యేసు – జక్కయ్య
19 1. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దానిగుండ వెళ్ళుచుండెను.
2. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అనుపేరు గల ధనికుడు ఒకడు ఉండెను.
3. అతడు యేసును చూడవలెనని యత్నించెను. కాని పొట్టివాడగుటచేతను, జనసమూహము ఎక్కువగా ఉండుటచేతను చూడలేకపోయెను.
4. కనుక అతడు ముందుకు పరుగుదీసి, ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై, ఒక మేడిచెట్టును ఎక్కెను. 5. యేసు అచటకు వచ్చినపుడు పైకి చూచి, అతనితో ”జక్కయ్యా! త్వరగా దిగిరమ్ము. ఈ దినము నేను నీ ఇంటిలోనుండ తలంచితిని” అని చెప్పెను.
6. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను.
7. ఇది చూచిన వారందరు ”ఈయన పాపియొద్దకు అతిథిగా వెళ్ళెను” అని సణుగుకొనసాగిరి.
8. జక్కయ్య నిలబడి యేసుతో, ”ప్రభూ! నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును” అని చెప్పెను.
9. అందుకు యేసు ”నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయన, ఇతడును అబ్రహాము కుమారుడే.
10. మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు” అని అతనితో చెప్పెను.
సేవకుని కర్తవ్యము – ప్రతిఫలము
(మత్తయి 25:14-30)
11. యేసు యెరూషలేమును సమీపించు చుండుటవలన, పరలోకరాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండుటవలన, ప్రజలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను.
12. యేసు ఇట్లు చెప్పనారంభించెను: ”గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావలయునని దూరదేశమునకు వెళ్ళెను.
13. అతడు తన పదిమంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, ‘నేను తిరిగివచ్చువరకు ఈ ధనముతో వ్యాపా రము చేసికొనుడు’ అని చెప్పెను.
14. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచేవారు ‘ఇతడు మమ్ములను పరి పాలించుటమాకుసమ్మతముకాదు’అనిరాయబారులతో చెప్పిపంపిరి.
15.అతడు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినపుడు, ఒక్కొక్కడు ఎటుల వ్యాపారము చేసినది తెలిసికొనుటకు, తాను ధనమిచ్చిన సేవకులను తన వద్దకు పిలిపించెను.
16. మొదటివాడు వచ్చి ‘అయ్యా! నీవిచ్చిన సొమ్ముతో ఇంకను పది నాణెములను సంపాదించితిని, అని చెప్పెను. 17. అందుకు అతడు ఆ సేవకునితో ‘మంచిది. నీవు నమ్మినబంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధవహించితివి. కనుక నిన్ను పది పట్టణములకు అధిపతిని చేసెదను’ అనెను.
18. రెండవవాడువచ్చి ‘అయ్యా! నీవిచ్చినసొమ్ముతో ఇంకను ఐదునాణెములను సంపాదించితిని’ అని చెప్పెను. 19. ‘నిన్ను ఐదు పట్టణములకు అధిపతిని చేసెదను’ అని అతడు చెప్పెను.
20. మరొకడు వచ్చి ‘అయ్యా! ఇదిగో నీ నాణెము. దీనిని మూటకట్టి ఉంచితిని.
21. నీవు కఠినుడవు. నీవు అనిన నాకు భయము. నీవు ఈయని దానిని తీసికొనెదవు. విత్తని దానిని కోయుదువు’ అని చెప్పెను.
22. అందుకు అతడు ‘ఓరీ దుష్టుడా! నీ మాటలతోనే నిన్ను నీవు దోషివని ఋజువు చేసికొనుచున్నావు. కఠినుడనని, పెట్టని దానిని తీసికొనెదనని, విత్తని దానిని కోసికొనెదనని నీవు ఎరుగుదువు.
23.అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగివచ్చినపుడు వడ్డీతో సైతము పుచ్చు కొనెడివాడను’ 24. అని చెప్పి అతడు చెంతనున్న వారితో ‘వానివద్దగల ఆ నాణెము తీసికొని, పదినాణెములున్న వానికిండు’ అని చెప్పెను.
