కుష్ఠరోగికి స్వస్థత (మార్కు 1:40-45; లూకా 5:12-16)

8 1. బోధను ముగించి పర్వతముపైనుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. 2. ఆ సమయమున కుష్ఠరోగియొకడు వచ్చి, ప్రభువుముందు మోకరించి ”ప్రభూ! నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధుని చేయగలవు” అని పలికెను.

3. అంతట యేసు తన చేయిచాపి, అతనిని తాకి ”నాకిష్టమే. నీకు శుద్ధికలుగునుగాక”! అని పలికెను. వెంటనే వాని కుష్ఠముపోయి వాడు శుద్ధుడాయెను.

4. యేసు అతనితో ”ఈ విషయమును ఎవరితోను చెప్పవలదు. నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము” అని పలికెను.

శతాధిపతి సేవకుని స్వస్థత (లూకా 7:1-10)

5. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా, శతాధిపతి యొకడు ఆయనను సమీపించి, 6. ”ప్రభూ! నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టియున్నాడు” అని తెలుపగా, 7. ”నేను వచ్చి వానిని స్వస్థపరతును” అని యేసు ఆ శతాధిపతితో పలికెను.

8. ఆ శతాధిపతి ఆయనతో ”ప్రభూ! నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుకాను. నీవు ఒక్కమాట పలికిన చాలును. నా  సేవకుడు స్వస్థత పొందును.

9. నేను అధికారము గలవాడను. నా అధీనమందున్న ఏ సైనికుడినైనా నేను ‘రమ్ము’ అనిన వచ్చును; ‘పొమ్ము’ అనిన పోవును. నా సేవకుడు నేను ‘చేయుము’ అనిన దానిని చేయును” అని సవినయముగా పలికెను.

10. అది విని యేసు ఆశ్చర్యపడి, తన వెంటవచ్చుచున్న వారితో ”యిస్రాయేలు  ప్రజలలో  సైతము నేనుఇట్టివిశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను.

11. తూర్పు పడమరలనుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు.

12. కాని, రాజ్యమునకు వారసులు1 వెలుపల చీకి గదిలోనికి త్రోయ బడుదురు. అచట వారు విలపించుచు, పండ్లు కొరుకుకొందురు” అని పలికెను.

13. అంతట యేసు ఆ శతాధిపతితో ”నీవిక పొమ్ము. నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక!” అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థతపొందెను.

పలువురిని స్వస్థపరచుట (మార్కు 1:29-34; లూకా 4:38-41)

14. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి,  అచట జ్వరపీడితయై మంచము పట్టియున్న అతని అత్తను చూచి 15. ఆమె చేతిని తాకినంతనే జ్వరము  ఆమెను వీడిపోయెను. అంతట ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను.

16. ఆ సాయంసమయమున పిశాచ పీడితులగు పలువురిని యేసువద్దకు తీసికొనిరాగా ఒక్కమాటతో ఆయన పిశాచములను పారద్రోలి, రోగులనందరిని స్వస్థపరచెను.

17. ”ఆయన మన బలహీనతలను తనపై వేసికొనెను.

               మన రోగములను తానే భరించెను”

అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను.

శిష్య లక్షణము (లూకా 9:57-62)

18. యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జనసమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను.

19. అపుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసును సమీపించి, ”బోధకుడా! నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను” అనగా 20. యేసు, ”నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు. మనుష్యకుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటులేదు” అని ప్రత్యుత్తరమిచ్చెను.

21 మరియొక శిష్యుడాయనతో ”ప్రభూ! మొదట నా తండ్రిని సమాధిచేసి వచ్చెదను; అనుమతి  దయచేయుడు” అని కోరగా, 22. యేసు ”నీవు నన్ను వెంబడింపుము. మృతులను సమాధి  చేయు విషయము మృతులనే చూచుకొననిమ్ము” అని పలికెను.

తుఫానును ఆపుట (మార్కు 4:35-41; లూకా 8:22-25)

23. అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను  వెంబడించిరి.

24. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను.ప్రభువు ఆ సమయమున నిదురించుచుండెను.

25. శిష్యులు అపుడు ఆయనను మేలుకొలిపి ”ప్రభూ!  మేము నశించుచున్నాము.   రక్షింపుము”   అని ప్రార్థింపగా, 26. యేసు వారితో ”ఓ అల్ప విశ్వాసులారా! మీరు భయపడెదరేల?” అని  పలికి, లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను.

27. ”గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటిమహానుభావుడు!” అని వారు ఆశ్చర్యపడి చెప్పుకొనిరి.

పిశాచ పీడితులకు స్వస్థత (మార్కు 5:1-20; లూకా 8:26-39)

28. ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా, దయ్యములు పట్టిన వారిద్దరు సమాధులలో నుండి వెలుపలికి వచ్చిరి. వారు ఉగ్ర స్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికి ధైర్యము చాలకుండెను.

29. ”దేవుని కుమారుడా! మాతో నీకేమి  పని?  సమయము  ఆసన్నము కాక మునుపే మమ్ము శిక్షింపవచ్చితివా?” అని, వారిద్దరు బిగ్గరగా కేకలు వేసిరి.

30. ఆ సమీపముననే ఒక పెద్ద పందులమంద మేత మేయుచుండెను.

31. ”మమ్ములను ఇచట నుండి పారద్రోలదలచినయెడల, ఆ పందుల మందలోనికి పోనిమ్ము” అని ఆ దయ్యములు యేసును కోరగా, 32. ఆయన ”అట్లే పొండు” అని సెలవిచ్చెను. అంతట అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్టనిలువుననున్న ఆ మిట్టనుండి ఆ పందులమంద సముద్రములోపడి మునిగి ఊపిరాడక చచ్చెను.

33. ఆ మంద కాపరులు పట్టణములోనికి పరుగెత్తి,   జరిగిన విషయములనెల్ల  ప్రజలకు  వినిపించిరి. దయ్యములు పట్టినవారి విషయము కూడా తెలిపిరి.

34. అంతట ఆ పట్టణవాసులెల్లరును వచ్చి, యేసును కలిసి, తమ ప్రాంతమును విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలిరి.