అబీమెలెకు పరిపాలన

9 1-2. అబీమెలెకు షెకెమునకు వచ్చి తన తల్లి సోదరులను, బంధువులనుచూచి ”మిమ్ము యెరూబాలు కుమారులు డెబ్బదిమంది పాలించుట మేలా లేక నేనొక్కడనే పరిపాలించుట మేలా మీ షెకెము నాయకు లనే అడిగి తెలిసికొనుడు. పైగా నేను మీకు రక్తబంధు డను” అని పలికెను.

3. వారు అబీమెలెకు మాటలను షెకెము నాయకులకు విన్పించిరి. షెకెము నాయకులు అబీమెలెకు మనవాడేకదా అనుకొని అతనికి మిత్రులైరి.

4. కనుక వారు బాలుబెరీతు దేవళము నుండి డెబ్బది వెండికాసులను గైకొని అబీమెలెకుకు ఇచ్చిరి. అతడు ఆ డబ్బుతో దుర్మార్గులను కొందరిని ప్రోగుచేసికొనెను.

5. పిమ్మట ఒఫ్రా నగరముననున్న తన తండ్రి ఇల్లు చేరి సోదరులను డెబ్బదిమందిని పట్టుకొని ఒకేరాతిపై సంహరించెను. అయినను యెరూబ్బాలు చిన్నకొడుకు యోతాము దాగుకొనియుండినందున అబీమెలెకు చేతికి చిక్కలేదు.

6. అంతట షెకెము, బెత్మిల్లో నగరముల నాయకులు ప్రోగై షెకెము బురుజువద్ద నున్న సింధూరవృక్షము చెంత అబీమెలెకును రాజుగా ప్రకించిరి.

యోతాము సామెత

7. ఆ సంగతివిని యోతాము గెరిసీము కొండ నెక్కి పెద్దస్వరముతో షెకెము నగరవాసులతో ఇట్లనెను:

               ”షెకెము నాయకులారా వినుడు!

               మీరు నా మాటలు ఆలింతురేని

               దేవుడు మీ మాటలాలించును.

8.ఒకనాడు చెట్లన్నియు ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయెను, అవి ఓలివుచెట్టును జూచి ‘నీవు మాకు రాజువు కమ్ము’ అని అడిగెను.

9. కాని ఓలివు, వానితో ‘ఏమేమి!

               నరులను, దేవతలనుకూడ సంతృప్తిపరుచు

               నా తైలమునియ్యక మానుకొని

               చెట్లమీద రాజ్యము నెరపవలయునా?’ అనెను.

10. అపుడు చెట్లు అత్తిమ్రానిని చూచి ‘రమ్ము,

               నీవు మమ్మేలుము’ అని అడిగెను.

11. కాని అంజూరము వానితో

               ‘ఏమేమి! నా తీయనిపండ్లను విడనాడి

               చెట్లమీద రాజ్యము నెరపవలయునా?’ అనెను.

12. అంతట చెట్లు ద్రాక్షావల్లితో

               ‘రమ్ము, నీవు మమ్మేలుము’ అని అడిగెను.

13. కాని ద్రాక్షతీగ వానితో

               ‘ఏమేమి! నరులను దైవములను కూడ

               సంతృప్తిపరుచు నా సారమును పోగొట్టుకొని

               చెట్లమీద రాజ్యము నెరపవలయునా?’ అనెను.

14. అంతట చెట్లన్నియు ముండ్లతుప్పను చూచి,

               ‘రమ్ము, నీవు మమ్మేలుము’ అని అడిగెను.

15. తుప్ప వానితో ‘మీరు నిజముగానే నన్ను రాజుగా

               అభిషేకింతురేని నా నీడను నిలువుడు.

               లేదేని ఈ తుప్పనుండి అగ్గి వెలువడి లెబానోను

               దేవదారులను కాల్చివేయునుగాక’ అనెను.

16. ఇపుడు మీరు ధర్మబుద్ధితో, చిత్తశుద్ధితో అబీమెలెకును రాజును చేసితిరా? యెరూబాలునకు అతని కుటుంబమునకు న్యాయము చేసితిరా?

17. మా తండ్రి, ప్రాణములకు తెగించి పోరాడి మిమ్ము మిద్యానీయుల బారినుండి తప్పించెనుగదా! అతనికి మీరు న్యాయము చేకూర్చితిరా?

18. నేడు మీరు మా తండ్రి కుటుంబము మీద తిరుగబడితిరి. అతని కుమారులను డెబ్బదిమందిని ఒక్కరాతిమీదనే వధించి తిరి. అతని దాసీపుత్రుడైన అబీమెలెకును మీ రక్త బంధువని షెకెమునకు రాజును చేసితిరిగదా!

19. మీరు యెరూబాలుపట్ల, అతని కుటుంబముపట్ల ధర్మ బుద్ధితో, చిత్తశుద్ధితో ప్రవర్తించితిరేని మీకు అబీమెలెకు వలన, అతనికి మీ వలన, ప్రమోదము కలుగునుగాక!

20. లేదేని అబీమెలెకు నుండి అగ్గిప్టుి షెకెము, బెత్మిల్లో పౌరులను కాల్చివేయుగాక!.”

21. ఇటుల పలికి యోతాము పారిపోయెను. అతడు తన సోద రునికి భయపడి బెయేరు నగరమున తలదాచుకొనెను.

షెకెము వాసులు అబీమెలెకుపై తిరుగబడుట

22. అబీమెలెకు మూడేండ్లు యిస్రాయేలీయులను పరిపాలించెను.

23. అంతట యావే అబీమెలెకుకు, షెకెము నాయకులకు విరోధము ప్టుింపగా, ఆ నాయకులు అతనిపై తిరుగబడిరి.

24. యెరూబాలు కుమారులను డెబ్బదిమందిని హత్యచేసిన పాపము క్టికుడుపక ఊరకేపోవునా? చనిపోయిన వారి నెత్తురు హంతుకుడైన అబీమెలెకు మీదను, అతనికి తోడ్పడిన షెకెము నాయకుల మీదను పగతీర్చు కొనదా?

25. అబీమెలెకుపై గల గుఱ్ఱుచే షెకెము నాయకులు కొండలమీద తమవారిని కాపుంచగా వారు త్రోవలవెంటపోవు బాటసారులనందరిని దోచు కొనిరి. అబీమెలెకు ఆ సంగతి తెలిసికొనెను.

26. ఆ సమయముననే ఎబెదు కుమారుడు గాలు తన సోదరు లతో ఆ ప్రాంతమున సంచరించుచు షెకెము నాయ కుల మన్ననలందెను.

27. వారందరు ఒకనాడు పొలమునకు బోయి, ద్రాక్షపండ్లు సేకరించుకొని వచ్చి, గానుగ ద్రొక్కించి, ఉత్సవము చేసికొని, తమ దేవళము చేరి, విందారగించి తప్పద్రాగి అబీమెలెకును శపించిరి.

28. అపుడు ఎబెదు కుమారుడైన గాలు ”మిత్రులారా! అబీమెలెకు అనగా ఎవడు? షెకెము వాసులకు అతనితో ఏమి సంబంధము? మనమతనికి ఊడిగము చేయనేల? ఈ అబీమెలెకు, అతని సైన్యాధిపతి సెబూలు ఒకప్పుడు షెకెము నాయకుడు హామోరునికి బానిసలై ఉండలేదా? నేడు మనమతనికి దాసులము కానేల?

29. నేడు ఈ ప్రజలకు నన్ను సైన్యాధిపతిని చేసిన ఎంత బాగుగా నుండును! అపుడు నేను అబీమెలెకును తరిమిక్టొి, నీకు గుండెలున్నచో క్రొత్త బలగముతో వచ్చి నాతో పోరాడుమని గద్దించి పలుకనా?” అని బింకములాడెను.

30. ఎబెదు కుమారుడైన గాలు పలికిన పలుకులు నగరపాల కుడైన సెబూలు విని ఉగ్రుడైపోయెను.

31. అతడు అరూమా యందున్న అబీమెలెకు చెంతకు దూతలను పంపి ”ఎబెదు కుమారుడైన గాలు సోదరులతో షెకెము నగరమునకు వచ్చెను. అతడు పట్టణ వాసులను నీ మీదికి రెచ్చగొట్టుచున్నాడు.

32. కనుక నీవు నీ అనుచరులు రాత్రిపూట పయనమైవచ్చి పొలమున దాగియుండుడు.

33. ఉదయమున ప్రొద్దుపొడవగనే నగరముమీదికి రండు. గాలు, అతని అనుచరులు పట్టణమునుండి వెలుపలికి రాగానే తగిన రీతిని బుద్ధి చెప్పుడు” అని కబురు పంపెను.

34. కనుక అబీమెలెకు తన అనుచరులనందరిని ప్రోగు చేసికొని రాత్రిపూట పయనమైవచ్చి షెకెము ప్రక్క నాలుగు దండులతో పొలమున దాగియుండెను.

35. ఎబెదు కుమారుడైన గాలు నగరమునుండి వెలుపలికి వచ్చి పురద్వారముచెంత నిలిచియుండగా అబీమెలెకు, అతని అనుచరులు తాము దాగియున్న తావునుండి ఈవలికి వచ్చిరి.

36. గాలు వారిని చూచి సెబూలుతో ”కొండలమీదినుండి జనులు దిగి వచ్చుచున్నారు” అనెను. సెబూలు అతనితో ”నీవు కొండల నీడలుచూచి జనులనుకొని భ్రాంతిపడుచున్నావు” అనెను.

37. కాని గాలు మరల అతనితో ”అదిగో! ఒక దళము నడికొండనుండి వచ్చుచున్నది, ఇంకొక దళము మాంత్రికుని సింధూరమువద్దనుండి వచ్చు చున్నది” అనెను.