25. అపుడు వారు ‘బోధకుడా! వానివద్ద ఇప్పికే పది నాణెములున్నవి గదా!’ అని పలికిరి.
26. అందుకు ఆయన ‘ఉన్న వానికే ఇంకను ఇవ్వబడును. లేనివానినుండి వాని వద్దనున్న కొంచెముకూడ తీసికొనబడును.
27. మంచిది. నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచటకు తీసికొనివచ్చి నా సమక్షముననే వారి తలలు తీయుడు’ అని అతడు చెప్పెను.
పుర ప్రవేశము
(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; యోహాను 12:12-19)
28. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటె ముందుగా పయనించెను.
29. ఆయన ఓలీవుకొండ చెంతనున్న బెత్ఫగా, బెతానియ అను గ్రామములను సమీపించినపుడు ఇద్దరు శిష్యులను పంపుచు, 30. ”మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే, మీరు అచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడును ఎన్నడును ఎక్కియుండలేదు. దానిని విప్పి నా యొద్దకు తోలుకొనిరండు.
31. ‘మీరు ఏల దానిని విప్పుచున్నారు?’ అని ఎవరైన మిమ్ము ప్రశ్నించినచో, ‘ప్రభువు నకు దానితో పని ఉన్నది’ అని చెప్పుడు” అని ఆదేశించెను.
32. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి.
33. ఆ గాడిదపిల్లను విప్పు చుండగా దాని యజమానులు ”మీరు దీనిని ఎందులకు విప్పుచున్నారు?” అని అడిగిరి.
34. ”ప్రభువునకు దీనితో పని ఉన్నది” అని చెప్పి, 35. వారు దానిని యేసువద్దకు తోలుకొని వచ్చిరి. దానిమీద తమ వస్త్రములను పరచి ఆయనను కూర్చుండబెట్టిరి.
36. ఆయన ముందుకు సాగిపోవుచుండ ప్రజలు దారిలో తమ వస్త్రములు పరచిరి.
37. ఆయన ఓలీవు పర్వతము సమీపమునఉన్న పల్లపు ప్రదేశము చేరునప్పటికి శిష్యుల సమూహమంతయు తాము చూచిన అద్భుతకార్యములకు ఆనందపరవశులై ఎలుగెత్తి,
38. ”ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక!
పరలోకమున శాంతియు,
మహోన్నతమున మహిమయు కలుగునుగాక!”
అని దేవుని స్తుతింపసాగిరి.
39. అంతట జనసమూహమునుండి కొందరు పరిసయ్యులు ”బోధకుడా! నీ శిష్యులను గద్దింపుము” అని చెప్పిరి.
40. అందుకు యేసు ”వారు మౌనము వహించినయెడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు అని చెప్పుచున్నాను” అని పలికెను.
యేసు విలాపము
41. యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను: 42. ”నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించియుండిన యెడల బాగుండెడిది. నీవు అటుల చేయలేకపోతివి.
43.శత్రువులు నీ చుట్టు కందకములు త్రవ్వి, నిన్ను ముట్టడించి, అన్నివైపుల నిన్ను అరికట్టు కాలము వచ్చును. 44. వారు నిన్ను, నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలువనీయరు. ఏలన, ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు.”
దేవాలయములో యేసు
(మత్తయి 21:12-17; మార్కు 11:15-19; యోహాను 2:12-25)
45. అపుడు యేసు దేవాలయమున ప్రవేశించి, అచట విక్రయదారులను వెళ్ళగొట్టుచు,
46. ” ‘నా ఆలయము
ప్రార్థనాలయము అనబడును’
అని వ్రాయబడియున్నది.
కాని, మీరు దానిని
దొంగలగుహగా చేసితిరి”
అని పలికెను.
47. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు ఆయనను నాశనము చేయజూచిరి.
48. కాని, ప్రజలందరును యేసు బోధలయందు నిమగ్నులైయున్నందున వారికి అది సాధ్యపడలేదు.