పిలాతు ఎదుట ప్రభువు
(మార్కు 15:1; లూకా 23:1-2; యోహాను 18:28-32)
27 1. ప్రాతః కాలమున ప్రధానార్చకులు, ప్రజల పెద్దలు అందరు యేసును చంపుటకు ఆలోచన చేసిరి.
2. వారు ఆయనను సంకెళ్ళతో బంధించి, తీసికొనిపోయి, అధిపతియగు పిలాతునకు అప్పగించిరి.
యూదా దుర్మరణము
(అ.కా. 1:18-19)
3. గురుద్రోహియగు యూదా యేసునకు శిక్ష విధింపబడుట చూచి, పశ్చాత్తాపమొంది, ఆ ముప్పది వెండినాణెములను తిరిగి ప్రధానార్చకులయొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి, 4. ”నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని” అని చెప్పెను. వారు ”అది మాకేల? నీవే చూచుకొనుము” అనిరి.
5. అపుడు అతడు ఆ వెండినాణెములను దేవాలయములో విసరికొట్టి, పోయి, ఉరి వేసికొనెను.
6. ప్రధానార్చకులు ఆ నాణెములను తీసుకొని ”ఇది రక్తపు డబ్బు కనుక, దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు” అనుకొని, 7. తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరివాని పొలము కొనిరి.
8. అందువలన ఆ పొలము ”రక్తపుపొలము” అని నేటికి కూడ పిలువ బడుచున్నది.
9. యిర్మీయా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను:
”యిస్రాయేలీయులలో కొందరు
అతని వెలగా నిర్ణయించిన
ముప్పది వెండినాణెములు వారు తీసికొని,
10. ప్రభువు నాకు ఆదేశించినట్లు
కుమ్మరి వాని పొలము
కొనుటకు వినియోగించిరి”.
పిలాతు ప్రశ్నము – యేసు మౌనము
(మార్కు 15:2-5; లూకా 23:3-5; యోహాను 18:29-38)
11. యేసు అధిపతి ఎదుట నిలువగా, ”నీవు యూదుల రాజువా?” అని అతడు ప్రశ్నించెను. ”నీవన్నట్లే” అని యేసు సమాధాన మొసగెను.
12. ప్రధానార్చకులు, పెద్దలు ఆయనపై నేరము మోపిరి. కాని, ఆయన వారికెట్టి ప్రత్యుత్తరమును ఈయలేదు. 13. అపుడు పిలాతు, ”వారు నీపై మోపుచున్న నేరములను వినుటలేదా?” అని ఆయనను ప్రశ్నించెను.
14. ఒక్క నిందారోపణకైనను యేసు బదులు పలుకకుండుటను చూచి, పిలాతు ఆశ్చర్యపడెను.
న్యాయ పీఠము – మరణ శిక్ష
(మార్కు 15:6-15; లూకా 23:13-25; యోహాను 18:39-19:16)
15. పండుగలో జనులు కోరిన ఒక బందీనివిడుదల చేయు ఆచారము అధిపతికి కలదు.
16. అపుడు అచట బరబ్బయను పేరు మోసిన బందీ ఒకడు కలడు.
17. ప్రజలందరు గుమికూడి రాగా, ”నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా? క్రీస్తు అనబడు యేసునా?” అని పిలాతు వారిని అడిగెను.
18. అసూయవలన వారు ఆయనను అప్పగించిరని అతడు గ్రహించెను.
19. అతడు న్యాయపీఠముపై కూర్చుండినపుడు అతని భార్య ”నేడు నేను కలలో ఆయన కారణముగ మిగుల బాధపడితిని. కనుక, ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియు జోక్యము చేసికొనవలదు” అని వార్త పంపెను.
20. ప్రధానార్చకులును, పెద్దలును, బరబ్బను విడిపించుటకు, యేసును చంపుటకు అడుగవలెనని జనసమూహమును ఎగద్రోసిరి.
21. ”ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలెనని మీరు కోరుచున్నారు?” అని అధిపతి అడుగగా, వారు ”బరబ్బనే” అనిరి.
