నీవు యోగ్యు రాలవని ఒప్పుకొందురు.
12. నేను నీకు దగ్గరి చుట్టమునే. కాని నాకంటె దగ్గరిచుట్టము మరియొకడు ఉన్నాడు.
13. నీవు ఈరాత్రికి ఇచటనే యుండుము. రేపుప్రొద్దున ఈ సంగతి విచారింతము. అతడు దేవరన్యాయమున నిన్నుచేపట్టెనా మేలు. లేదా ఆ బాధ్యతను నేనే వహింతును. యావేతోడు నీవు వేకువజాము వరకు ఇచటనే పరుండుము” అని చెప్పెను.
14. కనుక రూతు తెల్లవారువరకు అతని పాదముల చెంతనే నిదురించెను. ఇంకను కొంచెము చీకి ఉండగనే బోవసు మేల్కొనెను. రూతు అచికి వచ్చిన సంగతి ఇతరులకు తెలియగూడదని అతని తలంపు.
15. బోవసు రూతుతో ”అమ్మా! నీ పై ఉత్తరీయము ఇటుచాపుము” అనెను. ఆ బట్టలో ఆరు కుంచెముల ధాన్యముపోసి మూటగ్టి ఆమెకిచ్చెను. రూతు ఆ ధాన్యముతో నగరమునకు వెళ్ళిపోయెను.
16. ఆమె ఇల్లు చేరుకొనగానే నవోమి ”బిడ్డా! ఏమి జరిగినది?” అని అడిగెను. రూతు జరిగిన సంగతి అంతయు అత్తకు విన్నవించెను.
17. ”అతడు ఈ ఆరుకుంచముల ధాన్యముకూడ ఇచ్చెను. నీవు వ్టిచేతులతో మీ అత్తవద్దకు వెళ్ళకూడదని నాతో నుడివెను” అని పలికెను.
18. నవోమి కోడలితో ”తల్లీ! కొంచెము ఓపికపట్టుము. ఈ కథ ఎట్లు నడచునో చూతము. బోవసు ఈ వ్యవహారమును నేడే పరిష్కరించి తీరును” అనెను.