ఉపోద్ఘాతము:

పేరు: ఆధునిక యూదామత పితామహుడిగా పేరుగాంచిన యెహెజ్కేలు యాజకవర్గమునకు చెందిన ప్రవక్త. యెహెజ్కేలు అను పేరునకు అర్థము ”దేవుడు బలపరచును”. బబులోను చెరలో యూదులు అంధకారబంధులురుగా ఉన్న కాలములో యెహెజ్కేలు వారిమధ్య పరిచర్య చేసెను.

కాలము: క్రీ.పూ. 593-571.

రచయిత: బూసి కుమారుడను, యాజకుడైన యెహెజ్కేలు (1:3). ఈ గ్రంథము దార్శనిక రచనాశైలిలో వ్రాయబడినది.

చారిత్రక నేపథ్యము: ఐగుప్తు, బబులోనుల మధ్య అధికారపోరాటములో యూదారాజ్యము నలిగిపోయినది.  తుదకు క్రీ.పూ. 597లో బబులోను యూదాను వశము చేసుకొనెను. యూదారాజు యెహోయాకీను, యూదా ప్రముఖులను బందీలనుగా  బబులోనియా ప్రవాసములోనికి పోయినపుడు యెహెజ్కేలు కూడా వారిలోనుండెను. పది సంవత్సరముల తర్వాత యెరూషలేములోని యూదులు తిరుగుబాటు చేసిరి. బబులోనియారాజు నెబుకద్నెజరు ఆ తిరుగుబాటును అణచివేయడమే గాక, యెరూషలేమును ధ్వంసము చేసెను. నెబుకద్నెజరు యెరూషలేముపై చివరిసారిగా దండెత్తినప్పుడు  దేవాలయ ధ్వంసమునకు ముంగుర్తుగా యెహెజ్కేలు భార్య మరణించినది (24:16-24). యెరూషలేము దేవాలయ ధ్వంసమునకు ముందు తన జాతి ప్రజల పాపములను, శిక్షను ఎత్తిచూపిన ప్రవక్త, దేవాలయ ధ్వంసము తరువాత వారిలో ఆశాభావమును, యూదాజాతి పొందబోవు పునర్జీవమును గూర్చిన దేవుని సందేశములను ప్రవచించెను.

ముఖ్యాంశములు:  యెహెజ్కేలు దర్శనాలను ప్రతికూల సమయాల్లో దేవుని స్పందనలుగా చూపెట్టెను. దేవుడు ఆయా ఘోరఉపద్రవము లను ఎందుకు అనుమతించెనో వివరించెను. అది దేవునికి విరుద్ధముగా ప్రజలు చేసిన పాపఫలితమేయని స్పష్టము చేసెను. ఈ పరిస్థితుల్లోనే యెహెజ్కేలు భవిష్యత్తు గూర్చిన నిరీక్షణా, దేవుని వాగ్ధానాలను తెలియజేసెను. చెరనుండి విముక్తి నొందు కాలము దగ్గరలో ఉందని ప్రవచించెను. దేవాలయము పునర్నిర్మింపబడుతుందని ఆశను నింపెను. యూదులు ఎండిన ఎముకల వలెనున్నప్పికిని వారికి పునర్జీవము లభించునని తెలియజేసెను. దేవుని పరిశుద్ధత, పాపం-ఫలితం, పునరుద్ధరణ, నాయకులు / ప్రవక్తలు, ఆరాధన, దేవాలయం, మొదలగు అంశాలు ఈ గ్రంథంలో పుష్కలముగా కనబడతాయి.

క్రీస్తుకు అన్వయము: మెస్సయాను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మతో యెహెజ్కేలు ప్రవక్త పోల్చెను. దానిని ఉన్నతమైన పర్వతముపై నాటబడునని తెలియజేసెను. (17:22-24 చూడుము యెషయా 11:1; యిర్మీ. 23:5; 33:15; జెక 3:8; 6:12). మెస్సయ అర్హతతో, అధికారముతో పాలన చేయువాడు (21:26-27). నిజమైన కాపరి (34:11-31). తన ప్రజలను నూతన హృదయము, నూతన ఆత్మలో నుంచుతాడు. మాలిన్యము నుండి శుద్ధిచేస్తాడు (36:36).