ఉపోద్ఘాతము:

పేరు: హీబ్రూ భాషలో హబక్కూకు అను పదమునకు ”కౌగలించుట” అని అర్థము. ఇది ”హబక్‌” అను క్రియాపదము నుండి వచ్చినది.  ప్రవక్త  దేవుని హత్తుకొని జీవింతునని చెప్పుటను గుర్తు చేస్తుంది (3:16-19) .

కాలము: క్రీ.పూ. 605-600 

రచయిత:  హబక్కూకు (1:1; 3:1). ఇతడు యిర్మీయా ప్రవక్త సమకాలికుడని సూచించుదురు.  దానియేలు గ్రంథము ప్రకారము సింహపు బోనులోనున్న దానియేలునకు ఇతడు పరిచర్య చేసెనని తెలియును (దాని. 14:33-39).

చారిత్రక నేపథ్యము: యూదుల సాంప్రదాయము ప్రకారము యూదానేలిన మనష్షే (క్రీ.పూ. 687-642) కాలములో హబక్కూకు జీవించెను. అయితే యెహోయాకీము (క్రీ.పూ 609-598) కాలములో ప్రవక్తగా పనిచేసి ఉండవచ్చునని కొందరు బైబులపండితుల అభిప్రాయము. యూదా రాజ్యములోని దుర్మార్గాన్ని, అన్యాయాన్ని హబక్కూకు యావే దేవునికి ఫిర్యాదు చేశాడు (1:2-4). అయితే యూదావారిని శిక్షింప తమకంటె దుష్టులైన మరియు అన్యులైన బబులోనును దేవుడు ఎన్నుకొనుట ప్రవక్తనకు ఆశ్చర్యము కలిగించెను. అయితే దేవుని సాన్నిధ్యములో ప్రవక్త తగు జవాబును, స్వాంతననొంది దేవుని యందు తన ప్రగాఢమైన భక్తివిశ్వాసాలను ప్రకించుటతో గ్రంథము ముగియును.

ముఖ్యాంశములు:  ఈ గ్రంథములో ప్రవక్తకు మరియు దేవునికి మధ్య జరిగిన సంభాషణలో నూతన ఒరవడి కనపడుతుంది. పూర్వప్రవక్తలు ప్రజల దుర్మార్గాలను ఫిర్యాదు రూపములో విన్నవించగా, హబక్కూకు దేవుని న్యాయమును ప్రశ్నించడము చూచెదము. యూదులను శిక్షించడానికి మూర్ఖులైన బబులోనీయులను దేవుడు ఏల వినియోగించుకొనెననుదునది ప్రవక్త ప్రశ్న.  విశ్వాసముతో నిండిన వ్యక్తి ప్రార్థనలో ఫిర్యాదులు, స్తుతులు, ప్రశ్నలు దేవునిపై నమ్మకము చూపిస్తాయని హబక్కూకు తెలుపును.  స్వశక్తిని నమ్ముకొని గర్వించువారికి పతనము తప్పదు (1:11). గర్విష్ఠులనుగాక, విశ్వాసులను దేవుడు అంగీకరించును (2:4). కష్ట సమయములలో విశ్వాసము పరీక్షకు గురైనప్పికి శక్తినిచ్చే నిజమైన ఆధారము దేవుడే (3:18).

క్రీస్తుకు అన్వయము: ఈ గ్రంథములో ”రక్షణ” అనే పదము కనపడుతుంది (3:13,18). యేసు అనగా రక్షకుడని అర్ధము (మత్త. 1:21). క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు సముద్రము నీితో నిండియున్నట్లే భూమి యావే మహత్మ్యము గూర్చిన జ్ఞానముతో నిండి వుంటుంది. 2:14 వచనాన్ని క్రీస్తు రెండవ రాకడకు ఛాయాచిత్రంగా గుర్తించవచ్చును (లూకా 22:69). ఈ గ్రంథమందలి 2:12 వచనము పౌలు భక్తుడు రోమీయులకు వ్రాసిన పత్రికకు మూలవాక్యమైయున్నది (రోమీ.1:17).

Home  

Previous                                                                                                                                                                                               Next