క్రొత్త యాజకులు బలులు అర్పించుట
1. ఎనిమిదవనాడు అహరోనును, అతని కుమారు లను, సమాజపెద్దలను మోషే పిలువనంపెను.
2. అతడు అహరోనుతో ”ప్రభువునకు పాపపరిహార బలికిగాను ఒక కోడెను, దహనబలికిగాను ఒక పొట్టే లును కొనిరమ్ము. వానికి అవలక్షణములు ఏమియు ఉండరాదు.
3. యిస్రాయేలీయులతో పాపపరిహార బలికిగాను ఒక మేకపోతును కొనిరమ్మని చెప్పుము. దహనబలికిగాను దోషములేని ఏడాది కోడెదూడను, గొఱ్ఱెపిల్లను తీసికొనిరమ్మని చెప్పుము.
4. సమాధాన బలికిగాను ఒక కోడెను, పొట్టేలును గైకొని రమ్మనుము. ధాన్యబలికిగాను నూనెకలిపిన పిండి తేవలయును. ప్రభువు నేడు మీకు దర్శనమిచ్చును” అని చెప్పెను.
5. మోషే ఆజ్ఞాపించినట్లే వారు వానినన్నిని సమావేశపుగుడారము చెంతకు కొనివచ్చిరి. ప్రజలంద రును అచట ప్రభువు సమక్షమున ప్రోగైరి.
6. మోషే వారితో ”మీరు ఈ కార్యములన్నిని నెరవేర్చినచో ప్రభువు తన తేజస్సుతో మీకు దర్శనమిచ్చును” అని చెప్పెను.
7. ఆ పిమ్మట అతడు అహరోనుతో ”నీవు బలిపీఠము చెంతకుపోయి పాపపరిహారబలిని, దహన బలిని సమర్పింపుము. ఆ బలులవలన నీ పాపము లకు, ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరుగును. ప్రభువు ఆజ్ఞాపించినట్లే ప్రజల పాపములకు ప్రాయ శ్చిత్తము చేయుటకు బలులను అర్పింపుడు” అని చెప్పెను.
8. అహరోను బలిపీఠమువద్దకు పోయి మొదట సొంత పాపములకుగాను ప్రాయశ్చిత్తముగా కోడెను వధించెను.
9. కుమారులు నెత్తురును అందింపగా అతడు దానిని వ్రేలితో బలిపీఠము కొమ్ములకు కొద్దిగా పూసెను. మిగిలిన రక్తమును బలిపీఠము అడుగున పోసెను.
10. ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఆ కోడె క్రొవ్వును, మూత్రగ్రంథులను వానిమీదనున్న క్రొవ్వును, కాలేయము మీదనున్న క్రొవ్వును బలిపీఠముమీద సువాసనాభరితముగా దహించగా ప్రభువు సంతుష్టి చెందెను.
11. దాని చర్మమును, మాంసమును శిబిరము వెలుపల కాల్చివేసెను.
12. పిమ్మట అహరోను దహనబలిగా పొట్టేలును వధించెను. కుమారులు నెత్తురును అందీయగా, అతడు దానిని బలిపీఠము కొమ్ములమీద పూసెను.
13. ఆ పిమ్మట వారు దాని మాంసపుముక్కలను, తలను అందించిరి. అహరోను వానిని బలిపీఠముమీద దహించెను.
14. అతడు పొట్టేలు ప్రేవులు, కాళ్ళు శుభ్రముగా కడిగి, వానినికూడ దహనబలిలో భాగముగా కాల్చివేసెను.
15. తరువాత ప్రజల పాపపరిహారబలిగా ఎన్ను కొనిన మేకను వధించి మొదిదానివలెనె సమర్పించెను.
16. దహనబలిగా ఉద్దేశింపబడిన పశువును గూడ నియమపూర్వకముగా సమర్పించెను.
17.అటుపిమ్మట ధాన్యబలిని గైకొని గుప్పెడుపిండిని బలిపీఠముమీద కాల్చివేసెను. ఈ దహనబలి దినదినము సమర్పించు దహనబలికంటె భిన్నమైనది.
18. అతడు ప్రజల సమాధానబలులైన కోడెను, పొట్టేలును వధించెను. కుమారులు రక్తమును అందీ యగా, దానిని పీఠముపై చుట్టుచల్లెను.
19-20. ఆ పశువులక్రొవ్వును, అనగా తోకకు అంటుకొని ఉన్న క్రొవ్వును, మూత్రగ్రంథులను వాని మీది క్రొవ్వును, కాలేయము మీది క్రొవ్వును, వాని రొమ్ముల మీద పేర్చి, ఆ భాగములన్నిని బలిపీఠము చెంతకు కొనిపోయెను. క్రొవ్వును మాత్రము బలిపీఠముమీద కాల్చివేసెను.
21. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే వాని రొమ్ములను, కుడితొడను ప్రభువుముందట అల్లాడించు అర్పణముగా సమర్పించెను.
22. అహరోను పాపపరిహారబలిని, దహన బలిని, సమాధానబలిని సమర్పించిన పిదప చేతులెత్తి ప్రజలను దీవించెను. అటుపిమ్మట బలిపీఠము చెంత నుండి క్రిందికి దిగివచ్చెను.
23. మోషే, అహరోనులు సమావేశపుగుడారములోనికి వెళ్ళిరి. అటనుండి వెలు పలికి వచ్చిన తరువాత ప్రజలను దీవించిరి. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రజలకు ప్రత్యక్షమయ్యెను.
24. ప్రభువు సమక్షమునుండి ఒక నిప్పుమంట వెలువడి బలిపీఠముమీది దహనబలిని క్రొవ్వును దహించెను. ఆ దృశ్యమునుగాంచి ప్రజలెల్లరు ఉత్సాహముతో కేకలు వేయుచు నేలపై సాగిలబడిరి.