ఉపోద్ఘాతము:

పేరు: పౌలు ప్రేషిత కార్యాలలో తీతు భాగస్వామి (2 కొరి. 8:23). గ్రీసు దేశానికి చెందినవాడు. పౌలు రెండవ ప్రయాణంలో తీతు కూడా వున్నాడు (గలతీ 2:1). కొరింతులో ప్రతికూల పరిస్థితులెదురైనప్పుడు పౌలు ఆ నగరాన్ని వదలి వెళుతూ తీతుకు ఆ నగరంలోని సంఘ బాధ్యతలప్పగించాడు (2 కొరి. 8:23). క్రీటు, దలమాతియాలలోని క్రైస్తవ సంఘాలలో గల ఆధ్యాత్మిక అపవాదులను తొలగించి సేవచేశాడు (1:4-6).

కాలము: క్రీ.శ. 63-67.

రచయిత: పౌలు. ఈ లేఖ పౌలు మరణానంతరం అతని అనుచరుల్లో నొకడు వ్రాసాడని కూడా కొందరు అభిప్రాయపడతారు.

చారిత్రక నేపథ్యము: క్రీటు దీవి యందుగల సంఘాలలో నాయకుడిగా అచ్చట పనులను చక్కబరచాలని కోరుతూ పౌలు తీతుకు ఈ లేఖను రాశాడు. విశ్వాసమందు తీతు ‘నా నిజమైన కుమారుడు’ అని పౌలు గర్వంగా చెప్పుకున్నాడు (1:4). క్రీ.శ. 49 లో పౌలుతో కలసి యెరూషలేం సమావేశంలో పాలు పంచుకున్నాడు. తాను సున్నతి పొందని, విశ్వాసము గల క్రైస్తవుడనని తెలుపుకున్నాడు (గలతీ 2:1-3).

ముఖ్యాంశములు: క్రైస్తవ సంఘపెద్దలు అనుసరించవలసిన నిజస్వరూపం, యోగ్యమైన జీవితం కొరకు ఉపదేశాలను చేశాడు. సంఘంలో అధికారాన్ని ఎలా ప్రదర్శించాలో బోధించాడు. బూటకపు సిద్ధాంతాలు, బోధనలను తిప్పికొట్టాడు. దైవసంఘంలోని విశ్వాసం నిలద్రొక్కుకొనుటలో కుటుంబ జీవిత విధాన సరళి సముచితంగా ఉండాలి (2:1-10). అందుకు క్రీస్తు ప్రభువు ఆదర్శం (2:11-3:11).

క్రీస్తుచిత్రీకరణ: క్రీస్తు దైవత్వము, విమోచన క్రియలను ఈ గ్రంథంలో చూడగలం (2:12-13). విశ్వాసులు నిరీక్షణతో భక్తిహీనతను, లౌకిక దురాశలను విడనాడాలి, క్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురుచూడాలి. శ్రీసభ సత్యానికి మూలస్తంభము (3:15). ఏకైక దేవుడు అమరుడు (1:17).