ఉపోద్ఘాతము:

పేరు: మత్తయి అను పదమునకు  ”దేవుని కానుక” అని అర్ధము. ఇతను ‘లేవి’ అని కూడా వ్యవహరించబడెను (మార్కు 2:14; లూకా 5:27). ఇతను క్రీస్తు ప్రథమ శిష్యులలో ఒకడు (9:9). స్వస్థలము కఫర్నాము. అల్ఫయి కుమారుడు. వృత్తి సుంకము వసూలు చేయటము. క్రైస్తవ సంఘము కాపరి.

కాలము: క్రీ.శ. మొదటిశతాబ్ధం 80 లోపు.

రచయిత: మత్తయి. ఈ గ్రంథమును అరమాయికు భాషలో రాశాడు. ఆ పిమ్మట హీబ్రూ, గ్రీకుభాషలలోనికి అనువదించారు.

చారిత్రక నేపథ్యము: క్రీస్తు మరణానంతరం మత్తయి సిరియాలోని దమస్కు పరిసరాల్లో అధిక శాతం యూదులు వున్న క్రైస్తవ సంఘాన్ని స్థాపించి దానికి కాపరి అయ్యాడు. మత్తయి రాసిన క్రీస్తు సువార్త యూదుల తోరా గ్రంథాన్ని ప్రతిబింబిస్తుంది, విశ్వాసులకు కరదీపికగా నిలుస్తుంది. క్రీస్తు భూలోక జీవితాన్ని యిస్రాయేలు చరిత్రతో ముడిపెట్టడం ఆసక్తికరంగా వుంటుంది. ఇస్రాయేలు విముక్త జీవితాన్ని క్రీస్తు తన బాల్యంలోనే స్మరించుకున్నాడు (2:13-15; 4:1-11 ; ఆది. 39:1; నిర్గమ 15:22-32:35). అందుకే క్రీస్తుకు ”ఇమ్మానువేలు” (1:23) అని పేరుపెట్టారు.

ముఖ్యాంశాలు: పూర్వనిబంధన ఒడంబడిక ప్రకారం క్రీస్తును అభిషిక్తుడినిగా, రాజుగా (దావీదు వంశం) చిత్రిస్తాడు మత్తయి. క్రీస్తు భౌతిక జీవితాన్ని రోమా పాలనలో భాగమైన బేత్లెహేము (రొట్టెల ఇల్లు) నుండి ప్రారంభిస్తాడు (2:1). క్రీస్తు తన తండ్రి అప్పగించిన కార్యాన్ని కఫర్నాము నుండి మొదలుపెట్టాడు (4:12-13). బోధలు, స్వస్థతలు, అద్భుతాలు, పరిచర్యలు, ప్రజలతో ముఖాముఖి, వ్యతిరేకతలు, పాట్లు, శ్రమలు, మరణం,  ఉత్థానం, దేవుని రాజ్యస్థాపన మొదలగు కార్యక్రమాలు, సాక్ష్యాలతో క్రీస్తు దినచర్య నిండి వుంటుంది.

క్రీస్తు చిత్రీకరణ: ఇస్రాయేలు నిరీక్షించిన మెస్సయాయే ఈ క్రీస్తు (1:23; 2:2,6; 3:17;4:15-17; 21:5,9; 22:44-45; 26:64; 27:11-27,37). దేవుని రాజ్యం క్రీస్తు ద్వారా స్థాపితమయ్యింది. పూర్వ నిబంధన, నూతన నిబంధనల అనుసంధానం క్రీస్తు ద్వారా సంపూర్ణమయ్యింది. ప్రవక్తల ప్రవచనాలు క్రీస్తుకు  సాక్షీభూతమయ్యాయి (12:39,40; 13:13-15; 17:5-13). క్రీస్తుకు మనుష్యకుమారుడు (24:30-35); ప్రభువు దాసుడు (12:17-21); దావీదు పుత్రుడు (1:1) వంటిపేర్లను ఆపాదించారు. శ్రీసభ క్రీస్తుకు చెందుతుంది (16:18; 18:17).