విశ్వసించువారిని గూర్చిన బాధ్యతలు
5 1. వృద్ధుడగు వ్యక్తిని కఠినముగ గద్దింపక, అతనిని నీ తండ్రిగ భావించి హెచ్చరింపుము. పిన్నలను నీ సోదరులుగను, 2. వృద్ధస్త్రీలను తల్లులుగను భావించి సరిదిద్దుము. యువతులను, అక్కచెల్లెండ్రుగా పరిగణించి పూర్ణపవిత్రతతో తీర్చిదిద్దుము.
3. నిజమైన అనాథలైన విధవరాండ్రను ఆదరింపుము.
4. కాని ఏ విధవరాలికైననూ బిడ్డలుగాని లేక మనుమలుగాని ఉండినయెడల, ఆ సంతానము ముందుగా తమకుటుంబము విషయమున తమకు గల బాధ్యతలను నిర్వర్తించుట ఎరుగవలెను. ఇది దేవుని సంతోషపరచును కనుక ఈ విధముగ వారు తమ పితృరుణమును తీర్చవలయును.
5. దిక్కులేక నిజముగ అనాథయైన స్త్రీ దేవునియందే తన నమ్మికను నిలుపుకొని, ఆయన సాయము కొరకై రేయింబవళ్ళు విన్నపములతో ప్రార్థించుచుండును.
6. భోగలాలసు రాలైన వితంతువు బ్రతుకుచున్నను చచ్చినదై ఉండును.
7. వారు నిందారహితులై ఉండుటకుగాను వారిని ఇట్లు ఆజ్ఞాపింపుము.
8. కాని ఎవరైనను తన బంధువులను గూర్చి, అందును విశేషించి తన కుటుంబమును గూర్చి శ్రద్ధవహింపనిచో అతడు ఈ విశ్వాసమును విడనాడినట్లే. అట్టివాడు అవిశ్వాసికంటెను చెడ్డవాడు.
9. ఏ వితంతువునైనను అరువది యేండ్లు దాటనిదే విధవరాండ్ర పట్టికలో చేర్పకుము. అంతేకాక, ఆమె ఒక్క పురుషునకు మాత్రమే భార్యయై, 10. సత్కార్యములు చేయుటయందు ప్రఖ్యాతిగలదియై, బిడ్డలను సక్రమముగా పెంచి, తన గృహమున అతిథులను ఆదరించి, దైవప్రజల పాదములను కడిగి, కష్టములో ఉన్నవారికి తోడ్పడి, అన్ని విధముల మంచిని చేయుటకు పూనుకొనినదై ఉండవలెను.
11. కాని యువతులగు విధవరాండ్రను ఆ పట్టికలో చేర్పకుము.వారి వాంఛలు వారికి వివాహమాడు కోర్కె కలిగించినచో వారు క్రీస్తునుండి మరలి పోయి, 12. ఆయనకు చేసిన తమ మొదటి వాగ్దానమును భంగమొనర్చిన దోషులగుదురు.
13. అంతే కాక, వారు సోమరులై ఇంటింట తిరుగుట నేర్చుకొందురు. వారు మాట్లాడరాని విషయములను గూర్చి మాట్లాడుచు, వారి కబురులతో అధికప్రసంగము చేయుట కూడ నేర్చుకొందురు.
14. కనుక మన విరోధులు మనలను నిందించుటకు అవకాశము ఈయకుండుటకై, యువతులగు వితంతువులు వివాహమాడి, సంతానవతులై గృహనిర్వహణమున శ్రద్ధ వహింపవలెనని కోరుచున్నాను. 15.ఇప్పటికే కొందరు విధవరాండ్రు త్రోవతప్పి సైతానును అనుసరించుచున్నారు.
16. విశ్వాసముగల ఏ స్త్రీ అయినను తన కుటుంబమున వితంతువులు గలదైనచో వారి భారమును దైవసంఘముపై మోపక వారికి సాయపడవలెను. ఇట్లు దైవసంఘము ఏకాకులగు వితంతువులను గూర్చి శ్రద్ధ వహించుటకు వారు అవకాశము కల్పింపవలెను.
17. బాగుగా పాలనచేయు పెద్దలను, అందును విశేషించి ప్రసంగములయందును, బోధనలయందును గట్టిగా కృషిచేయువారిని, రెట్టింపు గౌరవమునకు యోగ్యులుగ ఎంచవలెను.
18. ”కళ్లము నూర్చెడి ఎద్దునోటికి చిక్కము వేయరాదు” అనియు, ”పనివాడు తన జీతమునకు అర్హుడు” అనియు లేఖనము చెప్పుచున్నది.
19. ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉన్ననేగాని సంఘపుపెద్దపై నేరారోపణమును అంగీకరింపకుము.
20. ఇతరులు భయపడునట్లు పాపములో మునిగి ఉన్నవారిని బహిరంగముగ గద్దింపుము.
21. ఏ రాగద్వేషములు, పక్షపాతములేక నీవు ఈ ఉత్తరువులను పాటింపవలయునని నేను దేవుని సముఖమున, క్రీస్తు యేసు సన్నిధిన, ఎన్నుకొనబడిన దేవదూతల సమక్షమున నిన్ను ఆజ్ఞాపించుచున్నాను.
22. ఎవనికైనను హస్తనిక్షేపణ చేయవలెనని తొందర పడకుము. ఇతరుల పాపములో పాలుపంచు కొనకుము. నీవు పవిత్రుడవుగ ఉండుము.
23. నీవు ఎక్కువగా జబ్బుపడుచుందువు. కాన నీటిని మాత్రమే త్రాగక, నీ జీర్ణశక్తిని పెంపొందించు కొనుటకై కొంచెము ద్రాక్షరసమును సేవింపుము.
24. కొందరి పాపములు తీర్పునకు ముందే స్పష్టమగును. మరికొందరి పాపములు ఆ తరువాతనే బయటపడును.
25. అట్లే సత్కార్యములును స్పష్టముగ గోచరించును. అట్లు గోచరింపనివి కూడ మరుగై ఉండజాలవు.