సౌలు పరివర్తన  అతడు వారందరును    నకు

9 1. కాని ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకునియొద్దకు వెళ్ళి, 2. ఇంకను ప్రభువు మార్గమును అవలంబించుచున్న పురుషులు, స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థన మందిరము లకు పరిచయపత్రములను ఇమ్మని అతనిని అర్థించెను.

3. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశమునుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టును ప్రకాశించెను.

4. అప్పుడు అతడు నేలమీద పడిపోగ ”సౌలూ! సౌలూ! నీవేల నన్ను హింసించుచున్నావు?” అను స్వరము అతనికి వినబడెను.

5. ”ప్రభూ! మీరు ఎవరు  ?” అని అతడు ప్రశ్నించెను. ”నీవు హింసించుచున్న యేసును నేనే.

6. నీవు లేచి నగరములోనికి పొమ్ము. అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపబడును” అని ఆ స్వరము పలికెను. 7. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చినవారు నిశ్చేష్టులై నోటమాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి కాని వారికి ఏమియు కన్పింప లేదు.

8. తదుపరి సౌలు నేలపైనుండి లేచి కండ్లు తెరచెను. కాని అతడు ఏమియును చూడలేక పోయెను. అందుచే వారు అతని చేయిపట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి.

9. మూడురోజులవరకు అతడు ఏమియు చూడలేక పోయెను. ఆ మూడు దినములు అతడు అన్న పానీయములు ముట్టలేదు.

10. దమస్కులో అననియా అను పేరుగల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి ”అననియా!” అని పిలిచెను. అప్పుడు అననియా ”ప్రభూ! నేను ఇచ్చటనే ఉన్నాను”  అని బదులుపలికెను.

11. అంతట ప్రభువు ”నీవు లేచి ‘తిన్ననిది’ అనబడు వీధికి వెళ్ళుము. అచ్చట యూదా ఇంటిలో తార్సుపుర వాసి యైన సౌలు అను పేరుగల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు.

12. తనకు మరల చూపుకలుగునట్లు అననియా అను ఒక మనుష్యుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనమును చూచుచున్నాడు” అని అతనితో చెప్పెను.

13. అందుకు అననియా, ”ప్రభూ! ఈ మనుష్యుడు యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడు కావించేసి యున్నాడని చాలామంది అతనిని  గురించి  నాకు చెప్పియున్నారు.

14. మరియు మీ నామమున వేడు కొను వారందరను పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చ కులనుండి అధికారమును పొంది, దమస్కు పట్టణము నకు వచ్చియున్నాడు” అని ప్రభువుతో పలికెను.

15. ప్రభువు మరల అతనితో, ”నీవు వెళ్ళుము. ఏలయన, అన్యులకు, రాజులకు, యిస్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని.

16. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్నిబాధలు పడవలయునో నేను అతనికి చూపించెదను” అని చెప్పెను.

17. అననియా వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, ”సౌలు సోదరా! నీవు ఇక్కడకు వచ్చునపుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరల చూపును పొంది, పవిత్రాత్మతో నింపబడుటకుగాను నన్ను ఆయన పంపియున్నాడు” అని పలికెను.

18. అప్పుడు ఒక్కసారిగ సౌలు కన్నులనుండి పొరల వంటివి రాలి క్రిందపడగ అతనికి మరల చూపువచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానమును పొందెను.

19. పిమ్మట అతడు ఆహారమును పుచ్చుకొని బలము పొందెను.

దమస్కు పట్టణములో సౌలు ప్రసంగము

సౌలు  దమస్కులో కొన్ని రోజులు శిష్యులతో ఉండెను.

20. అతడు సరాసరి ప్రార్థనమందిరము లోనికి వెళ్ళి, ”యేసు దేవుని కుమారుడు” అని బోధింప మొదలుపెట్టెను.

21. అది విన్న వారందరు అబ్బురపడుచు, ”ఈ నామమును ఉచ్ఛరించు వారంద రిని యెరూషలేములో చంపించుచుండిన వాడు ఇతడే కదా? వారిని ప్టి బంధించి ప్రధానార్చకుల కడకు తీసి కొనిపోవుటకే కదా ఇతడు ఇచికి వచ్చినది!” అని చెప్పుకొనసాగిరి.

22. కాని, సౌలు మరి ఎక్కువగ బలపడి, ఈయనయే క్రీస్తు అని ఋజువుపరచుచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరచెను.

23. చాల రోజులు గడచిన తరువాత యూదులు ఒకచోట చేరి సౌలును చంపుటకు కుట్రపన్నిరి.

