ఉపోద్ఘాతము:

పేరు: పునీత పౌలు పునాదులు వేసిన క్రైస్తవ సంఘాలలో కొరింతు సంఘము ఒకటి. పౌలు కొరింతు సంఘాన్నుద్దేశించి రాశాడు కాబట్టి ఈ లేఖకు ఆ సంఘం పేరునే నిర్ధారించారు.

కాలము: క్రీ.శ. 54-56లో ఎఫెసు నగరం నుండి రాశాడు. క్రీ.శ. 95 నాటికి ఈ లేఖ ఆచూకి కనపడుతుంది.

రచయిత: పునీత పౌలు.

చారిత్రక నేపథ్యం: కొరింతు నగరం భిన్న సంస్కృతులకు, మతాలకు, భాషలకు, భావాలకు ఆచారాలకు నిలయం. గ్రీసు, ఇటలీ, ఐగుప్తు, సిరియా, యూదయ సంస్కృతులు ఇచ్చట కొట్టొచ్చినట్టుగా కనపడతాయి. కొరింతులో యూదయ సంఘము చాల పెద్దది. కొరింతు క్రైస్తవ సంఘంలోని ప్రముఖులు పౌలు నగరం నుండి వెళ్లిపోయిన తర్వాత సువార్త ప్రచారాన్ని కొనసాగించారు. అన్యమత ప్రభావంచే కొరింతు సంఘం అనేక దురాచారాలకు, దురలవాట్లకు గురైంది. తద్వారా క్రైస్తవత్వం నీరుగారే ముప్పు వచ్చింది. ఈ నేపథ్యంలో పౌలు క్రీస్తు ప్రబోధాలనందించి సంఘాన్ని ప్రోత్సహించాడు.  కొరింతు నగర సమస్యలు నేటి ఆధునిక నగరీకరణలో భాగమనే విషయాన్ని గుర్తిస్తాం. కాని అట్టి పరిస్థితుల్లో క్రైస్తవ విలువల పాటింపులో జాగరూకత అత్యవసరం అని తెలుసుకుంటాం.

ముఖ్యాంశాలు: కొరింతు సంఘంలో ప్రధాన సమస్యలు: ఐక్యత – అనైక్యత, క్రీస్తు దేహం – శ్రీసభ, క్రైస్తవ విలువలు, లైంగిక జీవితం, వివాహం, ప్రభువు భోజనం, ప్రేమ, ఉత్థానం. వీటిపై క్రైస్తవ సిద్ధాంతాలతో కూడిన విధానాలు, భావాలు, వాదనలను పౌలు చర్చించాడు. పౌలు కొరింతీయులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో కనపడే శక్తివంతమైన, ప్రభావితమైన అంశాలల్లో ”శ్రీ సభ – క్రీస్తుదేహం” అన్నది ప్రధానమైంది.  శ్రీ సభ అంటే ప్రాంతీయ (కొరింతు) క్రైస్తవ సంఘం.

క్రీస్తు చిత్రీకరణ: క్రైస్తవ జీవితం క్రీస్తు కేంద్రంగా వుండాలనేది పౌలు ప్రధాన ప్రబోధం. దేవుని మూలంగా మనకు క్రీస్తు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన (1:31) లభిస్తాయని చెప్పడం విశేషం.