38. సెబూలు ”నీవు మనము అబీమెలెకుకు ఊడిగము చేయుటకు అతడు ఏ పాి వాడు అని బింకములు పలుకలేదా? ఇప్పుడు ఆ బింక మంతయు ఎటుపోయినది? ఇటవచ్చుచున్న ఆ ప్రజ లందరు నీవు చిన్నచూపు చూచినవారే. ఇక నగరమును వెడలి వారితో పోరాడుము” అని పలికెను.

39. కనుక గాలు షెకెమునాయకులను ప్రోగుచేసికొని పోయి అబీమెలెకును ఎదిరించెను.

40. కాని అతడు అబీమెలెకు ముందు నిలువలేక పారిపోయెను. అబీమెలెకు అతనిని వెన్నాడెను. గాలు అనుచరులు పురద్వారమువరకు కుప్పలుగాకూలిరి.

41. అటుపిమ్మట అబీమెలెకు అరూమాకు వెడలిపోయెను. గాలును అతని సోదరులను సెబూలు షెకెమునుండి తోలివేసెను.

షెకెము నాశనమగుట

42.మరునాడు షెకెమువాసులు నగరమునుండి వెలుపలి పొలములోనికి వచ్చిరి. అబీమెలెకు ఆ సంగతి వినెను. 43. అతడు తన అనుచరులను మూడు దండులుగా విభజించి పొలమున పొంచియుండెను. షెకెము నివాసులు నగరమువీడి వెలుపలికి రాగానే వారిపైబడి వారిని తునుమాడెను.

44. అటుతరువాత అబీమెలెకు తన దండుతో త్వరత్వరగా ముందుకు సాగిపోయి పురద్వారమున నిలిచెను. మిగిలిన రెండు దండులు పొలముననున్న వారిమీదపడి తుత్తునియలు చేసెను.

45. ఆ దినమంతయు అబీమెలెకు నగర మును ముట్టడించుచునేయుండెను. దానిని వశము చేసికొని పౌరులను చిత్రవధ కావించెను. పట్టణమును సర్వనాశనముచేసి వాడవాడల ఉప్పు వెదచల్లించెను.

46. షెకెము కోటలో ఉన్నవారు పట్టణము నాశన మగుటచూచి ఎల్‌-బెరీతు దేవళముయొక్క కోట లోనికి జొరబడి దాగుకొనిరి.

47. షెకెము గోపుర యజమానులందరును ప్రోగైరని విని అబీమెలెకు అనుచరులను తీసికొని సల్మోనుకొండకు పోయెను.

48. అతడు గొడ్డలితో చెట్టుకొమ్మను నరికి భుజము లపై నిడుకొని అనుచరులతో ”మీరును నేను చేసినట్లే చేయుడు, త్వరపడుడు” అని చెప్పెను.

49. కనుక వారును తలకొక కొమ్మనరికి భుజములపై నిడుకొనిరి. ఆ కొమ్మలనుకొనివచ్చి జనులు దాగియున్న కోట దగ్గర ప్టిె, వాిని కాల్చి కోటకు నిప్పుమ్టుించిరి. షెకెము గోపురములో వసించిన వారందరు దాదాపు వేయిమంది స్త్రీపురుషులు నిప్పుమంటల్లో మడిసిరి.

తేబేసు ముట్టడి, అబీమెలెకు మరణము

50. అంతట అబీమెలెకు తేబేసును ముట్టడించి వశపరచుకొనెను.

51. ఆ నగర మధ్యమున ఒక రక్షణదుర్గము కలదు. పౌరులు పురనాయకులు శత్రువు నకు భయపడి దుర్గమున చొచ్చిరి. వారులోపల నుండి దుర్గకవాటములను బిగించుకొని కోటబురుజు మీదికి ఎక్కిరి.

52. అబీమెలెకు దుర్గమును సమీపించి దాని తలుపులను నిప్పుతో కాల్చివేయబోయెను.

53. అపుడొక స్త్రీ పైనుండి తిరుగిరాతిని దొర్లింపగా అబీమెలెకు తలబ్రద్దలయ్యెను.

54. అతడు వెంటనే తన అంగరక్షకుని పిలిచి ”నీ కత్తిదూసి నన్ను చంపి వేయుము. ఒక ఆడుది అబీమెలెకును చంపెనని లోకులు నవ్వి పోకుందురుగాక!” అనెను. అంగరక్ష కుడు కత్తితో పొడువగా అబీమెలెకు అసువులు వీడెను.

55. అబీమెలెకు చనిపోయెననివిని యిస్రాయేలీయులు తమ నివాసములకు వెడలిపోయిరి.

56. ఆ రీతిగా అబీమెలెకు తన సోదరులను డెబ్బది మందిని చంపి తనతండ్రికి చేసిన ద్రోహమునకు యావే ప్రతీకారము చేసెను.

57. షెకెము నగరవాసులను గూడ తమ దుష్టత్వమునకు తగిన ప్రతిఫలమును అను భవింపజేసెను. యెరూబాలు కుమారుడగు యోతాము ప్టిెన శాపము చివరకు షెకెమువాసులకు తగిలెను.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము