ఎఫెసు నగరములో పౌలు

19 1. అపొల్లో కొరింతులో ఉండగా, పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవుచు ఎఫెసు చేరుకొనెను. అక్కడ అతడు కొందరు శిష్యులను చూచి, 2. వారితో ”మీరు విశ్వాసులైనపుడు పవిత్రాత్మను పొందితిరా?” అని ప్రశ్నించెను. అందుకు వారు ”పవిత్రాత్మ ఉన్నాడను విషయము మేము విననైనలేదు” అని పలికిరి.

3. ”అటులయిన, ఎట్టి బప్తిస్మమును మీరు పొందితిరి?” అని పౌలు వారలను అడుగ, ”యోహాను బప్తిస్మము” అని వారు జవాబిచ్చిరి.

4. అప్పుడు పౌలు, ”యోహాను తన తరువాత రాబోవు వ్యక్తియైన యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు, వారికి పాపపశ్చాత్తాపమును సూచించు బప్తిస్మమును ఒసగెను” అని పలికెను.

5. వారు అది విని, యేసు ప్రభువు పేరిట జ్ఞానస్నానమును పొందిరి.

6. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా, పవిత్రాత్మ వారిపై వేంచేసెను.  అప్పుడు  వారు  భాషలలో మాట్లాడుచు ప్రవచింప నారంభించిరి.

7. వారు రమారమి పండ్రెండు మంది.

8. పౌలు ప్రార్థనామందిరములోనికి వెళ్ళి, మూడుమాసములవరకు, ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు, తర్కించుచు, దేవుని రాజ్యమును గూర్చి వారికి నమ్మకము కలిగింప ప్రయత్నించుచుండెను.

9. కాని వారిలో కొందరు మూర్ఖులై విశ్వసింపక జనసమూహము ఎదుట, ప్రభువు మార్గమును గూర్చి చెడుగా మాట్లాడిరి. అందుచే పౌలు, వారిని విడిచి, శిష్యులను వెంటబెట్టుకొని పోయి ప్రతిదినము తిరాన్ను అనువాని ఉపన్యాస మందిరములో వాదించుచుండెను.

10. ఇట్లు రెండేండ్లు గడచిన తరువాత, ఆసియా మండలములో నివసించు యూదులు, గ్రీకులు అందరు ప్రభువు వాక్కును వినిరి.

స్కెవ అనువాని కుమారులు

11. దేవుడు పౌలు హస్తముల ద్వారా అసాధారణమైన అద్భుతములను చేయుచుండెను.

12. అందుచే అతని చేతిగుడ్డలనైనను, నడుమునకు కట్టుకొను వస్త్రములనైనను, జబ్బుగా ఉన్నవారల వద్దకు తీసికొనిరాగా, వారి వ్యాధులు నయమయ్యెను. అపవిత్రాత్మలు వారిని విడిచిపోయెను.

13. దేశములో సంచారము చేయుచు అపవిత్రాత్మలను వెళ్ళ గొట్టుచున్న కొందరు యూదులు కూడ, ప్రభువైన యేసు పేరిట అపవిత్రాత్మలను పారద్రోల ప్రయత్నించిరి. వారు ఆ అపవిత్రాత్మలతో, ”పౌలు బోధించుచున్న యేసు పేరిట నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను” అని పలికిరి. 

14. యూదుల ప్రధానార్చకుడైన స్కెవ అనువాని ఏడుగురు కుమారులు అటుల చేయుచుండిరి.

15. వారు, ఆ అపవిత్రాత్మను పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు అది, ”యేసును నేను ఎరుగుదును, పౌలును గూర్చియు ఎరుగుదును. కాని, మీరు ఎవరు?” అని పలికెను.

16. అపవిత్రాత్మ పట్టిన ఆ మనుష్యుడు ఉవ్వెత్తుగా లేచి వారిపై పడగా వారందరు వస్త్రహీనులై గాయపడి, ఆ ఇంటి నుండి పరుగెత్తిరి.

17. ఎఫెసు నగరములో నివసించుచున్న యూదులు, గ్రీకులు అందరు దీనిని విని భయభ్రాంతులైరి. ప్రభువైన యేసు నామము సన్నుతింపబడెను.

18. విశ్వాసులలో అనేకులు వచ్చి, వారు చేసిన క్రియలను బహిరంగముగా వివరించుచు ఒప్పుకొనిరి.

19. మాంత్రికులలో అనేకులు తమ గ్రంథములను ప్రోగుజేసి, అందరి ఎదుట వాిని తగులబ్టెట్టిరి. వారు ఆ పుస్తకముల వెలను లెక్కవేయగా, ఏబదివేల వెండినాణెము లాయెను.

20. ఇట్లు ప్రభువు వాక్కు ప్రబలమగుచు వ్యాపించెను.

ఎఫెసు నగరములో సంక్షోభము

21. ఇవి అన్నియు జరిగిన తరువాత పౌలు మాసిడోనియా, అకయాల మీదుగా పయనించి, యెరూషలేమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొని, ‘నేను అక్కడకు పోయిన పిదప, రోము పట్టణమును గూడ తప్పనిసరిగా దర్శింపవలెను’ అని అనుకొనెను.

22. కనుక పౌలు తన సహాయకులైన తిమోతి, ఎరాస్తు అనువారలను మాసిడోనియాకు పంపి, తాను ఇంకను కొంతకాలము ఆసియా మండలములోనే గడపెను.

