యేసును బంధించుట

(మత్తయి 26:47-56; మార్కు 14:43-52; లూకా 22:47-53)

18 1. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోనులోయ దాటి  వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలసి అందు ప్రవేశించెను.

2. యేసు తరచుగ తన శిష్యులతో అచటకు వెళ్ళుచుండును. కనుక, ఆయనను అప్పగింప నున్న యూదాకు ఆ స్థలము తెలియును.

3. సైనికు లను, ప్రధానార్చకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను, అధికారులను వెంటబెట్టుకొని యూదా ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసికొని వచ్చిరి.

4. అపుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, ”మీరు ఎవరిని వెదకుచున్నారు?” అని అడిగెను.

5.”నజరేయుడగు యేసును” అని వారు సమాధానము ఇచ్చిరి. ”నేనే ఆయనను” అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యూదా వారితో నిలుచుండి  ఉండెను.

6. యేసు ”నేనే ఆయనను” అని చెప్పగనే వారు వెనకకు తగ్గి, నేలమీద పడిపోయిరి.

7. ఆయన మరల ”మీరు ఎవరిని వెదకుచున్నారు?” అని ప్రశ్నించెను. అందుకు వారు ”నజరేయుడగు యేసును” అని పలికిరి.

8. ”నేనే ఆయనను అని మీతో చెప్పితిని. కనుక, మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనిండు” అని యేసు తిరిగిచెప్పెను.

9. ”నీవు నాకు ఒసగిన వారిలో ఏ ఒకనినైనను నేను పోగొట్టు కొనలేదు” అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను.

10. సీమోను పేతురు తనయొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడిచెవిని తెగనరికెను. ఆ సేవకుని పేరు మాల్కుసు.

11. యేసు పేతురుతో ”నీ కత్తిని ఒరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా?” అనెను.

అన్నా ఎదుట యేసు

12. అపుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రౌతులు యేసును పట్టుకొని బంధించిరి.

13. మొదట అన్నాయొద్దకు తీసికొనిపోయిరి. ఆ సంవ త్సరము ప్రధానార్చకుడగు కైఫాకు అతడు మామ.

14.ఈ కైఫా ‘ప్రజలందరికొరకు ఒకడు మరణించుట మేలు’ అని యూదులకు సలహా ఇచ్చినవాడు.

పేతురు బొంకు

(మత్తయి 26:69-75; మార్కు 14:66-68; లూకా 22:54-72)

15. సీమోను పేతురును, మరియొక శిష్యుడును యేసు వెంటవెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయము ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానా ర్చకుని ప్రాంగణములోనికి వెళ్ళెను.

16. కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను. అపుడు ప్రధానా ర్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి, ద్వారపాల కురాలితో చెప్పి పేతురును లోపలకు తీసికొని వెళ్ళెను.

17. ఆ ద్వారపాలిక పేతురుతో ”నీవును ఆ మను ష్యుని శిష్యులలో ఒకడవు కాదా?” అని అడిగెను. ”నేను కాను” అని పేతురు పలికెను.

18. చలిగా ఉన్నందున సేవకులు, బంట్రౌతులు, మంటవేసి చలికాచుకొనుచు అట నిలుచుండిరి. పేతురును వారితో కలసి చలికాచుకొనుచు నిలుచుండెను.

న్యాయ పీఠము ఎదుట యేసు

(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; లూకా 22:66-71)

19. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింపగా, 20. ”నేను అందరి యెదుట బహిరంగముగ మాటడితిని. యూదులందరు సమావేశమగు ప్రార్థనా మందిరములలోను, దేవాలయములోను బోధించి తినిగాని రహస్యముగా నేను ఏమియు చెప్పలేదు.   

21. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించితినో వినినవారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు” అని యేసు పలికెను.

22. యేసు ఇట్లు పలుకగా, దగ్గర నిలిచియున్న ఒక బంట్రౌతు ఆయనను చెంపపై కొట్టి”ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము!” అనెను.

23. అప్పుడు యేసు ”నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కాని నేను పలికినది సరియైనచో ఏల నన్ను కొట్టెదవు?” అనెను.

24. పిమ్మట అన్నా యేసును బంధములతో ప్రధానార్చకు డగు కైఫాయొద్దకు పంపెను.

పేతురు బొంకు

(మత్తయి 26:71-75; మార్కు 14:69-72; లూకా 22:58-62)

25. సీమోను పేతురు ఇంకను అచటనే నిలు చుండి చలికాచుకొనుచుండెను. అచ్చటనున్న వారు అతనిని చూచి ”నీవు ఆయన శిష్యులలోని వాడవు కావా?” అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, ”నేను కాను” అనెను.

26. పేతురు చెవి తెగనరికిన వాని బంధువును ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు, ”నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా?” అని పేతురును అడిగెను.

27. పేతురు ”నేను ఎరుగను” అని బొంకెను. వెంటనే కోడికూసెను.

పిలాతు ఎదుట ప్రభువు

(మత్తయి 27:1-2; మార్కు 15:1-5; లూకా 23:1-5)

28. అపుడు వారు యేసును కైఫాయొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసికొనిపోయిరి. అది  తెల్లవారుజాము. పాస్క భుజించుటకై మైల పడకుండు టకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు.

29. అందువలన పిలాతు వెలుపల ఉన్న వారియొద్దకు వచ్చి, ”ఏ నేరముపై మీరు ఇతనిని తీసికొనివచ్చితిరి?” అని  అడిగెను.

30. ”ఇతడు నేరము చేసినవాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించెడివారము కాము” అని వారు  పలికిరి.

31. అందుకు పిలాతు ”మీరే ఇతనిని తీసికొని వెళ్ళి మీ చట్టప్రకారము విచా రింపుడు” అనెను. ”ఎవరికిని మరణదండన విధించు అధికారము మాకు లేదు”  అని  యూదులు  చెప్పిరి.

32. యేసు తాను ఎట్టి మరణము పొందబోవుచు న్నాడో సూచించుచు చెప్పిన మాట ఇట్లు నెరవేరెను.

33. పిలాతు మరల మందిరములోనికి వెళ్లి, యేసును పిలిపించి ”నీవు యూదుల రాజువా?” అని అడిగెను.

34. ”నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా? లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా?” అని యేసు తిరుగుప్రశ్న వేసెను.

35. అందుకు పిలాతు ”నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు, ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి?” అని అడిగెను.

36. ”నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండ నా అనుచరులు నా పక్షమున పోరాడెడివారు. కాని, నా రాజ్యము ఈ లోక సంబంధ మైనది కాదు” అని యేసు సమాధానమిచ్చెను.

37. అందుకు పిలాతు ”అట్లయిన నీవు రాజువా?” అని అడిగెను. ”నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీనికొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్యసంబంధులందరు నా మాటనాలకింతురు” అని ప్రత్యుత్తరమిచ్చెను.

38. ”సత్యమనగా ఏమి?” అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి, మరల యూదులవద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను: ”నాకు ఆయనలో ఏ దోషము కనిపించుట లేదు.

39. పాస్కపండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదలచేయు ఆచార మున్నదిగదా! యూదులరాజును మీకొరకు విడుదల చేయమందురా?” అనెను.

40. వారు మరల కేకలు వేయుచు, ”ఇతనిని కాదు, బరబ్బను విడుదల చేయుడు” అనిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ.