పౌలు దర్శనములు

12 1. నిరుపయోగమైనను నేను పొగడుకొనవలసి వచ్చుచున్నది. ప్రభువు యొక్క దర్శనములను గూర్చియు, ప్రత్యక్షమగుటను గూర్చియు నేను ఇప్పుడు చెప్పుదును.

2. క్రీస్తునందున్న ఒక వ్యక్తి నాకు తెలియును. అతను పదునాలుగు సంవత్సరముల క్రిందట మహోన్నతమగు దేవలోకమునకు ఎత్తబడెను. అది శరీరముతోనో లేక శరీర రహితముగనో నాకు తెలియదు. దేవునకు తెలియును.

3. ఈతడు దివికి ఎత్తబడెనని నాకు తెలియును అని మరల పలికెదను. మరల, ఇది శరీరముతోనో లేక కాదో నాకు తెలియదు. దేవునకు తెలియును.

4. నరుడు వచింప శక్యము కాని మాటలు అతడు అట వినెను.

5. కనుక ఈ వ్యక్తిని గురించి పొగడెదను. కాని నా బలహీనతలను ప్రదర్శించు విషయములను తప్ప, నన్ను గురించి నేను గొప్పగ చెప్పుకొనను.

6. పొగడుకొనదలచినచో అవివేకిని గాకుందును. ఏలయన, నేను నిజమునే చెప్పుకొందును గదా! కాని నన్ను పొగడుకొనను. ఏలయన, ఏ వ్యక్తియైనను నాకార్యములు చూచి, నా వలన విని ఏర్పరచుకొనిన అభిప్రాయము కంటె, గొప్ప అభిప్రాయమును పొందవలెనని నేను కోరను.

7. కాని నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండ నా శరీరములో ఒక ముల్లు గ్రుచ్చబడినది. అది సైతానుదూతగ పనిచేసి నన్ను నలగగొట్టి గర్వము లేకుండచేయును.

8. దీనిని గూర్చి మూడు మారులు ప్రభువునకు మనవి చేసితిని. దానిని తొలగింపవలయునని ప్రార్థించితిని.

9. అందుకు ”నా కృప నీకు చాలును. బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది” అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే నేను గర్వింతును.

10. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలయన, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.

కొరింతీయులను గూర్చిన పౌలు చింత

11. నేను అవివేకివలె ప్రవర్తించుచున్నాను. కాని నేను అటుల చేయుటకు మీరే కారకులు. నన్ను గూర్చి ఆమోదముద్ర వేయవలసినవారును  మీరే. ఏలయన, నేను వ్యర్థుడనైనను మీ విశిష్టమైన ”అపోస్తలుల” కంటె ఏ విధముగను తీసిపోను.

12. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను పూర్ణమైన ఓరిమితో చేయుటవలన అపోస్తలుని చిహ్నములు  మీ మధ్య నిజముగా కనుపరపబడెను. 

13. మిగిలిన దైవసంఘములకంటె మీరు ఎట్లు హీనముగ చూడ బడితిరి! కాని ఒక్క విషయము. సహాయము కొరకు నేను మిమ్ము బాధింపలేదు. ఇట్లు ప్రవర్తించినందులకు క్షమింతురుగాక!

14. నేను మిమ్ము చూచుటకు రావలెనని సిద్ధ్దపడుట ఇది మూడవ మారు. ఇప్పుడైనను మీ నుండి నేను ఏమియును ఆశింపను. నాకు కావలసినది మీరేకాని మీ ధనము కాదు. పిల్లలు తల్లిదండ్రులను పోషించుట సహజము కాదు. కాని తల్లిదండ్రులు పిల్లలను పోషించుట సహజమేకదా!

15. మీకు తోడ్పడుటకై నన్ను, నా సమస్తమును సంతోషముగా వినియోగింతును. మిమ్ము ఇంతగా ప్రేమించు చున్నందున మీరు నన్ను తక్కువగ ప్రేమింతురా?

16. కనుక నేను మీకు భారముగా ఉండలేదని మీరు అంగీకరింతురుగదా? నేను టక్కరితనమున అసత్యములతో మిమ్ము మోసగించితిని అని ఎవడైన అనవచ్చును.

17. ఎట్లు? నేను మీయొద్దకు పంపిన వారిలో ఎవనివలననైనను మిమ్ము మోసపుచ్చుటకు ప్రయత్నించితినా?

18. తీతును పొమ్మని ప్రార్థించితిని. అతనితో మరియొక సోదరుని కూడ పంపితిని. ఒకవేళ తీతు మిమ్ము ఏమైన మోసము చేసెనా? కాని, అతడును, నేనును ఒకే సంకల్పముతో పని చేయ లేదా? ఒకే విధముగా ప్రవర్తింపలేదా?

19. కాని ఒకవేళ ఇంతవరకు మీ ఎదుట మేము మా పక్షమున వాదించుకొనుచున్నామని అనుకొందురేమో! కాదు! దేవుని సమక్షమున క్రీస్తు చిత్తానుసారము మాటలాడుచున్నాము. మేము చేయు ప్రతికార్య మును, మిత్రులారా! మీకు సాయపడుటకే.

20. కాని నేను అచ్చటకు చేరిననాడు నా అభిలాషకు విరుద్ధముగ నేను మిమ్ము, మీ అభిలాషకు విరుద్ధముగ మీరు నన్ను చూచుదురేమోనని భయము కలుగుచున్నది. పోట్లాటలు,  అసూయ,  ఉద్రిక్తత,  స్వార్థపరత్వము, అవమానములు, నిష్ప్రయోజనమగు ప్రసంగములు, గర్వము, క్రమరాహిత్యము కాంచవలసి  వచ్చునేమో అని భయ పడుచున్నాను.

21. మరల నేను వచ్చినచో మీ సమక్షమున దేవుడు నన్ను చిన్నపుచ్చునేమో అని భయపడుచున్నాను. అంతేకాక గతమున పాపములు చేసి తమ అపవిత్రతకు, అవినీతికరములగు పనులకు, లైంగిక పాపములకు, వ్యామోహ కృత్యములకు, పశ్చాత్తాపపడనివారిని గూర్చి కూడ నాకు దుఃఖము కలుగును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము