ఉపోద్ఘాతము:

పేరు: రాజులు రెండు గ్రంథములకు సంబంధించి సమూవేలు గ్రంథముయొక్క ఉపోద్ఘాతమున అందించిన వివరాలను కూడ చూడవలయును. రాజులు రెండు గ్రంథములలో రాజులు, రాజ్యపాలన విషయాంశములు ఎక్కువగా వుండుటవలన ఈ గ్రంథములకు ”రాజులు” అను పేరు పెట్టడమయినది.

కాలము: క్రీ.పూ. 6వ శతాబ్ద ఆరంభములో వ్రాయబడినది.

రచయిత: రాజులు రెండు గ్రంథములు ద్వితీయోపదేశకారుని చరిత్ర గ్రంథములోని భాగము. ఈ రెండు గ్రంథములలో ప్రస్తావించబడిన సొలోమోను చరిత్ర, యూదా రాజుల చరిత్ర, యిస్రాయేలు రాజుల చరిత్ర మరియు ఇతర మూలములను గ్రంథకర్తలు ఉపయోగించి ఉందురు.

చారిత్రక నేపథ్యము: సమూవేలు రెండు గ్రంథములకు, రాజుల రెండు గ్రంథములకు దగ్గర సంబంధము వుండును.  ఈ నాలుగు గ్రంథములు కలసి ఇటు హెబ్రీయ  ఐక్యరాజ్యము గురించి అటు విభజనానంతరము ఉత్తర (యిస్రాయేలీయులు), దక్షిణ (యూదయ) రాజ్యముల గురించి అనేక విషయాలు అందజేస్తాయి. రాజుల రెండు గ్రంథముల కాలము క్రీ.పూ. 970-550 వరకు వుండును.  దావీదు మరణానంతరము సొలోమోను రాజు పాలన కొనసాగును.

ముఖ్యాంశములు: యిస్రాయేలు ప్రజకు రాజు దేవుని ప్రతినిధిగా వ్యవహరించును. రాజులు దేవుని నిబంధన పరిరక్షకులుగా పాలనను అందించవలయును. ఈ గ్రంథములో రాజుల పతనము, అవిధేయత, దానికి తగిన శిక్ష మొ||లగు అంశములు కనిపించును.

క్రీస్తుకు అన్వయము: క్రీస్తుని ప్రతిబింబించే పలు అంశములు సొలోమోను రాజులో కనిపిస్తాయి (ఘనత, మహిమ, ప్రతిష్ట, సంపద). క్రీస్తు సొలోమోను కంటె గొప్పవాడు (మత్త. 12:42). ఏలియా ప్రవక్త (1 రాజు. 17, 18, 19) మరియు ఎలీషా ప్రవక్తల (19:19-21) అద్భుతాలు, మహిమలు క్రీస్తునకు సూచకములు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము