యూదా రాజ్యమున ఆహాసు పరిపాలన (క్రీ.పూ. 736-716)

16 1. యిస్రాయేలు రాజ్యమున రెమల్యా కుమారు డగు పెక పరిపాలనాకాలమున పదునేడవయేట యోతాము కుమారుడైన ఆహాసు యూదాకు రాజయ్యెను.

2. అతడు ఇరువదియవయేట రాజై యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలించెను. ఆ రాజు తన పితరుడైన దావీదువలె ధర్మబద్ధముగా జీవింపడయ్యెను.

3. పైగా యిస్రాయేలు రాజుల దుశ్చరితములను అనుకరించెను. తన సొంత కుమారునే విగ్రహము లకు దహనబలిగా సమర్పించెను. యిస్రాయేలీయులు కనాను మండలములో ప్రవేశించినపుడు ప్రభువు అచినుండి తరిమివేసిన ప్రజలు ఇట్టి చెడ్డపనులు చేసెడివారు.

4. ఉన్నతస్థలములలోను, పచ్చని చెట్ల క్రిందను ఆహాసు బలులర్పించి సాంబ్రాణి పొగవేసెను.

5. ఆ రోజులలో సిరియారాజగు రెసీను, యిస్రా యేలు రాజగు పెక యెరూషలేమును ముట్టడించిరి. కాని దానిని ఆక్రమించుకోలేకపోయిరి.

6. ఆ కాల ముననే ఎదోమురాజు ఏలాతు నగరమును మరల ఆక్రమించి అచట వసించు యూదీయులను వెడల గొట్టెను. ఎదోమీయులు ఏలాతున స్థిరపడి నేికిని అచటనే నివసించుచున్నారు.

7. ఆహాసు అస్సిరియా రాజు తిగ్లత్‌పిలేసెరు వద్దకు దూతలను పంపి ”నన్ను నీ దాసునిగాను, కుమారునిగాను భావింపుము. సిరియా యిస్రాయేలురాజులు నా మీదికి దండెత్తివచ్చిరి. నీవు స్వయముగా వచ్చి వారి బారినుండి నన్ను కాపాడుము” అని అర్థించెను.

8. అతడు దేవాలయ కోశాగారము నందు, ప్రాసాద కోశాగారమునందు ఉన్న వెండిబంగా రములను గైకొని అస్సిరియా రాజునకు కానుకగా పంపించెను.

9. తిగ్లత్‌పిలేసెరు అతని మనవిని ఆలించి దమస్కుపై దాడిచేసి, ఆ నగరమును జయించి రెసీను రాజును వధించెను. ఆ దేశప్రజలను చెరగొని కీరు నగరమునకు కొనిపోయెను.

10. ఆహాసు దమస్కున నున్న తిగ్లత్‌పిలేసెరును దర్శింపబోయినపుడు అచట ఒక బలిపీఠమును చూచెను. అతడు అన్ని వివరములతో ఆ బలిపీఠము నమూనాను తయారుచేయించి యెరూషలేమున నున్న యాజకుడు ఊరియా వద్దకు పంపెను.

11. ఆహాసు మరలి రాక ముందే ఊరియా ఆ బలిపీఠము నమూనా ప్రకారము ఒక బలిపీఠమును తయారు చేయించెను.

12. రాజు దమస్కు నుండి తిరిగివచ్చి బలిపీఠము సిద్ధమైయుండుట చూచి, దానిని సమీపించి, దానిని ఎక్కి బలులర్పించెను.

13. దహనబలిని, ధాన్యబలిని, సమాధానబలి పశువు రక్తమును దానిమీద ధారపోసెను.

14. పూర్వము ప్రభువుసాన్నిధ్యమున నున్న కంచుబలిపీఠము దేవళము ముంగిటనుండు స్థలమునుండి తాను తయారు చేయించిన నూతన బలిపీఠమునకును, ప్రభువు దేవళ మునకును మధ్యనుండి తొలగించి, ఆ నూతన బలిపీఠ మునకు ఉత్తరదిశకు మరలించెను.

15. అతడు యాజకుడైన ఊరియాతో ”ఇకమీదట ఉదయకాలపు దహనబలిని, సాయంకాలపు ధాన్యబలిని, రాజు, ప్రజలు సమర్పించు దహనబలులు, ధాన్యబలులు, ప్రజల అర్పణ ఈ పెద్దబలిపీఠము మీదనే అర్పింప వలయును. బలిపశువుల నెత్తురు ఈ బలిపీఠము మీదనే కుమ్మరింపవలయును. ఆ కంచు బలిపీఠ మును మాత్రము నేను దేవుని చిత్తమును తెలిసికొను పరికరముగా వాడుకొందును” అని చెప్పెను.

16. యాజకుడు ఊరియా ఆహాసురాజు చెప్పినట్లే చేసెను.

17. ఆహాసు దేవాలయమున ఉపయోగించు ఇత్తడిబండ్లను వానిమీది సిబ్బెలను తొలగించెను. పండ్రెండు కంచు ఎద్దుల మీద నిలిచియున్న కంచు త్టొిని గూడ తొలగించి దానిని రాతిదిమ్మెల మీద నిలిపెను.

18. అతడు అస్సిరియా రాజునకు భయపడి విశ్రాంతిదినపు ఆచరణ కొరకై మందిరములో కట్ట బడిన మండపమును దేవాలయము నుండి తొల గించెను. ప్రాసాదము నుండి దేవాలయమునకు పోవుటకు రాజు స్వయముగా వాడుకొను మార్గమును కూడ మూయించెను.

19. ఆహాసు చేసిన ఇతర కార్యములు యూదారాజులచరితమున లిఖింపబడియే ఉన్నవి.

20. ఆహాసు తన పితరులతో నిద్రించి, దావీదు నగరమున తన పితరుల సమాధులలో పాతి పెట్టబడెను. అటుపిమ్మట అతని కుమారుడు హిజ్కియా పాలించెను.