యెహోషువ

46 1.      నూను కుమారుడు యెహోషువ

                              మహావీరుడు.

                              మోషే తరువాత అతడు ప్రవక్త అయ్యెను.

                              అతడు తన పేరునకు తగినట్లుగానే

               జీవించి, దైవప్రజలను ఆపదనుండి రక్షించెను. తనకు అడ్డువచ్చిన శత్రువులనెల్ల ఓడించి,

               యిస్రాయేలీయులకు వాగ్దత్తభూమిని

               సంపాదించి పెట్టెను.

2.           అతడు చేయెత్తి శత్రు పట్టణములమీదికి

               దండెత్తిపోయినపుడు మిక్కిలి

               వైభవముతో అలరారెను.

3.           యెహోషువ ధైర్యము ఎవరికున్నది?

               అతడు ప్రభువు యుద్ధములను నడిపెను.

4.           సూర్యుని ఆకాశమున ఆపివేసి,

               ఒక రోజును రెండురోజులంత దీర్ఘముగా చేసెను

5.           శత్రువులు తనను చుట్టుముట్టగా

               సర్వశక్తిమంతుడు  మహోన్నతునికి

               ప్రార్థన చేసెను.

               ప్రభువు అతని మొరనాలించి భయంకరమైన

               వడగండ్లవానను కురిపించెను.

6.           ప్రభువే శత్రువులను వడగండ్లవానకు గురిచేసి

               బేత్‌హోరోను కనుమ వద్ద సర్వనాశనము చేసెను.

               విరోధివర్గము యెహోషువ శౌర్యమును

               గ్రహించెను.

కాలెబు

7.            మోషే కాలమున యెహోషువ విశ్వసనీయత

               వెల్లడియయ్యెను.

               అతడును, యెఫున్నె కుమారుడు కాలెబును

               నమ్మిన బంటులు.

               వారిరువురు యిస్రాయేలు సమాజమునెదిరించి

               వారి గొణగుడును ఆపివేసి

               పాపమును తొలగించిరి.

8.           ఎడారిలో పయనించిన ఆరులక్షలమందిలో

               ఈ ఇరువురు మాత్రమే ప్రాణములతో బ్రతికి,

               పాలుతేనెలు జాలువారు వాగ్దత్తభూమిని

               చేరుకోగలిగిరి.

9.           ప్రభువు కాలెబునకు మహాబలమును

               దయ చేసెను.

               అతడు వృద్ధుడు అయినపుడును

               ఆ  సత్తువను కొల్పోలేదు.

               కనుకనే పర్వతసీమను ఎక్కిపోయి

               దానిని స్వాధీనము చేసికొనెను.

               అతని అనుయాయులు నేికిని

               ఆ సీమను ఆక్రమించుకొనియున్నారు.

10.         అతని ఉదంతమును చూచి

               యిస్రాయేలీయులందరును

               ప్రభువును సేవించుట మంచిదని గ్రహించిరి.

న్యాయాధిపతులు

11.           న్యాయాధిపతులలో ప్రతివాడును సుప్రసిద్ధుడే.

               వారిలో ఎవడును విగ్రహారాధనకు పాల్పడలేదు.

               ఎవడును ప్రభువును విడనాడలేదు.

12.          వారి సంస్మరణము దీవెనలను పొందునుగాక!

               ఆ పుణ్యపురుషులు సమాధులలోనుండి లేచి,

               మరల వారిఅనుయాయులతో జీవింతురుగాక!

సమూవేలు

13.          సమూవేలు ప్రభువునకు ప్రీతి పాత్రుడు.

               ప్రభువు ప్రవక్తగా అతడు రాచరికమును నెలకొల్పి

               దేవుని ప్రజలకు రాజులను నియమించెను.

14.          అతడు ధర్మశాస్త్రము ప్రకారము

               ప్రజలకు తీర్పుజెప్పెను.

               కనుక దేవుడు ప్రజలను కాపాడెను.

15.          విశ్వసనీయుడు గనుక ప్రజలు అతనిని

               నిజమైన ప్రవక్తగా గణించిరి.

               అతడి పలుకులను బ్టియే అతడు దీర్ఘదర్శి

               అని నమ్మిరి.

16.          శత్రువులు తనను చుట్టుముట్టగా సమూవేలు

               సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థనచేసి

               లేత గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించెను.

17.          ప్రభువు ఆకాశము నుండి గర్జించెను.

               ఉరుముల ద్వారా తన ధ్వనిని విన్పించెను.

18.          తూరు, ఫిలిస్తీయా దేశపాలకులైన

               శత్రునాయకులనెల్ల హతమార్చెను.

19.          సమూవేలు కన్నుమూయకముందు

               తాను ఇతరులఆస్తిని, ఇతరుల చెప్పులనుగూడ

               అపహరింపలేదని దేవుని ఎదుటను,

               రాజు ఎదుటను ప్రమాణముచేసి చెప్పెను.

               అతని బాసకెవరును అడ్డురాలేదు.

20.        అతడు చనిపోయిన పిదపకూడ ప్రవచించి

               రాజునకు అతని మరణముగూర్చి

               ముందే తెలిపెను. సమాధినుండి ప్రవచనము

               పలికి ప్రజల పాపములను తొలగించెను.