తుది జాడ్యముగల దేవదూతలు

15 1. అప్పుడు దివియందు నేను మరియొక అత్యాశ్చర్యకరమగు సంకేతమును చూచితిని. ఏడు అరిష్టములను ధరించిన ఏడుగురు దేవదూతలు నాకు అట గోచరించిరి.ఇవి తుదిజాడ్యములు.ఏలయన, వానితో దేవుని ఆగ్రహము పరిసమాప్తమాయెను.

2. అగ్నితోకూడి గాజువలె మెరయుచు సముద్రమువలె విస్తరించియున్న ఒకదానిని నేను అట చూచితిని. ఆ మృగము పైనను, దాని విగ్రహము పైనను గెలుపును సాధించినవారిని, సంఖ్యచే సూచింపబడు నామము గలవాని పై విజయమును పొందిన వారిని కూడ నేను అట చూచితిని. వారు ఆ గాజు సముద్రమువలె గోచరించు దాని తీరమున నిలబడి ఉండిరి. వారి చేతులలో దేవుడు ప్రసాదించిన వీణలు ఉండెను.

3. దేవుని సేవకుడగు మోషే గీతమును, గొఱ్ఱెపిల్ల గీతమును వారు ఇట్లు పాడుచుండిరి:

               ”సర్వశక్తిమంతుడవగు దేవా!

               ఓ ప్రభూ! నీ కృత్యములు ఎంత

               ఆశ్చర్యకరములు!

               ఎంత మహిమాన్వితములు?

               సర్వజాతులకు చక్రవర్తీ!

               నీ మార్గములు ఎంత నిర్దోషములు,

               సత్యాన్వితములు!

4.           ఓ ప్రభూ! నీ నామమునకు

               భయపడనివాడెవ్వడు?

నీ మహిమను ప్రకటింపక తిరస్కరించు వాడెవ్వడు? ఏలయన, నీవు మాత్రమే పవిత్రుడవు. నీ సత్యార్యములు అందరకు సువిదితమైనవి. కనుక సర్వ జాతులును నిన్ను చేరి నిన్నే ఆరాధించును”.

5. తరువాత దివియందలి, సాక్ష్యపు గుడారముగల ఆలయము తెరువబడుటచూచితిని.

6. ఏడు జాడ్యములను ధరించిన ఏడుగురు దేవదూతలు ఆ ఆలయమునుండి బయల్వెడలిరి. వారు తెల్లని వస్త్రములను ధరించియుండిరి. వారి వక్షముల యందు బంగారపు పట్టీలు ఉండెను.

7. అంత, ఆ నాలుగు జీవులలో ఒకటి నిత్యుడగు దేవుని ఆగ్రహముతో నిండిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకును ఇచ్చెను.

8. దేవుని మహిమనుండి శక్తి నుండి వెలువడిన ధూమముతో ఆ ఆలయము నిండియుండెను. ఆ ఏడుగురు దేవదూతలచే కల్పింపబడిన ఏడు జాడ్యములు ముగియునంతవరకు ఎవ్వరును ఆ ఆలయమును ప్రవేశింపజాలకపోయిరి.