నూత్న దేవాలయ వైభవము

2 1. అదే సంవత్సరము ఏడవనెల ఇరువది ఒకటవ దినమున ప్రభువు హగ్గయిద్వారా తన సందేశమును వినిపించెను.

2. ప్రభువు అతనిని యూదాదేశ పాలకుడగు సెరుబ్బాబెలుకును, ప్రధానయాజకుడగు యెహోషువకును, శేషించిన ప్రజలకును ఇట్లు చెప్పుమనెను:

3. ”మీలో ఈ దేవాలయపు పూర్వ వైభవమును జ్ఞప్తియందుంచుకొనిన వాడెవడైనా నున్నాడా? ఇదిప్పుడు మీకు ఎట్లు కాన్పించుచున్నది? శూన్యమువలె చూపట్టుటలేదా?

4.అయినను సెరుబ్బాబెలూ! యెహోషువా! ప్రజలారా! మీరు ధైర్యము తెచ్చుకొనుడు. పనికి పూనుకొనుడు. నేను మీకు తోడుగానుందును.

5. మీరు ఐగుప్తునుండి వెడలివచ్చినపుడు నేను నిత్యము మీకు అండగా నుందునని బాసచేసితిని. కావున ఇప్పుడు మీకు తోడుగా నుందును. కనుక మీరు భయపడవలదు. ఇదియే సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కు.

6. సైన్యములకధిపతియగు ప్రభువుసెలవిచ్చునది ఏమనగా – నేను త్వరలోనే ఇంకొకసారి భూమిని, ఆకాశమును, నేలను, కడలిని అతలాకుతలము చేయుదును.

7. జాతులనన్నిని కూలద్రోయుదును. వానిసంపదలు ఇచికి వచ్చును. ఈ దేవళము ప్రభువుతేజస్సుతో నిండును. ఇది సైన్యములకు అధిపతియైన ప్రభువు వాక్కు.

8. వెండి నాదే! బంగారమును నాదే! – ఇదే సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కు.

9. నూత్నదేవాలయము పూర్వ దేవా లయము కంటె వైభవముగానుండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములను ఒసగుదును. సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కిది.”

ప్రవక్త యాజకులను సంప్రదించుట

10. దర్యావేషు పరిపాలనాకాలము రెండవ యేట తొమ్మిదవనెల యిరువదినాలుగవ దినమున సైన్యములకధిపతియైన ప్రభువు మరల హగ్గయి  ద్వారా సందేశము వినిపించెను.

11. సైన్యములకు అధిపతియైన ప్రభువు ఇట్లు ఆజ్ఞాపించెను: ”నీవు ఈ ప్రశ్నను గూర్చి యాజకుల అభిప్రాయము నడుగుము.

12. ఎవడైనా దేవునికి బలిగా అర్పింపబడిన పశువు మాంసమును తన అంగీచెంగున ముడుచుకొనిపోయె ననుకొందము. ఆ చెంగు రొట్టెనుగాని, పులుసును గాని, ద్రాక్షారసమునుగాని, ఓలివుతైలమునుగాని, ఏదైన భోజనపదార్థమునుగాని తాకినచో ఆ వస్తువు పవిత్రమగునా?”.

ఆ ప్రశ్నకు యాజకులు ‘పవిత్రముకాదు’ అని చెప్పిరి.

13. అపుడు హగ్గయి ‘ఎవడైన శవమును తాకి మైలపడెననుకొందము. అతడు పై వస్తువులలో దేనినైన తాకినచో అది అపవిత్రమగునా?’ అని యాజకులను అడిగెను. వారు ‘అవును’ అనిరి.        

14. అందులకు హగ్గయి వారికి ఇట్లు బదులు ఇచ్చెను: ”ప్రభువు పలుకిది. ఈ ప్రజలకును వారి క్రియలకును, వీరు పండించు పంటలకును ఈ నియమమే వర్తించును. కావున వీరు బలిపీఠముపై అర్పించు వస్తువులెల్ల అపవిత్రమగును.

ప్రభువు దీవెనవలన పంటలు బాగుగా పండును

15. ప్రభువిట్లనుచున్నాడు: ”మీకేమి జరిగినదో పరిశీలించిచూడుడు. మీరు దేవాలయ పునర్నిర్మాణము నకు పూనుకొనకముందు 16. ధాన్యపు ప్రోగువద్దకు పోయి అది ఇరువది తూములగునని ఆశించినచో పది తూములే అయ్యెడిది. ద్రాక్షల గానుగయొద్దకు పోయి అచట ఏబది కూజాల రసము లభించునని ఆశించినచో ఇరువది కూజాల రసము మాత్రమే లభించెడిది.

17. నేను వేడిగాలులను, వడగండ్లను పంపి మీరు సేద్యముచేయు పంటలనెల్ల నాశనము చేసితిని. అయినను మీరు పశ్చాత్తాపపడరైతిరి.

18. నేడు తొమ్మిదవనెల ఇరువదినాలుగవ దినముకదా! దేవాల యము పునాదివేసినది ఈ దినముననే. కనుక నేినుండి మీకేమి జరుగనున్నదో ఆలోచింపుడు.

19. మీకు ధాన్యము నిల్వలేదు. మీ ద్రాక్షలు, అంజూర ములు, దానిమ్మలు, ఓలివులు కాపు పట్టలేదు. అయినను ఇకమీదట నేను మిమ్ము దీవింతును.”

సెరుబ్బాబెలునకు దేవుని వాగ్దానము

20. ఆ ఇరువది నాలుగవ రోజుననే ప్రభువు హగ్గయి ద్వారా మరియొక సందేశము వినిపించెను.

21. అతనిని యూదాదేశ పాలకుడైన సెరుబ్బాబెలుతో ఇట్లు చెప్పుమనెను: ”నేను భూమ్యాకాశములను అతలాకుతలము చేయుదును.

22. రాజ్యములను కూలద్రోసి వాని అధికారమును అంతమొందింతును. రథములను, సారథులను తలక్రిందులుగా పడవేయు దును. యుద్ధాశ్వములు చచ్చును. రౌతులొకరినొకరు చంపుకొందురు.

23. నా సేవకుడవును, షయల్తీయేలు కుమారుడవునైన సెరుబ్బాబెలూ! ఆ దినమున నేను నిన్ను స్వీకరింతును. నేను నిన్ను ఎన్నుకొింని. నిన్ను నా అంగుళీయక ముద్రగా చేసికొింని.

ఇది సైన్యముల కధిపతియైన ప్రభువు వాక్కు.”

Previous