1 1. యేసుక్రీస్తు సేవకులగు పౌలు

               తిమోతిలు వ్రాయునది:

               సంఘాధిపతులకును, పరిచారకులకును,

               క్రీస్తుయేసునందు విశ్వాసముగల

               ఫిలిప్పీయందలి సమస్త దైవజనులకును,

2.           మన తండ్రియగు దేవునినుండియు,

               ప్రభువగు యేసుక్రీస్తునుండియు కృప,శాంతి కలుగునుగాక!

తన పాఠకుల కొరకు పౌలుప్రార్థన

3. మిమ్ము స్మరించినప్పుడెల్లను, మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలను అర్పింతును.

4. నేను మీ అందరికొరకై ప్రార్థించునపుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును.

5. ఏలయన, మొదటినుండి ఇప్పటివరకు సువార్తా కృషియందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం.

6. కనుక మీయందు ఇంతటి మంచిపనిని ప్రారంభించిన దేవుడు, క్రీస్తుయేసు దినమున అది సంపూర్ణమగువరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను.

7. మీకు ఎప్పుడును నా హృదయమున స్థానమున్నది. కనుక మిమ్ము గూర్చి నేను ఈ విధముగ భావించుట యుక్తమే. నేను చెరయందున్న ఈనాడును, సువార్తకొరకు వాదించి సుస్థిరము చేసిన ఆనాడునూ, మీరు నాతో భాగస్తులైతిరి.

8.యేసుక్రీస్తు హృదయమునుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం.

9. జ్ఞానముతోను, అన్ని విధములగు వివేచనతోను మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించుచున్నాను.

10. అందువలన, మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేనివారును, నిర్దోషులుగా ఉండగలుగుదురు.

11. దేవుని మహిమ స్తుతులకొరకు యేసుక్రీస్తుద్వారా కలుగు నీతిఫలములచే మీ జీవితములు నింపబడును.

క్రీస్తే నా జీవనము

12. సోదరులారా! నాకు సంభవించిన విషయములు నిజముగ సువార్త పురోగమనమునకు తోడ్పడినవని మీరు తెలిసికొనవలెనని నా వాంఛ.

13. తత్ఫలితముగ క్రీస్తు సేవకుడను అగుటచేతనే నేను చెరయందు ఉంటినని, ఇచ్చటి చక్రవర్తి కావలివారికిని తదితరులకును, అందరకును తెలియును.

14. నేను చెరయందు ఉండుట, మన సోదరులలో పెక్కుమందికి ప్రభువునందు విశ్వాసమును అధికము చేసినది. కనుక దేవుని వాక్కును బోధించుటలో వారు భయములేక మరింత ధైర్యమును కలిగియున్నారు.

15. నిజమునకు, వారిలో కొందరు అసూయా పరులై కలహస్వభావముతో క్రీస్తును బోధింతురు.  కాని  తదితరులు మంచి ఉద్దేశముతో బోధించుచున్నారు.

16. ఈ రెండవ వర్గమువారు ప్రేమచేతనే అటుల చేయుదురు. ఏలయన, సువార్త పక్షమున వాదించు బాధ్యతను దేవుడు నాకు ఒప్పగించెనని వారు ఎరుగుదురు.

17. మొదటివర్గము వారు నిజాయితీగ క్రీస్తును గూర్చి ప్రకటింపరు. కేవలము పక్షపాతముతో మాత్రమే వారు అటుల చేయుదురు. నేను చెరయందుండగా నాకు అధిక కష్టమును కలిగించుచున్నామని వారు భావింతురు.

18. అది అంత పటించుకొనవలసిన విషయము కాదు! అంతేగాక అది నాకు సంతోషదాయకము. ఏలయన, సత్సంకల్పముచేగాని లేక మరియొక విధముగాగాని  ఎటులైనను  సర్వవిధముల  క్రీస్తునే బోధించుచున్నారుగదా! కనుక  నేను సంతోషించెదను.

19. ఏలయన, మీ ప్రార్థనలవలనను యేసుక్రీస్తు ఆత్మనుండి లభించు సాయముతోడను, నేను విముక్తుడను అగుదునని నాకు తెలియును.

20. నా విధి నిర్వహణలో నేను ఎటిలోటును చేయరాదని నా గాఢమైన అభిలాష, నమ్మిక. అంతేకాక, అన్ని సమయములందును, ప్రత్యేకించి, ఈ సమయమున సంపూర్ణ ధైర్యముతోనుండి, నేను జీవించినను, మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించెదను.

21. ఎందుకనగా నా మట్టుకు జీవించడమే క్రీస్తు, మరణించడమే లాభము.

22. కాని సజీవుడనై ఎక్కువ ఉపయోగకరమైన పనులను నేను నిర్వహింపగలిగినచో, దేనిని ఎన్నుకొనవలయునో నాకు తెలియదు.

23. నేను ఇరుప్రక్కల చిక్కుకొటింని. ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలెనని నేను గాఢముగా వాంఛించుచున్నాను. అది ఉత్తమమైనదే.

24. నేను జీవించియుండుట మీకు మరింత అవసరము.

25. అందులో సందేహము లేదు. కనుక నేను జీవించియే ఉందునని నాకు తెలియును. విశ్వాసమునందలి మీ పురోగమనమునకును, ఆనందమునకును తోడ్పడుటకై నేను మీ అందరితో పాటు జీవించి ఉండెదను.

26. కనుక నేను మిమ్ము మరల కలసికొనినపుడు, యేసుక్రీస్తునందు నన్ను గూర్చి అధికముగా గర్వించగలుగుదురు.

27. కనుక, మీ జీవితవిధానము క్రీస్తు సందేశానుసారముగ ఉండవలెను అనునదియే ప్రస్తుత ముఖ్యాంశము.  ఏలయన,  నేను మిమ్ము కలిసికొన గలిగినను లేకున్నను సువార్తయందలి విశ్వాసమునకై ఏకాభిప్రాయముతో మీరు అందరును ఒకటిగా నిలిచి కలిసి పోరాడుదురని వినగలను.

28. మీ శత్రువులను గూర్చి భయపడకుడు. ఇదియే వారి వినాశనమునకు గుర్తు. కాని అది మీ రక్షణకు, మరియు అది దేవుని నుండియే అనుటకు నిదర్శనము.

29. క్రీస్తునందు విశ్వాసము కలిగియుండుట మాత్రమేకాక, ఆయన కొరకై శ్రమలను అనుభవించుటకు, మీకు విశేషమైన అవకాశము ప్రసాదింపబడినది.

30. కనుక ఇప్పుడు మీరు పోరాటములో నాతో పాల్గొనవచ్చును. ఆ పోరాటము పూర్వమునుండియు నేను చేయుచున్నదే. మీరు చూచితిరికదా! ఆ నా పోరాటము ఇప్పటికిని కొనసాగుచునేయున్నది. మీరు విని ఉన్నారుగదా!