22. ”అట్లయిన క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలయును?” అని పిలాతు వారిని అడుగగా, ”సిలువవేయుడు” అని వారు కేకలువేసిరి.
23. ”అతడు ఏమి దుష్కార్యము చెసెను?” అని అడుగగా ”వానిని సిలువ వేయుడు” అని వారు మరింత బిగ్గరగా కేకలు వేసిరి.
24. అపుడు పిలాతు తాను ఏమియు చేయజాలననియు, ప్రజలలో తిరుగుబాటు రాగల దనియు తెలిసికొని నీరు తీసికొని, వారియెదుట చేతులు కడుగుకొని, ”ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని. అది మీరే చూచు కొనుడు” అనెను.
25. ”ఆయన రక్తము మాపై, మా బిడ్డలపై పడునుగాక!” అని వారందరును కేకలుపెట్టిరి.
26. అపుడు అతడు బరబ్బను విడుదలచేసి, యేసును కొరడాలతోకొట్టించి, సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించెను.
ప్రభువును పరిహసించుట
(మార్కు 15:16-20; యోహాను 19:2-3)
27. అపుడు అధిపతియొక్క సైనికులు, యేసును రాజభవన ప్రాంగణమునకు తీసికొనిపోయి, ఆయన చుట్టు సైనికులనందరను సమకూర్చిరి.
28. వారు యేసు వస్త్రములను ఒలిచి, ఎఱ్ఱని అంగీని ధరింప జేసిరి.
29. ముండ్లకిరీటమును అల్లి ఆయన శిరముపైపెట్టిరి. కుడిచేతిలో వెదురుకోలనుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి ”యూదుల రాజా! నీకు జయము!” అని అవహేళనము చేసిరి.
30. ఆ సైనికులు ఆయనపై ఉమిసి, ఆయన చేతిలోని వెదురు కోలను తీసికొని, తలపై మోదిరి.
31. వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి, ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి, సిలువవేయుటకై తీసుకొనిపోయిరి.
సిలువ మ్రానిపై యేసు
(మార్కు 15:21-32; లూకా 23:26-43; యోహాను 19:17-27)
32. మార్గమధ్యమునవారు కురేనియా సీమోనును చూచి, సిలువను మోయుటకు అతనిని బలవంత పరచిరి. 33. వారు ‘కపాలస్థలము’ అను నామాంతరము గల ‘గొల్గొతా’ అను స్థలమునకు చేరిరి.
34. చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కాని దానిని రుచిచూచి ఆయన త్రాగుటకు ఇష్టపడక పోయెను.
35. వారు ఆయనను సిలువవేసిరి. చీట్లువేసి కొని ఆయన వస్త్రములను పంచుకొనిరి.
36. వారచట కూర్చుండి కావలి కాయుచుండిరి.
37. ‘ఇతడు యూదుల రాజు యేసు’ అను నిందారోపణ ఫలకమును ఆయన తలకు పై భాగమున ఉంచిరి.
38. ఆయనతో పాటు కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడిరి.
39. వచ్చిపోవువారు తలలూపుచు, ఆయనను దూషించుచు, 40. ”దేవాలయమును పడగొట్టి మూడు దినములలో మరల నిర్మించువాడా! నిన్ను నీవు రక్షించుకొనుము. దేవుని కుమారుడవైనచో సిలువ నుండి దిగిరమ్ము” అని పలికిరి.
41. అలాగే ప్రధానా ర్చకులు, ధర్మశాస్త్ర బోధకులతోను, పెద్దలతోను కలసి 42. ”ఇతను ఇతరులను రక్షించెనుగాని, తనను తాను రక్షించుకొనలేడాయెను. ఇతడు యిస్రాయేలీయుల రాజుగదా! ఇపుడు సిలువనుండి దిగిరానిమ్ము, అపుడు మేము విశ్వసింతుము” అని హేళనచేసిరి,43.”ఇతడు దేవుని నమ్మెను. ‘నేను దేవుని కుమారుడను’ అని చెప్పెను. కనుక దేవునికిష్టమైన, ఇతనిని ఇప్పుడు రక్షింపనిమ్ము” అనిరి.
44. అదే విధముగ ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడ ఆయనను అటులనే దూషించిరి.
యేసు మరణము
(మార్కు 15:33-41; లూకా 23:44-49; యోహాను 19:28-30)
45. అపుడు పగలు పండ్రెండుగంటలనుండి మూడుగంటలవరకు ఆ దేశమంతట చీకటిక్రమ్మెను. 46.ఇంచుమించు పగలు మూడుగంటల సమయమున ”ఏలీ, ఏలీ, లామా సబక్తాని” అని యేసు బిగ్గరగా కేకపెట్టెను. ”నా దేవా! నా దేవా! నీవు నన్నేల విడనాడితివి?” అని దీని అర్థము.
47. అచట నిలువబడిన కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి.
48. వెంటనే ఒకడు పరుగెత్తి, నీటిపాచి తీసుకొని, పులిసిన ద్రాక్షారసములో ముంచి, ఒక కోలకు తగిలించి, ఆయనకు త్రాగనిచ్చెను.
49. మరికొందరు ”తాళుడు, ఏలియా వచ్చి ఇతనిని రక్షించునేమో చూతము” అనిరి.
50. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణమువీడెను.
51. అపుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి కంపించెను. బండలు బ్రద్దలాయెను.
52. సమాధులు తెరువబడెను. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను.
53. యేసు పునరుత్థానము తరువాత, వారు సమాధులనుండి బయటకువచ్చి, పవిత్ర నగరమున ప్రవేశించి, అనేకులకు కనిపించిరి.
54. శతాధిపతియు, అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులును, భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలు చూచి, మిక్కిలి భయపడి, ”నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే” అని పలికిరి. 55. యేసుకు పరిచర్య గావించుటకై గలిలీయనుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరమునుండి చూచుచుండిరి.
56. వారిలో మగ్దలా మరియమ్మ, యాకోబు, యోసేపుల తల్లియగు మరియమ్మ, జెబదాయి కుమారుల తల్లియును ఉండిరి.
భూస్థాపనము
(మార్కు 15:42-47; లూకా 23:50-56; యోహాను 19:38-42)
57. సాయంసమయమున యేసు శిష్యుడు, ధనికుడునగు, అరిమత్తయి వాసియగు యోసేపు, 58. పిలాతువద్దకుపోయి యేసు భౌతికదేహమును ఇప్పింపుమని కోరగా అతడు అందులకు అంగీకరించెను.
59. యోసేపు యేసు భౌతికదేహమును సరిక్రొత్తనార వస్త్రముతోచుట్టి, 60. తాను రాతిలో, తన కొరకు తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్దరాతిని దొర్లించి వెడలిపోయెను.
61. అపుడు ఆ సమాధికెదురుగా మగ్దలా మరియమ్మయు వేరొక మరియమ్మయు కూర్చుండియుండిరి.
సమాధికి కావలి
62. ఆయత్త దినమునకు మరునాడు ప్రధానా ర్చకులును, పరిసయ్యులును కలిసి పిలాతునొద్దకు వచ్చి 63. ”అయ్యా! ఆ మోసగాడు జీవించి ఉన్నపుడు, ‘నేను మూడుదినముల తరువాత సజీవుడనై లేతును’ అని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది.
64. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగిలించు కొనిపోయి, ‘మృతుల నుండి బ్రతికి లేచెను’ అని జనులకు చెప్పుదురేమో! అపుడు మొది మోసముకంటె, కడపి మోసము ఘోరముగా నుండును. కనుక మూడవ దినమువరకు సమాధిని భద్రపరుప నాజ్ఞాపింపుము” అని చెప్పిరి.
65. అందుకు పిలాతు, ”మీకు కావలి వారున్నారుగదా! పోయి, మీ చేతనైనంతవరకు సమాధిని భద్రము చేసికొనుడు” అని వారితో పలికెను.
66. వారు పోయి రాతిపై ముద్రవేసి, కావలివారిని పెట్టిసమాధిని భద్రపరచిరి.