24. కాని వారు చేయబోవు కుతంత్రము అతని చెవిని పడెను. సౌలును చంపుటకై వారు రేయింబవళ్ళు నగర ద్వారములను కావలి కాయుచుండిరి.

25. అది కనిపెట్టి, సౌలు శిష్యులు ఒకరాత్రి అతనిని తీసుకొని పోయి, గంపలో కూర్చుండబ్టెి, గోడమీదనుండి అవతలకు దింపివేసిరి.

యెరూషలేములో సౌలు    

26. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలసికొనుటకు ప్రయత్నించెను. ఇతడుకూడ శిష్యుడయ్యెనను అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడన్నచో వారికి గుండెదడ పుట్టుచుండెను. 27. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి, అతనిని అపోస్తలులవద్దకు తీసికొనిపోయి, సౌలు మార్గమధ్యములో ఎట్లు ప్రభువును గాంచినదియు, ఆయన అతనితో ఎట్లు మ్లాడినదియు, సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పూసగ్రుచ్చినట్లు వివ రించెను.

28. అప్పటి నుండి సౌలు వారితో కలసి యెరూషలేమునందు అంతటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను.

29. అతడు గ్రీకుభాష మాట్లాడు యూదులతో గూడ మ్లాట్లాడుచు, వాదించుచుండుటచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి.

30. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియాకు తీసికొని పోయి, అక్కడనుండి అతనిని తార్సునకు పంపివేసిరి.

31. అందుచే యూదయా, గలిలీయ, సమరియా సీమలందంతట శాంతి చేకూరెను. అది దేవుని యెడల భయభక్తులతోడను, పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధికసంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను.

లిద్దా, యొప్పాలలో పేతురు

32. పేతురు అంతటను పర్యించుచు ఒకసారి లిద్దాలో ఉన్న పరిశుద్ధులను చూచుటకై వెళ్ళెను.

33. అక్కడ ఎనిమిది సంవత్సరములనుండి పక్షవాత రోగముతో బాధపడుచు, పడకనుండి లేచుటకైనను శక్తిలేని అననియా అను పేరుగల వానిని చూచి, 34. ” అననియా! యేసుక్రీస్తు నిన్ను బాగుచేసియున్నాడు. నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము” అని చెప్పగా, అతడు వెంటనే లేచెను.

35. లిద్దాలో, షారోనులో నివసించుచున్న వారందరును అదిచూచి ప్రభువును నమ్మిరి.

36. యొప్పాలో తబీత అను పేరుగల ఒక శిష్యురాలుండెను. గ్రీకుభాషలో ఆమెపేరు దోర్కా (అనగా జింక). ఆమె తన కాలమునంతటిని సత్కార్యములు చేయుటలోను, పేదలకు సాయపడుట లోను గడిపెను.

37. ఆ సమయములో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ఆమె దేహమునకు స్నానము చేయించి పై అంతస్తులోనున్న ఒక గదిలో ఉంచిరి.

38. లిద్దా యొప్పాకు దగ్గరలో నుండుటచే యొప్పాలోఉన్న శిష్యులు, పేతురు లిద్దాలో ఉన్న సంగతి విని, ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపుచు ”నీవు ఆలస్యము చేయక త్వరగా మా వద్దకు రమ్ము” అని అర్థించిరి. 39. పేతురు సిద్ధపడి వారితో అక్కడకు వెళ్ళెను. అక్కడకు చేరుకొనగానే వారు అతనిని పై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసికొనిపోయిరి. అక్కడ విధవరాండ్రు అందరు అతని చుట్టూచేరి ఏడ్చుచు దోర్కా తాను జీవించిన కాలములో సిద్ధపరచిన చొక్కా లను, అంగీలను ఆయనకు  చూపించిరి.

40. పేతురు వారందరిని గది నుండి బయటకు పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతము వైపునకు తిరిగి ”తబీత! లెమ్ము” అని పలుకగానే ఆమె కన్నులు తెరచి, పేతురును చూచుచు లేచి కూర్చుండెను.

41. ఆమె లేచి నిలువబడుటకు పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ పరిశుద్ధులను, విధవరాండ్రను పిలిచి సజీవురాలైన ఆమెను వారి ఎదుట ఉంచెను.

42. ఈ విషయము యొప్పా యందంతటను ప్రాకిపోవుటచే చాలమంది జనులు ప్రభువును విశ్వసించిరి.

43. పేతురు యొప్పాలో సీమోను అను పేరుగల ఒక చర్మకారుని వద్ద చాలరోజులపాటు ఉండెను.