ఉపోద్ఘాతము:

పేరు: పౌలుగారి లేఖల్లో అతిచిన్నది. ఫిలేమోను కొలొస్సీయ క్రైస్తవుడు (కొలొస్సీ 4:9). దేవుని ప్రజలయెడల ప్రేమతో మెలిగాడు (వ. 5).

కాలము: క్రీ.శ. 60-62.

రచయిత: పునీత పౌలు.

చారిత్రక నేపథ్యము: ఈ గ్రంథానికి కొలొస్సీ గ్రంథానికి పోలికలుంటాయి. ఫిలేమోను కొలొస్సీలో జీవించిన ధనవంతుడు. భార్య అఫియ, కుమరుడు అర్కిపు (వచ. 1, 2). కొలొస్సీలోని సంఘం ఇతని ఇంటి యందే సమావేశమయ్యేది.  ఫిలేమోను క్రింద పనిచేసిన అనేకమంది బానిసలలో ఒనేసిము ఒకడు. ఒక నేరం క్రింద పారిపోయి రోములోని పౌలును చేరుకున్నాడు. పౌలు కొలొస్సీ పత్రికను ఒనేసిము ద్వారా ఫిలేమోనుకు పంపించాడు. ఒనేసిమును తుకితుతో కలసి పంపాడు.

ముఖ్యాంశములు: నేరస్థులను క్షమించి స్వీకరించాలని పౌలు అర్థించడం ప్రధానాంశం (వచ. 16-17). నేరస్థుడు యజమానునికి నష్టపరిహారం చెల్లించ సిద్ధపడడం (వచ.18-19), పౌలు చెరసాల విడుదల అనంతరం బస ఏర్పాటు కోరడంఈలేఖ మరొక ఉద్దేశ్యం (వచ.22).ప్రార్థించునప్పుడెల్ల ఫిలేమోనును స్మరించుకొని దేవునికి కృతజ్ఞతలర్పిస్తానని పౌలు చెప్పడం ప్రేరణాత్మకం (వచ. 4). ఫిలేమోను మంచితనాన్ని ప్రస్తావించి, అభినందించాడు (వచ. 5). ఒనేసిమును గూర్చి పౌలు విన్నవించు కోవడం కూడా ఆదర్శం (వచ. 12). యజమానుడు, బానిసలమధ్య నూతన ప్రేమపూరిత అనుబంధంగూర్చి చర్చించడం స్ఫూర్తిదాయకం (వచ. 16).

క్రీస్తు చిత్రీకరణ: ప్రేమ ద్వారా నేరస్థుని పక్షాన తీర్పు జరుగుతుంది (వచ. 10-17). క్రీస్తు దేవుని సమక్షాన మన తరపున విజ్ఞాపన చేస్తారు.