మాగోగునకు రాజైన గోగు

38 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! నీవు మాగోగు దేశములోని  రోషు, మెషెక్కు, తుబాలు అను జాతులకు అధిపతియైన గోగును ఖండింపుము.

3. యావే ప్రభుడనైన నేను అతనికి విరోధిని అగుదునని చెప్పుము.

4. నేను అతనిని వెనుకకు త్రిప్పి అతని దౌడలకు గాలము తగి లింతును. అతనిని, అతనిసైన్యములను ఈడ్చుకొని పోవుదును. అతని దండు చాలగొప్పది. అతనికి అశ్వ బలమును, ఆయుధధారులైన రౌతులును గలరు. ప్రతి సైనికుడు డాలును, కత్తిని తాల్చును.

5. పారశీకము, కూషు, పూటు దేశముల సైనికులు అతని పక్షమున ఉన్నారు. వారికి డాళ్ళు, శిరస్త్రాణములు కలవు.

6. గోమెరు వీరులు, ఉత్తరమున ఉన్న బేత్‌తొగార్మా వీరులు అతని పక్షమున ఉన్నారు. ఇంకను పెక్కు దేశముల సైనికులతనిని అనుసరించుచున్నారు.

7. అతనిని యుద్ధమునకు సన్నద్ధము కమ్మని చెప్పుము. తన సైన్యములను సిద్ధము చేసికొమ్మని చెప్పుము.

8. చాల ఏండ్ల తరువాత నేనతనితో నీవు ఒక దేశమును ముట్టడింపుమని చెప్పుదును. ఆ దేశప్రజలను పెక్కు జాతుల నుండి ప్రోగుచేసికొని వచ్చిరి. వారు యుద్ధ భయము లేక నిశ్చింతగా జీవించుచున్నారు. అతడు యిస్రాయేలు కొండలను ముట్టడించును. అవి చాలా కాలము వరకు ఎడారులుగా ఉండెను. కాని వానిలో ఇపుడు ప్రజలు సురక్షితముగా జీవించుచున్నారు.

9. గోగును, అతని సైన్యములును, అతని వెంటనున్న పెక్కు జాతులును తుఫానువలె ఆ దేశముపైకి వచ్చును. దానిని మేఘమువలె క్రమ్మును.

10. యావే ప్రభువు గోగుతో ఇట్లు అనుచున్నాడు: ఆ కాలము వచ్చినపుడు నీవొక చెడ్డ పన్నాగమును పన్నుదువు. 11. నీవు దురాలోచనలతో ఇట్లనుకొను చున్నావు. ‘నేను నిస్సహాయముగానున్న దేశమును ముట్టడింపగోరుదును. అచి ప్రజలు నిశ్చింతగా జీవించుచున్నారు.’ అందలినగరములకు ప్రాకారములు ద్వారములు గడెలు లేవు.

12. ఒకప్పుడు శిథిలము లుగా ఉండిపోయిన నగరములను నీవు తిరిగి దోచుకొందుననుకొనుచున్నావు. వారిని అన్యజాతుల నుండి తోడ్కొనివచ్చిరి. వారికిప్పుడు పశులమందలు, సరకులు కలవు. వారు ప్రపంచమధ్యమున జీవించు చున్నారు.

13. షేబా, దెదాను ప్రజలు తర్షీషు వర్తకులు ‘నీవు నీ సైన్యమును సిద్ధముచేసికొని ఆ దేశమును దోచుకొందువా? ఆ దేశమునుండి వెండి, బంగారము లను, పశువులను, సరకులను, కొల్లసొమ్మును దోచు కొని వెడలిపోవుదువా?’ అని నిన్ను ప్రశ్నింతురు.

14-15. ప్రభువు నన్ను గోగుతో తన మాటలుగా ఇట్లు చెప్పుమనెను: నా ప్రజలైన యిస్రాయేలీయులు సురక్షితముగా జీవించుచుండగా నీవు ఉత్తరమున దూరప్రాంతముననున్న నీ స్థలమునుండి బయలుదేరు దువు. నీవు చాలజాతుల నుండి వచ్చిన బంటులతో గూడిన మహాసైన్యమును నడిపించు కొనివత్తువు.

16. వారెల్లరును గుఱ్ఱములపై వత్తురు. నీవు భూమి మీదికి వ్యాపించు తుఫానువలె వచ్చి నా ప్రజలమీద పడుదువు. ఆ కాలము వచ్చినపుడు నేను నిన్ను నా దేశమును ముట్టడించుటకు పంపుదును. దాని వలన జాతులు నేనెవరినో తెలిసికొనును. నీ ద్వారా నేను చేయు కార్య ములు చూచి నా పావిత్య్రమును అర్థము చేసికొనును.

17. నేను రాబోవు కాలములో యిస్రాయేలీయులను ముట్టడించుటకు ఒకనిని పంపుదునని పూర్వమే నా సేవకులైన యిస్రాయేలు ప్రవక్తలద్వారా చెప్పించితిని. అతడివి నీవే.

దేవుడు గోగును శిక్షించును

18. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: గోగు యిస్రా యేలును ముట్టడించినపుడు నేను ఆగ్రహము చెందుదును.

19. నేను కోపావేశముతో చెప్పుచున్నాను. ఆ దినమున యిస్రాయేలు దేశమున పెద్ద భూకంపము సంభ వించును.

20. ప్రతి చేప, పక్షి, వన్యమృగములు, భూమిమీద ప్రాకుప్రాణులు, నేలమీది ప్రతినరుడు నన్ను చూచి భయపడును. కొండలు కూలును, శిఖర ములు రాలును, ప్రాకారములు పడిపోవును.

21. నేను గోగును పెక్కువిపత్తులతో భయపెట్టుదును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు. అతని సైనికులు ఒకరినొకరు కత్తితో చంపుకొందురు.

22. నేను అతనిని రోగముతోను, రక్తపాతముతోను శిక్షింతును. అతని మీదను, అతని సైన్యముమీదను, అతని పక్షమును అవలంబించిన నానాజాతుల  మీదను నిప్పు గంధకములతో కూడిన కుంభవర్షములు వడగండ్లు కురియును.

23. ఈ రీతిగా నేను ఎల్లజాతులకు నా మహాత్మ్యమును, పావిత్య్రమును వెల్లడి చేయుదును. ఎల్లజాతులు నన్ను తెలిసికొనునట్లు చేయుదును. అప్పుడు నేను ప్రభుడనని ఎల్లరును గుర్తింతురు.”