10 1. యూదులచట్టము, రాబోవు మేలుల ఛాయ గలదియేగాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. ఏటేట ఎడతెగక ఒకే విధమైన బలులు అర్పింప బడుచుండెను. అటులైనచో ఈ బలుల మూలమున దేవుని చేరదలచిన ప్రజలను, చట్టము ఎట్లు సంపూర్ణులను చేయగలదు?

2.దేవుని పూజించు ప్రజలు నిజముగ వారి పాపములు తొలగింపబడి శుద్ధులై ఉన్నచో, ఇక ఏ మాత్రము వారు పాపాత్ములమనుకొనరు. అప్పుడు వానిని అర్పించుట మానుకొందురు గదా!

3. ప్రజలకు ఏటేట వారి పాపములను గూర్చి గుర్తుచేయుటకు ఈ బలులు తోడ్పడుచున్నవి.

4. ఏలయన ఎద్దులయొక్కయు, మేకలయొక్కయు రక్తము ఏనాటికిని పాపములను తొలగింపలేదు.

5.ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించునపుడు, దేవునితో క్రీస్తు ఇట్లుఅనెను:

               ”నీవు జంతుబలులను, అర్పణలను కోరలేదు. కాని నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి.

6.           దహన బలులకును, పాప పరిహారార్థమైన

               అర్పణలకును నీవు ఇష్టపడలేదు.”

7.            అప్పుడు నేను ఇట్లంటిని:

               ”నన్ను గూర్చి శాసన గ్రంథమునందు

               వ్రాయబడినట్లుగ,

               ఇదిగో! ఓ దేవా! నీ చిత్తమును నెరవేర్చుటకు

               నేను ఇట వచ్చి ఉన్నాను”.

8. ఆయన మొదట ఇట్లు చెప్పెను: ”బలులను, అర్పణలను, దహనబలులను, పాపపరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందలేదు.” ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను, ఆయన ఇట్లనెను.

9. తదుపరి ఆయన ”ఓ దేవా! నీచిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చియున్నాను” అని పలికెను. కనుక పాతబలులను అన్నిటిని తొలగించి వాని స్థానమున దేవుడు, రెండవదైన క్రీస్తు బలిని నియమించెను.

10. యేసు క్రీస్తు, దేవుడు తనను కోరినట్లొనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యర్పణచేత మనమందరమును, పాపములనుండి శాశ్వతముగ పవిత్రులుగ చేయబడితిమి.

11. ప్రతి యూద యాజకుడును అనుదినమును అర్చన ఒనర్చుచు, ఒకే రకమగు బలులనే పదేపదే అర్పించుచుండును. కాని ఆ బలులు ఏనాటికిని పాపములను తొలగింపలేవు.

12. అటుల కాక, క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాపపరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను.

13. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఒనర్చువరకు, ఆయన అచట వేచియుండును.

14. పాపములనుండి శుద్ధిపొందినవారిని, ఒకే ఒక బలిమూలముగ ఆయనశాశ్వతముగ పరిపూర్ణులుగ చేసెను.

15. పవిత్రాత్మ కూడ దీనికి సాక్షియే. ప్రథమమున ఆయన ఇట్లు చెప్పెను:

16.          ”ఆ దినములు కడచిన తరువాత వారితో

               నేనొక నిబంధన చేసికొందును.

               నా శాసనములను వారి

               హృదయములందు ఉంచుదును.

               వారి మనస్సులపై వ్రాయుదును.”

17.          తరువాత ఆయన,

               ”వారి అపరాధములను, దుష్కార్యములను,

               నేను ఇక ఎంత మాత్రము

               జ్ఞాపక ముంచుకొనను”

అని పలికెను.

18. కనుక ఇవి క్షమింపబడినపుడు పాపపరిహారార్థమైన బలి ఇక అవసరములేదు.

దైవసాన్నిధ్యమునకు యత్నము

19. సోదరులారా! యేసు రక్తమువలన, పవిత్ర స్థలమున ప్రవేశించుదుమని మనకు నమ్మకము కలదు.

20. తన శరీరము అను తెరద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరచెను.

21. దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్పయాజకుని మనము పొందిఉన్నాము.

