ముద్రలు

6 1. అప్పుడు గొఱ్ఱెపిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్రను విప్పుట చూచితిని. ఆ నాలుగు జీవులలో ఒకి ఉరుమువంటి కంఠస్వరముతో ”రమ్ము!” అని పిలిచెను.

2. నేను అటుచూడగా, అట ఒక తెల్లని గుఱ్ఱము ఉండెను. దానిపైనున్న ఆశ్వికుని హస్తమున ఒక విల్లు ఉండెను. అతనికి ఒక కిరీటము ఒసగబడెను. విజయునివలె అతడు జయింపనేగెను.

3. పిమ్మట  గొఱ్ఱెపిల్ల రెండవముద్రను విప్పెను.  అప్పుడు ఆ రెండవ జీవి ”రమ్ము” అనుట వింటిని.  

4. మరియొక గుఱ్ఱము బయల్వెడలెను. ఇది ఎఱ్ఱనిది. మానవులు ఒకరిని ఒకరు చంపుకొనుటకుగాను,  భువిపై సమాధానము లేకుండ చేయు శక్తి ఆ ఆశ్వికునకు ఒసగబడెను. అతనికి ఒక పెద్ద ఖడ్గము ఈయబడెను.        

5. తదనంతరము ఆ గొఱ్ఱెపిల్ల మూడవ ముద్రను విప్పెను. అప్పుడు ఆ మూడవ జీవి ”రమ్ము!” అని పిలిచెను. అట ఒక నల్లని గుఱ్ఱము నాకు గోచరమయ్యెను. ఆ ఆశ్వికుడు తన చేతియందు ఒక త్రాసును ధరించెను.

6. ఆ నాలుగు జీవులనుండి వెలువడిన ఒక విచిత్రస్వరమును నేను వింటిని. ఆ స్వరము ఇట్లు పలికెను: ”ఒక దినము కూలికి ఒక సేరు గోధుమలు. ఒక దినపు కూలికి మూడు సేర్లు యవలు. కాని ఓలీవు నూనెను, ద్రాక్షరసమును పాడుచేయకుడు!”

7. అంతట ఆ గొఱ్ఱెపిల్ల నాలుగవముద్రను విప్పెను. అప్పుడు ఆ నాలుగవ జీవి ”రమ్ము!” అని పిలిచెను.

8. అట ఒక పాలిపోయిన వర్ణముగల అశ్వమును నేను కనుగొంటిని. ఆ ఆశ్వికుని పేరు మృత్యువు. పాతాళమువాని వెన్నంటియే ఉండెను. భువియందు నాలుగవపాలు వారికి ఒసగబడెను. ఖడ్గముతోను, కరువుతోను, వ్యాధులతోను, క్రూర మృగముచేతను చంపుటకు వారికి అధికారము ఒసగబడెను.

9. అనంతరము గొఱ్ఱెపిల్ల ఐదవ ముద్రనువిప్పెను. అంతట దైవపీఠము క్రింద దేవుని వాక్కును ప్రకటించి విశ్వాసపాత్రులైన సాక్షులై, తత్ఫలితముగా  చంపబడినవారి ఆత్మలను చూచితిని.

10. పెద్ద స్వరములతో వారుఇట్లు అరచిరి: ”సర్వశక్తిమంతుడవగు ప్రభూ! పవిత్రుడా! సత్యస్వరూపీ! భూలోకవాసులను తీర్పునకు గురిచేయకుండుట ఎన్నినాళ్ళు? మా రక్తము నిమిత్తము వారిని శిక్షించుట ఎన్నడు?”

11. వారిలో ఒక్కొక్కనికి ఒక ధవళవస్త్రము ఇయ్యబడెను. తమవలెనే చంపబడవలసిన తమ సహోదరుల, సహసేవకుల లెక్క పూర్తి అయ్యెడు వరకు, ఇంకను కొంతకాలము ఓపిక పట్టవలసినదిగా వారితో చెప్పబడెను.

12. తరువాత ఆ గొఱ్ఱెపిల్ల ఆరవ ముద్రను విప్పుటచూచితిని. అంతట  ఒక భయంకరమగు భూకంపము సంభవించెను. సూర్యుడు కాంతివిహీనుడయ్యెను. అతడు ఒక నల్లని ముతక గుడ్డవలె ఉండెను. చంద్రుడు రక్తవర్ణము దాల్చెను.

13. నక్షత్రములు భువిపై రాలెను. అవి పెద్ద గాలికి అంజూరపు చెట్లనుండి రాలిపడెడి పచ్చికాయలవలె ఉండెను.

14. చుట్ట చుట్టిన కాగితమువలె ఆకాశము అదృశ్యమయ్యెను. పర్వతములు, ద్వీపములు స్థానభ్రంశము నొందెను.

15. అప్పుడు భువియందలి రాజులు, ప్రభువులు, సేనానాయకులు, ధనికులు, బలవంతులు,  బానిసలు, స్వతంత్రులు, సమస్త జనులు, కొండరాళ్ళలో గుహలలో తలదాచుకొనిరి.

16. ఆ పర్వతములతోను, ఆ శిలలతోను వారు: ”సింహాసనాసీనుని కన్నులబడకుండ మమ్ము దాచి వేయుడు! గొఱ్ఱెపిల్ల కోపమునకు గురికాకుండ మమ్ము కప్పి వేయుడు!

17.ఏలయన, వారు కోపించు దినము వచ్చినది. వారికి ఎవరు ఎదురు నిలువగలరు?” అని మొరపెట్టుకొనిరి.