రెండు అంజూరపు పండ్లబుట్టలు

24 1. బబులోనియా రాజగు నెబుకద్నెసరు, యూదారాజును యెహోయాకీము కుమారుడునగు యెకొన్యా అనబడు యెహోయాకీనును యెరూషలేము నుండి బబులోనియాకు బందీగా కొనిపోయెను. అతడు యూదానాయకులను, కళాకారులను, చేతి వృత్తులవారినిగూడ బందీలనుగా కొనిపోయెను. ఆ సంఘటన జరిగిన తరువాత ప్రభువు నాకొక దర్శన మును చూపెను. నేను ప్రభువు దేవాలయము ముందట రెండు అంజూరపు పండ్లబుట్టలు ప్టిె యుంచుటను చూచితిని.

2. ఒక బుట్టలో మంచి పండ్లుండెను. అవి ఋతువు రాకమునుపే పక్వమైన పండ్లను పోలియుండెను. మరియొక బుట్టలో పాడు పండ్లు ఉండెను. అవి తినుటకు పనికిరావు.

3. ప్రభువు, ”యిర్మీయా! నీకేమి కనిపించుచున్నవి” అని నన్ను అడిగెను. నేను ”అంజూరపు పండ్లు కనిపించుచున్నవి. మంచిపండ్లు చాలమంచివి. చెడ్డపండ్లు చాలచెడ్డవి. అవి తినుటకెంత మాత్రమును పనికిరావు” అని బదులిచ్చితిని.

4. అంతట ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు విన్పించెను.

5. ”యిస్రాయేలు దేవుడను ప్రభుడనైన నా పలుకులివి. నేను యూదా నుండి బబులోనియాకు బందీలనుగా పంపిన ప్రజలు ఈ మంచి పండ్లవింవారు. నేను వారిని దయతో ఆదరింతును.

6. వారిని పరామర్శింతును. వారిని మరల ఈ నేలకు కొనివత్తును. వారిని భవనమువలె కట్టుదును గాని పడగొట్టను. మొక్కవలె నాటుదునుగాని పెల్లగింపను.

7. నన్ను ప్రభువునుగా గుర్తింపవలెనన్న కోరికను వారికి కలిగింతును. వారు నా ప్రజలు కాగా నేను వారికి దేవుడనగుదును. వారు పూర్ణహృదయ ముతో నా వద్దకు తిరిగివత్తురు.

8. కాని యూదారాజగు సిద్కియాను, అతనిని అనుసరించు నాయకులను, యెరూషలేమున మిగిలి యున్నవారిని వారు ఈ దేశమున ఉన్నను, ఐగుప్తు నకు వెడలిపోయినను వారి నెల్లరిని, ప్రభుడనైన నేను, తినుటకెంత మాత్రము పనికిరాని ఈ చెడ్డపండ్లవలె గణించెదను.

9. వారిని దారుణమైన శిక్షకు గురి చేయుదును. లోకములోని జాతులెల్ల వారినిగాంచి వెరగొందును. ప్రజలు వారిని గేలిచేసి పరిహ సింతురు. వారినిచూచి నవ్వుదురు. నేను వారిని చెల్లాచెదరు చేసిన తావులందెల్ల జనులు వారి పేరును శాపవచనముగా వాడుకొందురు.

10. నేను వారిని పోరునకును, ఆకలికిని, అంటు రోగమునకును గురి చేయుదును. నేను వారికిని, వారి పితరులకు ఇచ్చిన నేలమీద వారిలో ఒక్కడును మిగులడు.”