మోవాబును గూర్చి శోకగీతము
15 1. మోవాబును గూర్చిన దైవవాక్కు:
ఒక్క రాత్రిలోనే ‘ఆరు’ పట్టణము నాశన మయ్యెను. ఒక్క రాత్రిలోనే ‘కీరు’
పట్టణము ధ్వంసమయ్యెను. మోవాబున
నిశ్శబ్ధము తాండవించుచున్నది.
2. దీబోనుపౌరులు కొండనెక్కి
దేవళమునొద్ద ఏడ్చుచున్నారు.
మోవాబుప్రజలు నెబో, మేడెబా
నగరముల గూర్చి ప్రలాపించుచున్నారు.
వారు సంతాపముతో గడ్డము,
తలవెంట్రుకలను గొరిగించుకొనిరి.
3. వీధులలో నరులు గోనెతాల్చిరి.
ఇండ్లమీదను, నగరద్వారముచెంతను
ప్రజలుశోకించి కన్నీరుకార్చుచున్నారు.
4. హెష్బోను, ఎలాలె నగరములు
విలపించుచున్నవి. వాని శోకనాదము
యాహాసు వరకు వినిపించుచున్నది.
మోవాబు బంటులు గడగడలాడుచున్నారు.
వారికి ధైర్యముచెడినది.
5. మోవాబుకొరకు నా హృదయము
దురసిల్లుచున్నది.
దానిప్రజలు సోవరు వరకును,
ఎగ్లాతు షెలీషియా వరకును పారిపోయిరి.
కొందరు లూహీతు కొండమీదకు పోవుత్రోవనుబ్టి
ఏడ్చుచు ఎక్కుచున్నారు.
కొందరు హొరొనయీము త్రోవనుబ్టి
దీనముగా రోదించుచు పోవుచున్నారు.
6. నిమ్రీము నదీజలములు ఎండిపోయినవి.
దాని పచ్చిక మాడిపోయినది.
అచట పచ్చనిది ఎక్కడను కన్పింపదు.
7. ప్రజలు తమ వస్తువులను తీసికొని
నిరవంజిచెట్ల లోయగుండ పారిపోవుచున్నారు.
8. మోవాబు పొలిమేరలు అంతట
శోకాలాపములు వినిపించుచున్నవి.
ఎగ్లయీము, బేరెలీము నగరముల వరకు
ఆ ఏడ్పులు వినిపించుచున్నవి.
9. దీబోను నగరమునొద్ద నదీజలములు
రక్తసిక్తములైనవి.
నేను దీబోను ప్రజలకు ఇంత కంటె
అదనముగా చేటుకాలము కొనితెత్తును.
మోవాబునుండి తప్పించుకొనిన
వారందరి మీదికిని, ఆ దేశమున మిగిలియున్న
వారందరి మీదికిని సింహమును రప్పించెదను.