మందసము

1. బేసలేలు తుమ్మకఱ్ఱతో మందసము చేసెను. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకిన్నర మూర, ఎత్తు ఒకిన్నర మూర ఉండెను.

2. దానికి లోపల వెలుపల మేలిమి బంగారు రేకును అతికెను. దాని అంచులయందు బంగారపురేకు కట్టునుంచెను.

3. ఆ పెట్టెకు నాలుగు బంగారు కడియములు చేయించెను. ఒక ప్రక్క రెండు మరియొక ప్రక్క రెండు ఉండునట్లుగా ఆ కడియములను నాలుగుకాళ్ళకు అమర్చెను.

4. తుమ్మకొయ్యతోనే మోతకఱ్ఱలు గూడ చేయించి వానికి బంగారురేకులు తొడిగించెను.

5. పెట్టెను మోసికొనిపోవుటకై దాని ప్రక్కలనున్న కడియములలో ఆ మోతకఱ్ఱలను దూర్చెను.

6. రెండున్నర మూరల పొడవు, ఒకిన్నర మూర వెడల్పు గల కరుణాపీఠమును మేలిమి బంగారముతో చేయించెను.

7. ఈ కరుణాపీఠము రెండుకొనలవద్ద కమ్మచ్చున తీసిన బంగారముతో రెండు కెరూబీము దూతలబొమ్మలను తయారు చేసెను.

8.వానిని కరుణా పీఠము రెండుకొనలయందు కరుణాపీఠముతో ఏకాండముగా చేయించెను.

9. ఆ దూతల బొమ్మలు రెక్కలు పైకి విచ్చుకొని కరుణాపీఠమును కప్పివేయు చుండెను. అవి ఒకదానికొకి ఎదురుగా నుండి కరుణాపీఠమువైపు చూచుచుండెను.

రొట్టెలను సమర్పించుటకు బల్ల

10. అతడు రెండు మూరల పొడవు, ఒక మూర వెడల్పు, ఒకిన్నర మూర ఎత్తు గల బల్లను తుమ్మకఱ్ఱతో తయారుచేసెను.

11.ఆ బల్లకు మేలిమి బంగారురేకుతొడిగి దాని అంచులచుట్టు మేలిమి బంగారుకట్టు నుంచెను.

12. బల్లచుట్టు బెత్తెడు వెడల్పు గల బద్దెను చేసి ఆ బద్దె చుట్టు బంగారపు కట్టు నుంచెను.

13. నాలుగు బంగారు కడియములను చేసి, నాలుగుకాళ్ళు గల బల్ల నాలుగు మూలల తగిలించెను.

14. దానిని మోసికొనిపోవు మోతకఱ్ఱలు దూర్చుటకు తగినట్లుగా కడియములను బద్దెకు దగ్గరగా అమర్చెను.

15. ఆ మోతకఱ్ఱలను తుమ్మ కొయ్యతో చేయించి వానికి బంగారురేకు తొడిగెను.

16. ఆ బల్లపైని వాడుటకై పళ్ళెములు, గిన్నెలు, కూజాలు, పానీయార్పణమునకు వలయు పాత్రము లను మేలిమిబంగారముతో చేయించెను.

దీప స్తంభము

17. అతడు మేలిమి బంగారముతో దీప స్తంభము చేయించెను. దాని పీఠమును, కాండమును కమ్మచ్చున తీసిన బంగారముతో చేయించెను. ఆ కాండముమీదనున్న గిన్నెలవిం మొగ్గలు, దళములు దానితో కలిసిపోయి నగిషీపనిగా చేయించెను.

18. దానికి ఈ వైపున మూడు, ఆ వైపున మూడు మొత్తము ఆరు కొమ్మలుండెను.

19. ఆ ఆరు కొమ్మలకు బాదము పూలవలెనున్న గిన్నెలవిం మొగ్గలును, దళములను అమర్చెను.

20. దాని కాండమున గూడ బాదముపూలవిం మొగ్గలు దళములు నాలుగు ఉండెను.

21. దీపస్తంభమునందలి ప్రతి రెండు కొమ్మల మొదిలో ఒక్కొక్క గిన్నె చొప్పున అమర్చెను.

22. ఆ గిన్నెలు, కొమ్మలు, దీపస్తంభము ఏకాండమై యున్నవి. వానినన్నిని కమ్మచ్చున తీసిన బంగారము తోనే చేయించెను.

23. అతడు దీపస్తంభమునకు ఏడుదీపములు చేయించెను. ఆ దీపములకు వలయు కత్తెరలు, పళ్ళెములు మేలిమి బంగారముతోనే చేసెను.

24. దీపస్తంభమును దాని ఉపకరణములను చేయు టకు నలువది వీసెల మేలిమి బంగారము పట్టెను.

ధూపపీఠము, అభిషేకతైలము, సాంబ్రాణి

25. అతడు ధూపము వేయుటకై తుమ్మకఱ్ఱతో ఒక పీఠము తయారుచేయించెను. అది చదరముగా నుండెను. దాని పొడవు ఒకమూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండుమూరలు ఉండెను. ఆ పీఠము కొమ్ములు దానితో ఏకాండమై ఉండెను.

26. అతడు పీఠము మీది భాగమునకు, నాలుగు అంచులకు, కొమ్ములకు అచ్చమైన బంగారురేకును తొడిగెను. పీఠమునకు బంగారుకట్టు వేయించెను.

27. దానిని మోసికొని పోవుటకు రెండు బంగారు కడియములు చేయించి వానిని ఆ కట్టుకు క్రింద ఇరువైపుల అమర్చెను. ఆ కడియముల లోనికి మోతకఱ్ఱలు దూర్చి పీఠమును మోసికొని పోవలెను.

28. మరియు తుమ్మకొయ్యతో మోతకఱ్ఱలను చేయించి వానికి బంగారురేకును తొడిగించెను.

29. అతడు అభిషేకము నకు వాడు పరిశుద్ధతైలమును తయారుచేయించెను. సుగంధ ద్రవ్యకారులు చేయురీతిగనే నిర్మలమైన పరిమళపు సాంబ్రాణినిగూడ సిద్ధము చేయించెను.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము