11. యేసుక్రీస్తు బహిరంగమొనర్చిన విషయములు ఇచట గ్రంథస్థము కావింపబడినవి. దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. అనతికాలమున ఏమి సంభవింపనున్నదియు ఆయనచే దేవుని సేవకులకు ప్రకింపబడవలెను. ఇది దేవుని అభిమతము. క్రీస్తు తన దూతద్వారా తన సేవకుడగు యోహానుకు ఈ విషయములను విదితము చేసెను.

2. తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను. ఇది దేవుని వాక్కును గూర్చియు, యేసు క్రీస్తు బహిరంగము చేసిన సాక్ష్యమును గూర్చియు యోహాను వ్రాసిన నివేదిక.

3. ఇవి అన్నియు అనతికాలముననే సంభవింప నున్నవి. కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు.

సప్త క్రైస్తవ సంఘములకు శుభాకాంక్షలు

4. ఆసియా మండలమునందలి సప్తసంఘములకు యోహాను వ్రాయునది:

భూత, భవిష్యత్‌, వర్తమానములందున్న దేవుని నుండియు ఆయన సింహాసనము ఎదుటఉన్నసప్త ఆత్మలనుండియు 5. విశ్వాసపాత్రుడగు సాక్షియు, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువును అగు యేసు క్రీస్తునుండియు, మీకు కృపయు శాంతియు లభించునుగాక!

ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను  పాపవిముక్తులను చేసెను.

6. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను ఒక యాజకరాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు  సదా  మహిమాన్వితుడును, శక్తిమంతుడును అగునుగాక! ఆమెన్‌.

7. ఇదిగో! మేఘమండలమునుండి ఆయన  వచ్చుచున్నాడు. ప్రతినేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచినవారును, సమస్త తెగలును ఆయనను చూచి రొమ్ముకొట్టుకుందురు. అట్లే తప్పక జరుగును. ఆమెన్‌.

8. ”ఆల్ఫా, ఓమేగ నేనే” అని సర్వశక్తి మంతుడును, భూత, భవిష్యత్‌, వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు.

క్రీస్తు దర్శనము

9. నేను మీ సోదరుడగు యోహానును, యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలోను, రాజ్యమునను, సహనమునందును మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును, యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకించినందున, నేను పత్మోసు ద్వీపమునకు కొని పోబడితిని.

10. ప్రభుదినమున ఆత్మ నన్ను ఆవేశించెను.అప్పుడు వెనుకనుండి నాకుఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకా ధ్వనివలె ఉండెను.

11. ”నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్ముర్న, పెర్గమూ, తియతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోది కయలయందలి సప్తసంఘములకును పంపుము” అని అది నన్ను ఆదేశించినది.

12. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియుటకై వెనుకకు తిరిగితిని. అట  నేను ఏడు సువర్ణ దీపస్తంభములను చూచితిని.

13. వాని మధ్య మనుష్యకుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదములవరకు వ్రేలాడుచుండెను. వక్షమున ఆయన ఒక సువర్ణమయ పట్టికను తాల్చి ఉండెను.

14. ఆయన శిరస్సు, శిరోజములు ఉన్నివలె, మంచువలె తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్నిగోళములవలె మండుచుండెను.

15. కొలిమిలో శుద్ధిచేయబడి మెరుగుపెట్టబడిన ఇత్తడివలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠధ్వని జలపాత ఘోషవలె ఉండెను.

16. ఆయన దక్షిణ హస్తమున సప్తతారకలు ఉండెను. రెండు అంచులుగల వాడియైన ఖడ్గము ఒకటి ఆయన నోటినుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న మార్తాండునివలె దేదీప్య మానమై ఉండెను.

17. నేను ఆయనను చూచిన తోడనే మృతునివలె ఆయన పాదముల ముందట పడితిని. ఆయన తన కుడిచేతిని నాపై ఉంచి ఇట్లనెను: ”భయపడకుము. ఆదియును, అంతమును నేనే!

18. సజీవుడను నేనే! నేను మరణించితిని. కాని చూడుము. నేను సదా జీవించియుందును. మృత్యువు యొక్కయు, పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా ఆధీనములోనే ఉన్నవి.

19. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము కావింపుము. జరుగుచున్న విషయములను, జరుగనున్న విషయములను, సమస్తమును లిఖింపుము.

20. నా కుడిచేతియందు నీవు చూచు సప్త తారకలయొక్కయు, సప్త దీపస్తంభముల యొక్కయు రహస్యార్థమును నీకు విదితము చేయ చున్నాను. సప్తతారకలనగా సప్తసంఘముల దేవదూతలు. సప్తదీపస్థంభములే సప్తసంఘములు.