గ్రంథము – గొఱ్ఱెపిల్ల

5 1. ఆ సింహాసనాసీనుడగు వాని కుడి చేతియందు ఒక గ్రంథమును నేను చూచితిని. ఆ గ్రంథమునకు ఇరుప్రక్కల వ్రాయబడి ఉండెను. అది ఏడు ముద్రలచే ముద్రింపబడి ఉండెను.

2. అప్పుడు అటనున్న ఒక గొప్ప దేవదూత బిగ్గరగా ఇట్లు ప్రకించెను: ”ఈ ముద్రలను పగులగొట్టి గ్రంథమును విప్పగల యోగ్యుడెవడు?”

3. అయితే పరలోకమందుగాని, భూమి మీదగాని, భూమి క్రిందగాని ఆ గ్రంథమును తెరచి, లోని విషయములను గ్రహింపయోగ్యుడగు వ్యక్తి ఎవడును కానరాడయ్యెను.

4. గ్రంథమును తెరచుటకుగాని, లోని విషయమును గ్రహించుటకుగాని యోగ్యుడగువ్యక్తి ఒక్కడును లభింపకపోవుటచే నేను మిక్కిలి దుఃఖించితిని.

5. అప్పుడు ఆ పెద్దలలో  ఒకడు  నాతో ఇట్లు పలికెను: ”విలపింపకుము. చూడుము! యూదాజాతి సింహము, దావీదు సంతతిలో శ్రేష్ఠుడు, గెలుపొందినాడు, అతడే ఏడు ముద్రలను పగులగొట్టి గ్రంథమును తెరువగలడు.”

6. అప్పుడు ఆ సింహాసనము మధ్య  ఒక గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట కనుగొంటిని. అది నాలుగు జీవుల చేతను, పెద్దల చేతను పరివేష్టింపబడియుండెను. ఆ గొఱ్ఱెపిల్ల వధింపబడినట్లు ఉండెను. అది ఏడు కొమ్ములను, ఏడు కన్నులను కలిగియుండెను. అవి భువికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు.

7. సింహాసనాసీనుడైన వ్యక్తి కుడిచేతినుండి ఆ గొఱ్ఱెపిల్ల ఆ గ్రంథమును గ్రహించెను.

8. ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, ఇరువది నలుగురు పెద్దలును ఆ గొఱ్ఱెపిల్లముందు సాగిలపడిరి. ఆ పెద్దలందరును వీణలను ధరించి బంగారుపాత్రలలో ధూపములను అర్పించుచుండిరి. ఆ ధూప ద్రవ్యములే పరిశుద్ధుల ప్రార్థనలు: 9. వారొక క్రొత్తపాటను ఇట్లు పాడిరి:

               ”గ్రంథమును గ్రహించుటకును,

               దాని ముద్రలను పగులగొట్టుటకు

               నీవు యోగ్యుడవు. ఏలయన, నీవు వధింపబడి

               నీ రక్తమువలన ప్రతి జాతినుండి, భాషనుండి, ప్రజలనుండి, తెగనుండి దేవునకై ప్రజలను కొంటివి.

10.మన దేవుని సేవించుటకు వారిని ఒక రాజ్యటముగాను, యాజకులుగాను చేసితివి. వారు ఈ భువిని పాలింతురుగాక!”

11. నేను మరల చూచితిని. కోట్ల కొలదిగ దేవదూతలు పాడుట వింటిని. ఆ నాలుగు జీవులు, పెద్దలు, అందరును సింహాసనము చుట్టును నిలుచుండి ఇట్లు బిగ్గరగ పాడిరి.

12.          ”వధింపబడిన గొఱ్ఱెపిల్ల

               శక్తి,భాగ్యము,జ్ఞానము, బలము,

               గౌరవము, వైభవము,

               స్తోత్రము పొందుటకు యోగ్యమైనది!”    

13. త్రిలోకములయందలి ప్రతిజీవిని జలచరములను అన్నిటిని, సృష్టియందలి జీవకోటిని అంతటిని నేను వింటిని. వారు ఇట్లు పాడుచుండిరి:

               ”సింహాసనాసీనునకును, గొఱ్ఱెపిల్లకును

               స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము

               శాశ్వతమగును గాక!”

14. ఆ నాలుగు జీవులును ‘ఆమెన్‌’ అని సమాధాన మొసగెను.పెద్దలు సాగిలపడి నమస్కరించిరి.