1 1. పెద్దనైన నేను ఎన్నుకొనబడిన ఆమెకును, ఆమె బిడ్డలకును వ్రాయునది; నేను మిమ్ము నిజముగా ప్రేమించుచున్నాను. నేను మాత్రమేకాక, సత్యమును ఎరిగిన వారందరును మిమ్ము ప్రేమింతురు.

2. ఏలయన, సత్యము మనయందు ఉండుటచేతను, అది శాశ్వతముగ మనతో ఉండును కనుకను వారు అటుల చేయుదురు.

3. తండ్రియగు దేవుడును, ఆ తండ్రికి కుమా రుడగు యేసుక్రీస్తును, మనకు కృపను, కనికరమును, శాంతిని ప్రసాదించునుగాక! సత్యప్రేమలయందు అవి మనవి అగునుగాక!

సత్యము, ప్రేమ

4. తండ్రి మనలను ఆజ్ఞాపించిన విధముగ, నీ బిడ్డలు కొందరు సత్యమున జీవించుట కనుగొని ఎంతయో సంతోషించితిని.

5. కనుక అమ్మా! మనము పరస్పరము అనురాగము కలిగియుందుము. నేను నీకు వ్రాయుచున్నది క్రొత్త ఆజ్ఞ కాదు. ఇది మొదటి  నుండియు మనకు ఉన్న ఆజ్ఞ.

6. ఈ ప్రేమకు అర్థము, మనము దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతుకవలెను అనుటయే. మొదటి నుండియుమీరు వినుచున్నట్లుగ మీరు అందరు ప్రేమలో జీవింపవలెను అనునదియే ఆ ఆజ్ఞ.

7. యేసు క్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చె నని ఒప్పుకొనని మోసగాండ్రు ఎందరో లోకమున సంచరించుచున్నారు. అట్టివ్యక్తి మోసగాడే. అతడు క్రీస్తు విరోధి.

8. మీరు ఇంత వరకును దేనికొరకై కృషి సలిపితిరో దానిని కోల్పోక మీ బహుమానమును సంపూర్ణముగ పొందునట్లు జాగ్రత్త వహింపుడు.

9. క్రీస్తు బోధనను అంటిపెట్టుకొనిఉండక, అతిక్ర మించువానికి దేవుడు లేడు. బోధనను అంటిపెట్టుకొనిఉండువాడు తండ్రి కుమారులను ఇరువురను కలిగి ఉండును.

10. ఎవడైనను ఈ బోధన లేకయే మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొన వలదు, శుభము అని వానితో చెప్పవలదు.

11. అట్టివానికిశుభము పలుకువాడు వాని చెడ్డపనులలో భాగస్వామి అగును.

తుది పలుకులు

12. నేను మీకు చెప్పవలసినది ఎంతయో ఉండుటచే జాబు ద్వారా కాక, మన సంతోషము సంపూర్ణమగునట్లు మిమ్ము కలిసికొని ముఖాముఖిగా సంభాషింప ఆశించుచున్నాను.

13. ఎన్ను కొనబడిన నీ సోదరి బిడ్డలును మీకు తమ శుభాకాంక్షలు అర్పించుచున్నారు.