3 1. మీరు క్రీస్తుతోపాటు సజీవులుగ లేవనెత్త బడితిరి. కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడిప్రక్కన క్రీస్తు తన సింహాసనముపైన అధిష్ఠించి ఉండును.

2. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపైగల వస్తువుల మీదగాక, అచ్చట పరలోకమునందుగల వస్తువులపైన లగ్నము చేయుడు.

3. ఏలయన, మీరు మరణించి తిరి. మీ జీవితము క్రీస్తుతోపాటు దేవునియందు గుప్తమై ఉన్నది.

4. మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమ యందు కనబడుదురు.

పాత క్రొత్త జీవితములు

5. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం.

6. ఇటువంటి వానివలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును.

7. ఒకప్పుడు మీ జీవితములు ఈ కోర్కెలతో ప్రభావితమైయున్నప్పుడు మీరు ఇటువంటి మనుష్యులతో నడుచుకొనెడివారు.

8. కాని ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అనువానినుండి విముక్తులు కావలెను. మీరు ఎప్పుడును దుర్భాషలాడరాదు. అవమానించెడి మాటలను, నిందించెడి మాటలను పలుకరాదు.

9. అబద్ధములు ఆడరాదు. ఏలయన, మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి, 10. క్రొత్త స్వభావమును ధరించినారు కదా! తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలిసికొనుటకై మానవుని సృష్టికర్తయైన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు.

11. అందుచేత యూదులని, యూదేతరులని, సున్నతి చేయబడినవారని, చేయబడనివారని, ఆటవికులని, అనాగరికులని, సేవకులని, స్వతంత్రులని ఎవరును లేరు. క్రీస్తే సర్వస్వము. అందరియందును క్రీస్తు ఉన్నాడు.

12. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు. ఆయనకు పరిశుద్ధులును, ప్రియులును అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరచుకొనుడు.

13. ఎవడైనను మరియొకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న యెడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరి  నొకరు క్షమింపవలెను.

14. వీనికంటె అధికముగ ప్రేమను అలవరచుకొనుడు. అది అన్నిటిని పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు.

15. క్రీస్తు ప్రసాదించెడి శాంతి మీ హృదయములను పరిపాలింప నిండు. ఏలయన, ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగ ఉండ పిలువబడితిరి.కనుక కృతజ్ఞులై ఉండుడు.

16. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు.

17. మీరు చేసెడి ప్రతికార్యమును లేక మీరు చెప్పెడి ప్రతిమాటను, తండ్రియైన దేవునకు యేసుప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను.

క్రొత్త జీవితములో వ్యక్తిగత సంబంధములు

18. భార్యలారా! మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందినవారుగ మీరు చేయవలసిన కార్యమిది.

19. భర్తలారా! మీరు మీ భార్యలను ప్రేమింపుడు. వారిపట్ల  కఠినముగా ప్రవర్తింపకుడు.

20. బిడ్డలారా! మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోను విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము.

21. తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు. ఏలయన, వారికి అధైర్యము కలుగవచ్చునుగదా!

22. దాసులారా! మీరు మీ మానవ యజమానుల ఆదేశములను పాటింపుడు. వారి అనుగ్రహము పొందుటకొరకు, వారు గమనించుచున్నప్పుడు మాత్రమేకాక, దేవునియందు భక్తి కలిగి ఎప్పుడును మీ  యజమానుల  ఆదేశములను  చిత్తశుద్ధితో పాటింపుడు.

23. మీరు ఏ పని చేసినప్పటికిని దానిని చిత్తశుద్ధితో మనుష్యులకొరకు చేయుచున్న కార్యము వలెగాక, దేవుని కార్యముగా భావించి చేయుడు.

24. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునను విషయమును గుర్తుంచుకొనుడు. ఆయన తన ప్రజలకొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు.

25. తప్పుడు పనులు చేయువారు ఎవరైనప్పటికిని, అట్టి తప్పిదములకు ఫలితము అనుభ వింపగలరు. ఏలయన, దేవుని యందు పక్షపాతముండదు.