4 1. ఆయన రాజుగా పాలనము చేయుటకు వచ్చుచున్నందున సజీవులకును, మృతులకును తీర్పుతీర్చు క్రీస్తుయేసు ఎదుటను, దేవుని సమక్షమునను, నేను నిన్ను శాసించుచున్నాను.

2. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును, ప్రతి కూలసమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో, ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచుండుము.

3. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయము వచ్చును. దురద చెవులు కలవారై తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించు పెక్కుమంది బోధకులను వారు చేర దీయుదురు.

4. సత్యమును వినుటవదలి కట్టుకథల వైపు వెళ్ళుదురు.

5. కాని అన్ని విషయములందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారము చేయుచు, దేవునిసేవకుడవుగ నీ విధిని సక్రమముగా నేరవేర్పుము.

చరమ దశలో పౌలు

6. నేను పానార్పణముగ పోయబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది.

7. నేను మంచి పోరాటమును పోరాడితిని. నా పరుగును ముగించితిని. విశ్వాసమును నిలుపు కొంటిని.

8. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు. ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్నవారికి అందరికిని అనుగ్రహించును.

వ్యక్తిగత సూచనలు

9. త్వరలో నన్ను చేరుటకు నీకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుము.

10. దేమా ఇహలోకముపై మక్కువతో నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి.

11. లూకా మాత్రమే నాతోఉన్నాడు. మార్కును నీ వెంటబెట్టు కొనిరమ్ము. అతడు పనిలో నాకు సాయపడగలడు.

12. తుకికును నేను ఎఫెసునకు పంపితిని.

13. నీవు వచ్చునపుడు నేను త్రోయలో కర్పునొద్ద వదలి వచ్చిన నా అంగీని, నా గ్రంథములను, అందు ముఖ్యముగ చర్మపత్రములను వెంట తీసికొనిరమ్ము.   

14. లోహకారుడగు అలెగ్జాండరు నాకు గొప్ప హానియొనర్చెను. వాని పనుల ననుసరించి ప్రభువు వానికి ప్రతిఫలమిచ్చును.
15. కాని నీవు మాత్రము వానిని గూర్చి జాగ్రత్తపడుము. మన సందేశమును అతడు ఎంతగానో ప్రతిఘటించెను.

16. మొదటిసారి నా పక్షమున నేను వాదించినపుడు ఎవరును నాకు తోడు నిలువలేదు. అందరును నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగ దేవుడు దానిని లెక్కింపకుండునుగాక!

17. కాని, సువార్తా ప్రబోధము నా వలన సంపూర్తి యగుటకును, అన్య జనులందరు దానిని వినగలుగుటకును, ప్రభువు నాకు తోడునిలిచి శక్తినొసగెను. కనుక సింహము నోటినుండి నేను రక్షింపబడితిని.

18. ప్రభువు అన్ని కీడులనుండి కాపాడి నన్నుతన పరలోకరాజ్యములోనికి సురక్షితముగ చేర్చుకొనును. ఆయనకు సర్వదామహిమ కలుగునుగాక! ఆమెన్‌.

తుది శుభాకాంక్షలు

19. ప్రిస్కకును, అక్విలాకును, ఒనేసిఫోరుకుటుంబమునకును నా శుభాకాంక్షలు.

20. ఎరస్తు కొరింతులో నిలిచిపోయెను. త్రోఫిము వ్యాధిగ్రస్తుడై నందున అతనిని మిలేతలో వదలితిని.

21. శీత కాలమునకు ముందే నీవు ఇచ్చటకు వచ్చుటకు ప్రయత్నింపుము. యుబూలు, పూదేను, లీను, క్లౌదీయలును, సోదరులందరును, తమ శుభాకాంక్షలను అందించుచున్నారు.

22. ప్రభువు నీ ఆత్మతో ఉండునుగాక! దేవుని కృప మీతో ఉండునుగాక!

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము