జ్ఞానులు – శిశు సందర్శనము

1. హేరోదురాజు పరిపాలనాకాలమున యూదయా సీమయందలి బేత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పుదిక్కు నుండి  యెరూషలేము నకు వచ్చి,

 2. ”యూదుల రాజుగా జన్మించిన శిశు వెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి” అని అనిరి.

3. ఇది విని హేరోదు రాజును, యెరూషలేము నగరవాసులందరును కలతచెందిరి.

4. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మశాస్త్రబోధకులను సమావేశ పరచి ”క్రీస్తు ఎచట జన్మించును?” అని ప్రశ్నించెను.

5. ”యూదయ సీమయందలి బేత్లెహేమునందు” అనివారు సమాధానమిచ్చిరి.

6. ”యూదయ సీమయందలి బేత్లెహేమా! నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఏలయన నా యిస్రాయేలు ప్రజలను పాలించునాయకుడు నీలోనుండి వచ్చును” అని ప్రవక్త వ్రాసియుండెను.      

7.  అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలిసికొనెను.

8. పిమ్మట అతడు వారిని బేత్లెహేమునకు పంపుచు, ”మీరు వెళ్ళి, జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియ జేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును” అనెను.

9. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో! తూర్పుదిక్కున వారిముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గ దర్శినియై, ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను.

10. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి.

11. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతోనున్న బిడ్డనుచూచి, సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి.

12. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి.

ఐగుప్తునకు పలాయనము

13. వారు వెళ్ళినపిదప ప్రభువుదూత యోసేపునకు కలలో కనిపించి, ”శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసికొని, ఐగుప్తునకు పారిపోయి, నేను  చెప్పువరకు  అచటనేయుండుము” అని ఆదేశించెను.

14. అంతట యోసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసికొని, ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి,

15. హేరోదు మరణించునంతవరకు అచటనే ఉండెను.

”ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని” అని ప్రవక్తద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను.

శిశుహత్య

16. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమునుబట్టిబేత్లెహేమునందును, ఆ పరిసరములందును ఉన్న రెండేండ్లును, అంతకంటె తక్కువ ప్రాయముగల మగశిశువులనందరిని చంపుడని  అతడు ఆజ్ఞాపించెను.

17-18. ”రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డలకొరకై విలపించుచుండెను. వారి మరణమువలన కలిగిన దుఃఖమునుండి ఆమె ఓదార్పు పొందకుండెను” అని యిర్మీయా ప్రవక్త పలికినవాక్కు నెరవేరెను.

నజరేతు నగర నివాసము

19. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తు నందున్న యోసేపునకు ప్రభువుదూత కలలో కనిపించి,

20. ”లెమ్ము, బిడ్డను, తల్లిని తీసికొని యిస్రాయేలు దేశమునకు తిరిగిపొమ్ము. ఏలయన, బిడ్డను చంప వెదకిన వారు మరణించిరి” అని తెలిపెను.

21. యోసేపు లేచి, ఆ బిడ్డను తల్లిని తీసికొని యిస్రాయేలు దేశమునకు తిరిగిపోయెను.

22. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాసు యూదయా దేశాధిపతి అయ్యెనని విని అచటికివెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము, యోసేపు గలిలీయ సీమకుపోయి,

23. నజరేతు నగరమున నివాసమేర్పరచుకొనెను. ”అతడు నజరేయుడు అనబడును” అను ప్రవక్తల ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను.