సొలోమోను దేవాలయమును నిర్మించుట

సొలోమోనునకు విజ్ఞాన వరము

1 1. దావీదు కుమారుడైన సొలోమోను తన రాజ్యాధికారమును సురక్షితము చేసికొనెను. దేవుడైన ప్రభువు అతనిని దీవించి మహాబలసంపన్నునిచేసెను.

2. సొలోమోను తన సైన్యమందలి సహస్రాధిపతు లను, శతాధిపతులను, న్యాయాధిపతులను, యిస్రా యేలీయులలోని ఆయాతెగల నాయకులను అనగా యిస్రాయేలు ప్రజలందరికిని ఆజ్ఞనీయగా అందరును సొలోమోనుతో కలిసి గిబ్యోను ఉన్నతస్థలమునకు వెళ్ళిరి.

3. ప్రభు భక్తుడైన మోషే ఎడారియందు నిర్మించిన దేవుని సమావేశపుగుడారము ఆ తావుననే ఉండెను.

4. (దావీదు మందసమును కిర్యత్యారీము నుండి యెరూషలేమునకు కొనివచ్చి, తాను ఏర్పరచిన తావునందు ఒక గుడారమును నిర్మించి దానియందు మందసమును భద్రపరచెను).

5. హూరు మనుమ డును ఊరి కుమారుడైన బేసలేలు కంచుతో నిర్మించిన బలిపీఠము గిబ్యోనులో దేవుని సాన్నిధ్యపుగుడారము ఎదుటనుండెను. సొలోమోను అతనివెంట ప్రజలు అక్కడ దేవుని దర్శనము చేసికొనిరి. 6. సొలోమోను రాజు దేవుని సాన్నిధ్యపుగుడారము ఎదుటనున్న కంచు బలిపీఠమునెక్కిపోయి వేయి దహనబలులు అర్పించెను.

7. ఆ రేయి ప్రభువు సొలోమోనునకు దర్శనమిచ్చి నీకు ఏమి వరము కావలయునో కోరుకొమ్మనెను.

8. సొలోమోను ”ప్రభూ! నీవు మా తండ్రియైన దావీదుని మిగుల కరుణించితివి. ఇప్పుడు అతని స్థానమున నన్ను రాజునుగా చేసితివి.

9. నీవు మా తండ్రితో పలికిన మాటనిలబెట్టుకొనుము. ధూళి కణములవలె అసంఖ్యాకములుగా నున్న ఈ ప్రజలకు నీవు నన్ను రాజును చేసితివి.

10. కావున వీరిని పరిపాలించుటకు కావలసిన వివేకవిజ్ఞానములను నాకు దయచేయుము. లేదేని ఇంతి అసంఖ్యాకులైన నీ ఈ ప్రజలను ఎవడు పరిపాలింపగలడు?” అనెను.

11. ప్రభువు సొలోమోనుతో ”నీవు ఈ విధముగా యోచించి సిరిసంపదలనుకాని, కీర్తి ప్రతిష్ఠలనుకాని, శత్రునాశనమునుగాని, దీర్ఘాయువును గాని కోరుకోవై తివి. నా ప్రజలను పరిపాలించుటకు వలసిన వివేక విజ్ఞానములను మాత్రము అడిగితివి. నేను నిన్ను వీరికి రాజుగా నియమించితిని.

12. కనుక నేను నీకు వివేకవిజ్ఞానములను ప్రసాదింతును. అదియునుగాక నీకు ముందుగానున్న రాజులు కాని, నీ తరువాతవచ్చు రాజులుకాని పొందజాలని సిరిసంపదలు, కీర్తి ప్రతిష్ఠలను కూడ నీకు దయచేయుదును” అని చెప్పెను.

13. సొలోమోను గిబ్యోను ఉన్నతస్థలమున సమావేశపుగుడారము ఎదుటనున్న బలిపీఠమును వీడి యెరూషలేమునకు వచ్చెను. అచినుండి యిస్రాయేలీ యులను పరిపాలించెను.

14. అతడు పదునాలుగు వందల రథములను, పండ్రెండువేల గుఱ్ఱములను చేకూర్చుకొనెను. వానిలో కొన్నింని ఆయా రథనగర ములందు ఉంచెను.

15. అతని పరిపాలనాకాలమున యెరూషలేమున వెండి, బంగారములు రాళ్ళవలె సమృద్ధిగా లభ్యమయ్యెడివి. దేవదారుకొయ్య లోయల లోని మేడికలప వలె విరివిగా దొరకెడిది.

16. సొలోమోను ఐగుప్తునుండియు, కోవె నుండియు గుఱ్ఱ ములను తెప్పించెడివాడు. అతని వర్తకులు వానిని నియమితమూల్యమునకు కొనెడివారు.

17. రథములు ఐగుప్తునుండి దిగుమతి అయ్యెడివి. రాజోద్యోగులు ఈ గుఱ్ఱములను, రథములను హిత్తీయరాజులకును, సిరియారాజులకును కూడ విక్రయించెడివారు. ఒక్క రథము ఖరీదు ఆరువందల తులముల వెండి. గుఱ్ఱము ఖరీదు నూటయేబది తులముల వెండి.