ఉపోద్ఘాతము:

పేరు: మలాకీ అను పదమునకు ‘నా దూత’ లేక ‘నా సందేశకుడు’ అని అర్థము. ఈ గ్రంథమునకు మలాకీ (దేవునిదూత) పేరు సరియైనదే. ప్రవక్తల గ్రంథములలో చివరిదైన ఈ గ్రంథము దూత సందేశమునివ్వడము ముదావహము.

కాలము: క్రీ.పూ. 450.

నెహెమ్యా యూదయ రాష్ట్రాధిపతిగానున్న కాలములో యూదులలోనున్న దురాచారములన్నినీ మలాకీ ఖండించాడు.  నెహెమ్యా వానిని చక్కదిద్దెను.

రచయిత: మలాకీ.

చారిత్రక నేపథ్యము: బబులోనియా ప్రవాసమునుంచి స్వదేశమునకు తిరిగివచ్చిన యూదులలో నైరాశ్యము నెలకొంది.  ప్రవాస కాలములో వారు యెరూషలేము దేవాలయము గురించి కట్టుకున్న ఊహాజనితమైన గాలిమేడలు గాలిలోనే కలిసిపోయాయి. కరువు కాలము వెాండెను (3:11). కాలుదువ్వుతున్న శత్రుదాడులు పొలిమేరల్లో పొంచివుండెను. దేవునిమీద విశ్వాసము సన్నగిల్లి, నిష్ఠూరములు మొగ్గతొడిగినవి. (1:2). దేవుని న్యాయమును ప్రశ్నింపదొడగిరి  (2:17). అంతా నిష్పప్రయోజనము, వృధాప్రయాసగా కన్పించెను (3:14). ఈ నేపథ్యములో మలాకీ ప్రవచనములు ప్రవచించెను.

ముఖ్యాంశములు: దేవుని ఆదరణను మరిచిన ప్రజలకు ధర్మశాస్త్రఆచరణ కష్టమయినది. యూదులను దేవునివైపు తిరిగి మళ్ళించుటకు మలాకీ ఈ గ్రంథమును వ్రాసెను. దేవుడు అన్యాయస్తుడు కానేకాడని, ప్రజల్లో నైరాశ్యానికి కారణము వారి పాపఫలితమేనని మలాకీ ప్రకించెను.  యాజకుల తప్పుడు ఆరాధనలు (1:6); అయోగ్యమైన అర్పణలు (1:13); విదేశీ ఆకర్షణ, మిశ్రితవివాహములు, విడాకులపరంపర,  (2:14); వ్యభిచారము, దైవభీతి రాహిత్యము, పేదలను బాధించడము విం కారణాలు వారిని నైరాశ్యానికి పురికొల్పాయని ఈ గ్రంథము తెలుపును.

క్రీస్తుకు అన్వయము: మలాకీ గ్రంథము నాలుగు వందల సంవత్సరముల మౌనకాలానికి పీఠికగా మారినది. ఆ పిమ్మట నూతన నిబంధన ప్రవక్తయైన బప్తిస్మ యోహాను, క్రీస్తుని లోకానికి చాటెను (యోహాను 1:29). ”ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల, లోక పాపములను పరిహరించువాడు” అని ప్రత్యక్షముగా క్రీస్తు గూర్చి ఈయన ప్రవచించెను. క్రీస్తునకు ముందుగా రాబోయే ప్రవక్త గురించి మలాకీ ప్రవచించెను (3:1; యెషయా 40:3). ఏలియా బప్తిస్మ యోహానును తలపించును (మత్త. 3:3; 11:10-14; 17:9-13; లూకా 1:17; 3:4; యోహాను 1:23). ఏలియా క్రీస్తు రెండవరాకడకు ముందుగా దర్శనమిస్తాడు అన్నది బప్తిస్మ యోహాను ద్వారా ఋజువయినది.

Home  

Previous                                                                                                                                                                                                  Next