బలిపీఠము

1. అతడు దహనబలులర్పించుటకై తుమ్మ కొయ్యతో చదరముగానుండు బలిపీఠము తయారు చేసెను. అది ఐదుమూరల పొడవు, ఐదుమూరల వెడల్పు, మూడుమూరల ఎత్తు ఉండెను.

2. దాని నాలుగు మూలలందు నాలుగు కొమ్ములు నిలిపెను. అవి బలిపీఠముతో ఏకాండమైయుండెను. బలిపీఠము నంతికి ఇత్తడిరేకును తొడిగెను.

3. బలిపీఠమునకు వలయు ఉపకరణములను అనగా పళ్ళెరములు, గరిటెలు, నీళ్ళు చిలుకరించు గిన్నెలు, ముళ్ళగరిటెలు, నిప్పునెత్తు పళ్ళెరములు ఇత్తడితో చేయించెను.

4. మరియు ఇత్తడితో జల్లెడవిం తడికను చేయించి దానిని బలిపీఠపుటంచు క్రిందనుండి సగమెత్తున అమర్చెను.

5. నాలుగు కడియములు చేయించి వానిని ఇత్తడి తడిక నాలుగువైపుల బిగించెను.

6. తుమ్మకొయ్యతో మోతకఱ్ఱలు చేయించి వానికి ఇత్తడి రేకును తొడిగించెను.

7. ఆ కఱ్ఱలను బలిపీఠమునకు ఇరువైపులనున్న కడియములలో దూర్చి దానిని మోసికొని పోవుదురు. బలిపీఠమునకు మధ్య బోలుగా ఉండునట్లు దానిని పలకలతో నిర్మించెను.

గంగాళము

8. సమావేశపుగుడారపు గుమ్మమునొద్ద పరిచర్య చేయు స్త్రీలు వాడుకొను ఇత్తడి అద్దములనుండి అతడు ఇత్తడి గంగాళమును, దాని ఇత్తడిపీటను తయారు చేసెను.

గుడారపు ఆవరణము

9. అతడు గుడారమునకు ఆవరణమును నిర్మించెను. ఆవరణము దక్షిణ దిక్కుకు పేనిన దారముతో నేసిన నారబట్టతో నూఱుమూరలు పొడవు గల తెరలు తయారుచేసెను.

10. వానిని ఇరువది స్తంభములకు తగిలించెను. ఆ కంబములను వాని దిమ్మలను ఇత్తడితో చేసెను. ఆ కంబములకు వెండి కొక్కెములును, దూర్పుడు వెండిబద్ద్దలును ఉండెను.

11. ఉత్తర దిక్కుననున్న తెరలు నూఱుమూరలు పొడవు గలవి. ఇరువది ఇత్తడి దిమ్మలలోనికి ఇరువది స్తంభములను దూర్చి వానికి ఈ తెరలను తగిలించెను. ఆ స్తంభములకు గూడ వెండికొక్కెములు, దూర్పుడు  వెండిబద్దలు ఉండెను.

12. పశ్చిమవైపుననున్న తెరపొడవు ఏబదిమూరలు. వానిని పది దిమ్మలలో నుంచిన పదిస్తంభములకు తగిలించెను. ఆ స్తంభము లకు వెండికొక్కెములు, దూర్పుడు వెండిబద్దలు ఉండెను.

13. ఆవరణము తూర్పువైపు ఏబది మూరలు వెడల్పు ఉండెను.

14. ఆ ఆవరణ ద్వారము నకు ఒక వైపున పదిహేను మూరలు పొడవుగల తెరలను ఉంచెను. మూడు దిమ్మెలలోనికి జొన్పిన మూడు స్తంభములకు వానిని తగిలించెను.

15. ఆ రీతిగనే ఆవరణ ద్వారమునకు ఇంకొక వైపుగూడ తెరలనమర్చెను. కనుక ఆవరణ ద్వారము నకు ఇరువైపుల పదిహేను మూరల పొడవు గల తెరలు. మూడేసి స్తంభములు మూడేసి దిమ్మలుండెను.

16. ఆవరణము చుట్టునున్న తెరలన్నియు పేనిన దారముతో, నారవస్త్రముతోను తయారుచేయబడెను.

