పక్షవాత రోగికి స్వస్థత

(మత్తయి 9:1-8; లూకా 5:17-26)

2 1. కొన్నిదినములు గడచిన పిమ్మట యేసు మరల కఫర్నాము చేరెను. ఆయన ఇంటియొద్ద ఉన్నాడని విని, 2. జనులు అచటకు గుంపులుగుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడ జనులు క్రిక్కిరిసి వుండిరి. యేసు వారికి వాక్కును బోధించుచుండగా, 3. కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయముతో మోసికొనివచ్చిరి.

4. కాని, జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు ఆయనచెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్నచోటుకు పైన ఇంటి కప్పును తీసి, పడకతోపాటు ఆ పక్షవాత రోగినిదించిరి.

5. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో ”కుమారా! నీ పాపములు క్షమింప బడినవి” అనెను.

6. అందుకు అచటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, 7. ”ఇతడెందుకు ఇట్లు చెప్పు చున్నాడు. ఇతడు దేవదూషణము చేయుచున్నాడు. దేవుడుతప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు?” అని లోలోన తర్కించుకొనసాగిరి.

8. యేసు ఆత్మ యందు వారి ఆలోచనలనుగ్రహించి వారితో, ”మీ హృదయములలో ఇట్లేల తలంచుచున్నారు? 9. ఏది సులభతరము? పక్షవాత రోగితో నీ పాపములు క్షమింపబడినవనుటయా? లేక, లేచి నీ పడక నెత్తుకొని పొమ్మనుటయా?

10. మనుష్యకుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును” అని, పక్షవాత రోగితో, 11. ”నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను” అని పలికెను. 12. వెంటనే వాడు లేచి, అందరియెదుట తన పడకను ఎత్తుకొని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచి ప్రజలందరును ఆశ్చర్యపడిరి. ”ఇట్టివి మనము ఎన్నడును చూడలేదు” అని దేవుని స్తుతించిరి.

సుంకరికి శిష్యస్థానము

(మత్తయి 9:9-13; లూకా 5:27-32)

13. యేసు మరల గలిలీయసరస్సు తీరమునకు వెళ్ళెను. జన సమూహము అంతయు అచటికి చేరెను. యేసు వారికి బోధింపనారంభించెను.

14. పిదప ఆయన వెళ్ళుచు సుంకపుమెట్టుకడ కూర్చుండివున్న అల్ఫయి కుమారుడగు ‘లేవి’ అనువానిని చూచి, ”నన్ను అనుసరింపుము” అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి, యేసును అనుసరించెను.

15. అనంతరము, యేసు అతని ఇంట భోజనమునకు కూర్చొనియుండగా, అనేకమంది సుంకరులును, పాపులును ఆయనతోను, ఆయన శిష్యులతోను ఆ పంక్తియందు కూర్చొనియుండిరి. ఏలయన, ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువమందిఇట్టి వారున్నారు.

16. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులగు పరిసయ్యులు కొందరు ”మీ గురువు సుంకరులతోను, పాపులతోను కలిసి భుజించుచున్నాడేమి?” అని శిష్యులను ప్రశ్నించిరి.

17. అది విని యేసు వారితో ”వ్యాధిగ్రస్తులకేకాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువరాలేదు. కాని పాపులను పిలువవచ్చితిని” అనెను.

ఉపవాసము

(మత్తయి 9:14-17; లూకా 5:33-39)

18. యోహాను శిష్యులును, పరిసయ్యులును ఉపవాసము చేయుచుండెడివారు. కొందరు ఆయన యొద్దకు వచ్చి, ”యోహాను శిష్యులును, పరిసయ్యులును ఉపవాసము చేయుచుండ, నీ శిష్యులు ఏల ఉప వాసము ఉండరు?” అని ప్రశ్నించిరి.

19. అందుకు యేసు, ”పెండ్లికుమారుడు ఉన్నంతవరకు విందుకు వచ్చినవారు ఉపవాసము ఉందురా? పెండ్లికుమారుడు తమతో ఉన్నంతవరకు వారు ఉపవాసము ఉండరు.

 20. పెండ్లికుమారుడు ఎడబాయుకాలము వచ్చును, అపుడు వారు ఉపవాసము ఉందురు.     

21. ప్రాత గుడ్డకు మాసికవేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయోగించినయెడల క్రొత్తగుడ్డ క్రుంగుటవలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును.

22. క్రొత్త ద్రాక్షారసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన యెడల ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును. ద్రాక్షా రసము, తిత్తులును చెడును.అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలెను” అని సమాధానమిచ్చెను.

సబ్బాతు సమస్య

(మత్తయి 12:1-8; లూకా 6:1-5)

23. ఒక విశ్రాంతిదినమున యేసు పంట పొలములో సాగిపొవుచుండ, ఆయన వెంట నడచుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి.

24. దానిని చూచిన పరిసయ్యులు ”విశ్రాంతిదినమున చేయదగని పనిని వీరేల చేయుచున్నారు?” అని యేసును ప్రశ్నించిరి.

25. అందులకు ఆయన వారితో, ”దావీదు అతని అనుచరులు ఆకలిగొనినపుడు ఏమి చేసినది మీరు చదువలేదా?

26. అబ్యాతారు ప్రధానయజకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయములో ప్రవేశించి, అర్చకులు తప్ప ఇతరులెవ్వరు తినగూడని, అచటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని, తన అనుచరులకు పెట్టెను గదా?

27. మానవుని కొరకే విశ్రాంతిదినము నియమింపబడినదిగాని, విశ్రాంతిదినముకొరకు మానవుడు నియమింపబడలేదు.

28. కనుక మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు కూడ ప్రభువే” అని పలికెను.