23. ఆ కాలములోనే అక్కడ ఎఫెసు నగరములో ప్రభువు మార్గమును గురించి, ఒక తీవ్రమైన సంక్షోభము చెలరేగెను.

24. ఎందుకన, దేమేత్రియసు అను ఒక కంసాలి, ‘అర్తెమి’ అను దేవత క్షేత్రముల నమూనాలను వెండితో తయారుచేయుచు, ఆ వ్యాపార ములో తనకు, తన పనివారలకు గొప్ప లాభమును గడించుచుండెను.

25. అందుచే అతడు తన పనివార లను, అదే వృత్తియందున్న తదితరులను సమావేశపరచి, వారితో, ”మిత్రులారా! ఈ వృత్తివలననే మనకు మంచి లాభము లభించుచున్నదని మీరు ఎరుగుదురు.

26. పౌలు చేయుచున్న పనిని మీరు స్వయముగా చూచుచు, వినుచున్నారు. మానవులచేత చేయబడిన విగ్రహ ములు ఏ మాత్రము దేవుళ్ళు కారని చెప్పుచు, ఇక్కడ ఎఫెసు నగరములోను, దాదాపుగ ఆసియా మండల మంతటను పెక్కుమంది ప్రజలను నమ్మించి తన పక్షమున చేర్చుకొనుచున్నాడు.

27. అందుచే, మన వ్యాపారమునకు చెడ్డపేరు వచ్చు ప్రమాదమున్నది. అంతేగాక ‘అర్తెమి’ అను మన గొప్ప దేవత గుడికి విలువలేకుండ పోవును. పైపెచ్చు. ఆసియాలోను, ప్రపంచమంతటను ప్రతివాని చేత పూజింపబడుచున్న ఆమె మాహాత్మ్యము కూడ పడిపోవును” అని హెచ్చరిక చేసెను.

28. వారు ఈ మాటలు విని మండిపడి, ”అర్తెమి ఎఫెసు నగరపు గొప్పదేవత” అని కేకలు వేయసాగిరి.

29. ఈ కోలాహలము ఇంతింతై నగరమంతయు అలముకొనెను. అప్పుడు ఆ అల్లరి మూక పౌలుతో పయనించిన మాసిడోనియా వాసులగు గాయు, అరిస్టార్కులను వెంటనే పట్టుకొని, ఈడ్చుకొని వచ్చి, ఒక నాటకశాలలో చొరబడిరి.

30. పౌలు జన సమూహములోనికి పోవలెనని వాంఛించెను. కాని శిష్యులు అతనిని పోనీయలేదు.

31. అతని స్నేహితు లగు కొందరు దేశాధికారులు కూడ అతనిని ఆ నాటక శాలవద్దకు పోవద్దని బ్రతిమాలుచు, పౌలుకు ఒక వార్తను పంపిరి.

32. ఇంతలో ఆ సమావేశమంతయు గందరగోళమయ్యెను. కొందరు ఒక రీతిగా, మరి కొందరు వేరొకరీతిగ అరచుచు కేకలువేసిరి. ఈ సభ్యులలో అనేకులకు వారచట ఎందుకు సమావేశ మైనది తెలియలేదు.

33. యూదులు అలెగ్జాండరును ముందుకు త్రోయగా ఆ గుంపులోని కొందరు అతడు మ్లాడవలెనని ప్రోత్సహించిరి. అప్పుడు అలెగ్జాండరు నిశ్శబ్దముగా ఉండుడని  చేసైగ  చేసి  జరిగిన  దానిని సమర్థించుచు ప్రసంగింప ప్రయత్నించెను.

34. కాని అతడు యూదుడు అని గ్రహింపగనే వారందరు, ”అర్తెమి, ఎఫెసు నగరపుదేవత గొప్ప”దని రెండు గంటలసేపు గొంతు చించుకొనుచు కేకలువేసిరి.

35. ఎట్టకేలకు ఆ నగర పాలకసంస్థ కార్యదర్శి ఆ జనసమూహమును శాంతపరచుచు వారితో, ”ఎఫెసు నగరవాసులారా!   ఎఫెసు  నగరము పరలోకమునుండి ఊడిపడిన గొప్పదైన అర్తెమి దేవత గుడిని, కాపాడుచున్నదని తెలియనివాడు ఎవడు? 

36. ఈ సంగతి నిర్వివాదాంశమైనది. కనుక మీరు శాంతము కలిగి, తొందరపడి, ఏమియు  దురుసుగా చేయకుండుట అవశ్యము.

37. వీరు మన దేవత గుడిని దోచుకొనలేదు. మన దేవతను దూషింపలేదు. అయినను వీరిని మీరు ఇక్కడకు తీసికొనివచ్చితిరి.

38. దేమేత్రియసు, అతని పనివారు ఎవరిని గురించి యైనను వ్యతిరేకముగా ఫిర్యాదు చేయదలచినచో న్యాయస్థానము పనిచేయు దినములలో అక్కడ చెప్పుకొనవచ్చును. అక్కడ న్యాయాధికారులు ఉన్నారు గదా! కనుక వారు అచటకు పోయి నేరారోపణ కావింపవచ్చును.

39. ఇతర విషయములు ఏమైన ఉన్నచో పౌరుల న్యాయసభలో అది నిర్ణయింప బడవలసియుండును.

40. ఏలయన, ఈ రోజున జరిగిన ఈ సంక్షోభమునకు మనము నేరస్థులమగు ప్రమాదమున్నది. ఈ అలజడికి మనము సరియైన కారణము కూడ చూపించలేము” అని పలికెను.

41. పిదప సభ సమాప్తమాయెను.