17. స్తంభపు దిమ్మెలు ఇత్తడితో చేయబడినవి. స్తంభములకు తొడిగిన రేకులు, స్తంభపు కొక్కెములు, వానిలోనికి దూర్చిన బద్దలు వెండితో చేయబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండిబద్దలతో కలిపి వేయబడెను.

18. ఆవరణ ద్వారముపై వ్రేలాడుతెర ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితోపేనిన సన్నని దారముతో అల్లికపనిగా నేయబడియుండెను. దాని మీద అల్లికలుండెను. అది ఇరువదిమూరల పొడవు, ఆవరణపు తెరలవలె ఐదుమూరల ఎత్తుఉండెను.

19. అది నాలుగు ఇత్తడి దిమ్మలలో అమర్చిన నాలుగుస్తంభములపై వ్రేలాడుచుండెను. ఆ స్తంభముల మీద తొడిగిన రేకు, వాని బద్దెలు, కొక్కెములు వెండితో చేయబడెను.

20. గుడారమునకు దాని చుట్టునున్న ఆవరణమునకు వాడబడిన మేకులన్నియు ఇత్తడితోనే చేసిరి.

గుడారమునకు వాడిన లోహము

21. శాసనములు వ్రాసిన పలకలను గుడారమున ఉంచిరిగదా! ఆ గుడారమును కట్టుటకు వాడిన లోహముల లెక్క యిది. మోషే ఆజ్ఞపై యాజకుడగు అహరోనుని కుమారుడగు ఈతామారు ఈ లెక్కను తయారు చేసెను.

22. ప్రభువు ఆజ్ఞాపించిన రీతిగనే మోషే యూదాతెగకు చెందిన హూరు మనుమడును ఊరీ కుమారుడగు బేసలేలు సమస్తమును తయారు చేసెను.

23. దానుతెగకు చెందిన అహీసామాకు కుమారుడు ఒహోలియాబు అతనికి తోడ్పడెను. అతనికి రాళ్ళపైచెక్కుట, నమూనాలు తయారుచేయుట, ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితోను నారతోను వస్త్రములు నేయుట బాగుగా తెలియును.

24. గుడారమునకు వాడిన ప్రతిష్ఠితబంగార మంతయు కలిసి పరిశుద్ధస్థలపు తులామానము తూనిక చొప్పున నూటపదహారు మణుగుల, ఐదు వందల ముప్పది తులములు.

25. ఆ బంగార మంతయు ప్రజలు ప్రభువునకు సమర్పించుకొనినదే. యిస్రాయేలు ప్రజల జనాభాలెక్క వ్రాసినపుడు ప్రోగుచేసిన వెండి పరిశుద్ధస్థలపు తులామానము తూనికచొప్పున నాలుగు వందల మణుగుల, పదునైదువందల డెబ్బదిఐదు తులములు.

26. ఇరువది ఏండ్లు మరియు పైబడి జనాభా లెక్కలో చేరిన పురుషులు ఆరులక్షల మూడు వేల ఐదు వందల యేబది మంది. వీరు ఒక్కొక్కరు అదే తులామానము తూనిక ప్రకారము అరతులము వెండి చొప్పున సమర్పింపగా ప్రోగైన వెండి అదియే.

27. ఆ మొత్తము వెండిలో నాలుగువందల మణుగులు పరిశుద్ధస్థలములోని దిమ్మెలకు, అడ్డుతెర దిమ్మెలు చేయుటకు వాడబడెను. నూరు దిమ్మెలకు ఒక్కొక్క దానికి నాలుగు మణుగుల వెండి వాడబడెను.

28. మిగిలిన పదుహేను వందల డెబ్బది ఐదు తులముల వెండితో స్తంభములు, కొక్కెములు, ఆ స్తంభముల మీదిరేకులు, స్తంభములలో దూర్చినబద్దలు తయారు చేసిరి.

29. ప్రభువునకు అర్పించిన ఇత్తడి రెండు వందల ఎనుబది మణుగుల, రెండువేల నాలుగువందల తులములు.

30-31. దానితో అతడు సమావేశపు గుడారపుగుమ్మమునకు దిమ్మలను, ఇత్తడి బలిపీఠమును, దాని జల్లెడను, దాని ఉపకరణము లను, ఆవరణపు దిమ్మెలను, ఆవరణపు ద్వారపుదిమ్మె లను, గుడారపు మేకులను, ఆవరణపు మేకులను తయారు చేసెను.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము