ఉపోద్ఘాతము:

పేరు: ‘కొలొస్సి’ ఒక పట్టణం పేరు. ఇది ఆసియా మైనరు లికుసు అనే నది తీరం ఎగువభాగంలో వుంటుంది, ఎఫెస్సు పట్టణానికి 150 కి.మీ. దూరంలో వుంటుంది. జనాభాలోను, ఆర్థికంగానూ పెద్ద పట్టణమే. ఇచ్చటి ఉన్ని వస్త్రాలకు రంగు అద్దే పరిశ్రమలు ప్రసిద్ధికెక్కాయి. ఇచట లభించే ముదురు ఎరుపు రంగు ఉన్నిని ”కొలొస్సినిం” అంటారు. ఈ  కారణంగానే ఈ పట్టణాన్ని కొలొస్సి అని పిలిచారు.  క్రీ.శ. 60-61లో జరిగిన ఘోర భూకంపంలో ఈ పట్టణం ధ్వంసమైంది.

కాలము: క్రీ.శ. 60.

రచయిత: పునీత పౌలు. మరొక అభిప్రాయం ప్రకారం పౌలు మరణానంతరం (క్రీ.శ. 64-65లో) అతని అనుచరుల్లో ఒకరు రాసి వుండవచ్చు.

చారిత్రక నేపథ్యము: పౌలు ఈ పట్టణాన్ని చూడలేదు. ఈ పట్టణంలోని క్రైస్తవుల దృఢ విశ్వాసాన్ని గూర్చి తెలుసుకొని సంతోషం వ్యక్తపరచాడు (1:3-7; 2:6-7). పౌలు తన సువార్త సేవ సహచరుడైన ఎపఫ్రా ద్వారా అక్కడి ప్రజలు క్రీస్తు సువార్తను విన్నారు (1:7; 4:12-13). ఈ సంఘంలోని క్రైస్తవులు క్రీస్తుని నమ్ముతూ ఇతర సిద్ధాంతాలపై గూడ విశ్వాసం ప్రకటించారు.  ఇది రెంటికి చెడిన రేవడి లాగా వుంది. ఈ నేపథ్యంలోనే పౌలు క్రీస్తు సిద్ధాంతాలను ధ్రువీకరించాడు.

ముఖ్యాంశములు: పౌలు వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పటికి క్రుంగిపోలేదు. క్రీస్తుపై అతని విశ్వాసం చెక్కు చెదరలేదు. (1:4, 7, 12, 18, 27; 2:15, 22). విశ్వాసికి ఓదార్పు, శక్తి క్రీస్తులోనే, క్రీస్తు సువార్తలోనే వున్నాయి (3:8-10). క్రీస్తు శాస్త్రానికి ఈ గ్రంథం పట్టుకొమ్మ (1:15-20). క్రీస్తే సంపూర్ణ సత్యం, ఆధిపత్యం (1:15-23). క్రీస్తు నందు పరిపూర్ణత లభిస్తుంది (2:1-10). క్రీస్తు నందు సంపూర్ణ క్షమాపణ దొరుకుతుంది (2:11-15).

 క్రీస్తు చిత్రీకరణ: క్రీస్తు శాస్త్రానికి ఈ గ్రంథం ఛాయా చిత్రం. క్రీస్తు సృష్టి సమస్తానికి మూలం (1:15-16), పాలనాధికారుల శిరస్సు (2:10), తన మరణం ద్వారా మానవులను దేవునితో సమాధాన పరచారు (1:21-22; 2:13-15). విశ్వాసినమ్మకము (1:4, 22, 27). విశ్వాసి బలమైన ఆశయం (1:11, 29). దైవత్వము, సర్వ పరిపూర్ణత (1:15, 19; 2:9), సంఘానికి తల (1:18), పునరుత్థానుడైన దేవుని కుమారుడు (1:18, 19), రక్షకుడు (1:28; 2:3; 3:1-4). క్రీస్తునందే నూతన జీవితము.