తోటివానిపై తీర్పు

14 1. విశ్వాసమున బలహీనుడైన వ్యక్తిని మీలో చేర్చుకొనుడు. కాని, వ్యక్తిగతములగు అభిప్రాయ ములపై వానితో వాదింపకుడు.

2. ఒకడు ఏదియైనను తినవచ్చునని నమ్ముచున్నాడు. కాని, విశ్వాసమున బలహీనుడైన మరొకడు శాకాహారమునే భుజించు చున్నాడు.

3. అన్నింటిని తినువ్యక్తి తిననివ్యక్తిని నీచముగ భావింపరాదు. అట్లే అన్నింటిని తిననివ్యక్తి తినువానిని దోషిగా ఎంచరాదు. ఏలయన, దేవుడు అతనిని అంగీకరించియున్నాడు.

4. మరియొకని సేవకునిపై తీర్పు చెప్పుటకు నీవు ఎవ్వడవు? వాడు నిలిచినను, పడినను వాని సొంత యజమానుని ఎదుటనేగదా!  అయినను వాడు దృఢపడును. ప్రభువు వానిని దృఢపరచుటకు శక్తిగలవాడు.

5. ఒకడు ఒకదినముకంటె మరియొక దినము మంచిదని తలంచుచున్నాడు. మరియొకడు అన్ని రోజులను సమానముగ ఎంచుచున్నాడు. దానిని ప్రతి వ్యక్తియు తన మనసులో తానే రూఢిపరచుకొనవలెను.

6. ఒకానొకదినము చాల గొప్పదని తలచువాడు ప్రభువునందలి గౌరవముచేతనే అటుల చేయుచు న్నాడు. అన్నిని తినువాడు ప్రభువునందలి గౌరవము చేతనే ఆ విధముగ చేయుచున్నాడు. ఏలయన, తన ఆహారమునకై అతడు ప్రభువునకు కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాడు. కొన్నిని తిననివాడు ప్రభువు నందలి గౌరవముచేతనే ఆ విధముగ చేయుచున్నాడు. అతడును దేవునకు కృతజ్ఞతలు అర్పించుకొనుచు న్నాడు.

7. ఏలయన, మనలో ఎవ్వడును తన కొరకే జీవింపడు. ఎవ్వడును తనకొరకే మరణింపడు. 8. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించు చున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను, మరణించినను మనము ప్రభువునకు చెందినవారమే.

9. ఏలయన, జీవించియున్నవారిని, మరణించినవారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడయ్యెను. 10. కనుక మీరు మీ సోదరునిపై ఏల తీర్పు చెప్పుదురు? లేదా, మీరు మీ సోదరుని ఏల తృణీకరింతురు? మనము అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయ పీఠము ఎదుట నిలువబడుదుము.  

11.           ఏలయన, ”నా జీవముతోడు,

               ప్రతి మోకాలు నాయెదుట తప్పక

               మోకరించును. అందరును దేవుని స్తుతింతురు. అని ప్రభువు చెప్పుచున్నాడు”

అని వ్రాయబడియున్నది కదా!

12. కనుక మనలో ప్రతివ్యక్తియు దేవుని ఎదుట తననుగూర్చి లెక్క చెప్పు కొనవలసియుండును.

సోదరుని భ్రష్టుని చేయకుము

13. కనుక ఒకరిపై ఒకరము తీర్పు చేయుట మానివేయుదము. అంతేకాక సోదరునికి ఆటంకము కలుగజేయునదిగాని, అతడిని పాపాత్ముని చేయునది కాని, దేనినైనను చేయరాదని మీరు నిర్ణయించు కొనవలెను.

14. ఏదియును దాని అంతట అది అపరి శుద్ధము కాదు అని యేసుక్రీస్తు నందు నాకు నిశ్చయముగ తెలియును. కాని ఏదైన అపరిశుద్ధమని ఒకడు తలంచినచో అది అతనికి అపరిశుద్ధమే అగును.

15. నీవు తినినదానివలన, నీ సోదరుని బాధించినచో నీవు ఎంత మాత్రమును ప్రేమపూర్వకముగ ప్రవర్తించుట లేదు. నీవు తిను ఆహారముచే, క్రీస్తు ఎవనికొరకు మరణించెనో, వానిని నాశనము చేయకుము!

16. నీవు మేలని భావించునది దూషణలపాలు కాకుండ చూడుము.

17. ఏలయన, దేవునిరాజ్యము అనగా తినుట, త్రాగుట కాదు, పవిత్రాత్మయొసగు నీతి, శాంతి, సంతోషములే. 18. ఈ విధముగా క్రీస్తును సేవించువాడు దేవుని అంగీకారమును, మానవుని ఆమోదమును పొందును.

19. కనుక, సమాధానమును పరస్పర క్షేమాభి వృద్ధిని కలుగ జేయు విషయములనే ఆసక్తితో అనుసరించుదము.

20. భోజనమును బట్టి దేవుని పనిని పాడుచేయకుము. అన్ని ఆహారములు తినదగినవియే. కాని ఇతరుల పతనమునకు కారణమగునట్లు ఏమైనను భుజించుట దోషము.

21.  మాంసము తినకుండుట, మద్యపానము చేయకుండుట, సోదరుని పతనము చేయు ఏ పనిని చేయకుండుట మంచిది.

22. కావున, ఈ విషయమును గూర్చిన నీ విశ్వాసము నీకును దేవునకును మధ్యనే ఉంచుము. తాను ఆమోదించు క్రియలను చేసినపుడు శిక్షావిధిని పొందనివాడు ధన్యుడు.

23. కాని, తాను భుజించుదానిని గూర్చి ఎవడైన అనుమానము కలిగియు, దానిని భుజించిన యెడల వాడు దోషియగును, ఏలయన, వాడు చేయుపని విశ్వాసముపై ఆధారపడినది కాదు. అంతే కాదు, విశ్వాసముపై అధారపడనిది ఏదియైన పాపమే.