22. కనుక మనము, కలుషములనుండి శుద్ధినొందిన నిష్కపటమగు హృదయములతోను, స్వచ్ఛమగు నీటితో కడుగబడిన శరీరములతోను, గట్టి విశ్వాసముతోను దేవుని సమీపింతము.

23. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును. కనుక మన నిరీక్షణను మనము దృఢముగ నిలిపి యుంచుకొందము.

24. మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి, మేలు చేయుటకు పరస్పరము ప్రేరేపించుకొనుటకు దారులు కనుగొందము.

25. సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారిన ప్పటికి మనము మాత్రము ఆ సమావేశమగుటయను అలవాటును విడనాడక, ప్రభువు దినము సమీపించు చున్నందున ఒకరిని ఒకరము మరింతగ ప్రోత్సహించుకొందము.

26. సత్యము మనకు తెలియజేయబడిన తరువాత కూడ మనము బుద్ధిపూర్వకముగ పాపములు చేయుచున్న యెడల, ఆ పాపములను తొలగింపగల బలి ఏదియును లేదు.

27. ఇక మిగిలినదేమన, భయముతో కూడిన న్యాయవిచారణ, దేవుని ధిక్కరించు వారిని దహించివేయు భయంకర అగ్ని అనునవియే.

28. ఏ వ్యక్తియైనను మోషే చట్టమునకు అవిధేయుడై ప్రవర్తించి, ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యాధారములతో దోషిగ నిర్ణయింప బడినచో నిర్దయగా చంపివేయబడును.

29. అటులయినచో దేవునిపుత్రుని తృణీకరించువాని గతి, తనను పవిత్రునిగ ఒనర్చిన దేవుని నిబంధన రక్తమును నీచముగ చూచువాని గతి దయామయుడగు ఆత్మను అవమానపరచువాని గతి ఏమగునని చెప్పవలయును? అతడెట్టి నీచమగు శిక్షకర్హుడో విచారింపుడు!

30.”నేను పగతీర్చుకొందును, నేను ప్రతీకారమొనర్తును” అనియు, ”ప్రభువు ఆయన ప్రజలకు తీర్పుచెప్పును” అని చెప్పిన వానిని మనము ఎరుగుదుము.

31. సజీవుడగు దేవుని చేతులలో చిక్కుట మహాభయంకరము.

32. గతించిన దినములలో మీరు ఎట్లుండిరో జ్ఞాపకము చేసికొనుడు. ఆ దినములలో మీరు వెలుగును పొందిన తరువాత, మీరు పెక్కు బాధలకు గురియైనను, ఆ పోరాటముచే భంగపడలేదు.

33. కొన్నిమార్లు మీరు బహిరంగముగ నిందింపబడి అవమానింపబడితిరి. మరికొన్నిమార్లు మీరు ఆ విధముగ అవమానింపబడు వారితో పాలివారైతిరి.

34. బందీల బాధలలో మీరు పాలుపంచుకొంటిరి. మీ ఆస్తులన్నియు స్వాధీనపరచుకొనబడినను, వానికంటె మరింత మేలైనదియు శాశ్వతముగ నిలిచియుండు నదియు మీకు మిగిలియున్నదని తెలియుటచే,  మీ నష్టమును మీరు సంతోషముతో భరించితిరి.

35. కావున మీ ధైర్యమును కోల్పోకుడు. ఆ ధైర్యమే మీకు గొప్పబహుమానమును తెచ్చును.

36. దేవుని సంకల్పమును నెరవేర్చి, ఆయన వాగ్దానఫలమును పొందుటకు మీరు ఓర్పువహింపవలెను.

37.         ”ఇక కొంచెము సేపు మాత్రమే,

               పిమ్మట వచ్చుచున్న ఆయన రాగలడు

               ఆయన ఆలస్యము చేయడు.

38.        నీతిమంతుడైన నా సేవకుడు

               విశ్వాసమూలమున జీవించును.

               కాని, అతడు విముఖుడైనచో,

               అతనియందు నా ఆత్మ ఆనందించదు.”

39. మనము విముఖులమై నశించువారము కాము. మన ఆత్మలను రక్షించుకొనుటకు మనము తగిన విశ్వాసము గలవారమైయున్నాము.