కొయ్యబొమ్మలు, నోవా కొయ్యఓడ

14 1.       అలలు చెలరేగిన సముద్రములో

                              ఓడ నడుపు నావికుడు

                              తన ఓడమీది కొయ్య బొమ్మకు

                              దండము పెట్టుకొనును.

                              పడవకున్న దారుఢ్యము కూడ

                              ఆ బొమ్మకు లేదు.

2.           లాభకాంక్షతో నరుడు పడవను కనిపెట్టెను.

               చేతిపని వాడొకడు నేర్పుతో దానిని చేసిపెట్టెను.

3.           కాని తండ్రీ! దూరదృష్టితో

               ఆ పడవను నడుపువాడవు నీవే.

               నీవు సముద్రతరంగములగుండ దానికి

               సురక్షితమార్గము కల్పింతువు.

4.           ఆపాయముల నుండి రక్షింతువు.

               నీవున్నావు కనుకనే నేర్పు చాలనివారుకూడ

               సముద్రయానము చేయుచున్నారు.

5.           నీవు విజ్ఞానముతో చేసిన వస్తువులు

               నరులకు ఉపయోగపడవలెననియే నీ కోరిక.

               కనుకనే నరులు చిన్న కొయ్యముక్కను నమ్ముచున్నారు

               చిన్న కొయ్య పడవపై మహాసముద్రములు దాి సురక్షితముగా తీరము చేరుచున్నారు.

6. పూర్వము గర్వాత్ములైన రాక్షసజాతి నరులు

               నాశనమగునపుడు,

               లోకమెవరి మీద ఆశ పెట్టుకొని యుండెనో

               ఆ నరులు, ఒక చిన్న పడవనెక్కి

               తమ ప్రాణములు కాపాడుకొనిరి.

               నీవే ఆ పడవను రక్షించితివి.

               కనుక ఆ ప్రజలు లోకమునకు

               నూత్ననరజాతిని ప్రసాదింపగలిగిరి.

7.            నీతిమంతులను రక్షించిన ఆ కొయ్య

               దీవెనలు పడయునుగాక!

8.           కాని నరుడు చేసిన కొయ్య విగ్రహము,

               దానిని చేసిన నరుడుకూడ

               శాపగ్రస్తులగుదురుగాక!

               అతడు నశించునదైన వస్తువును చేసి,

               దానిని దేవుడని పిలుచుచున్నాడు.

9.           దుష్టులను, వారు చేసిన దుష్టవస్తువులనుగూడ

               ప్రభువు ద్వేషించును.

10. పనివానిని, వాడు చేసిన పనిని గూడ

               దేవుడు శిక్షించును.

11.           అన్యమతస్థుల విగ్రహములకు

               దేవుడు తీర్పుతీర్చును.

               అవి దేవుడు కలిగించిన సృష్టివస్తువులైనను,

               హేయములయ్యెను.

               ప్రజలు గోతిలో పడుటకును,

               మూర్ఖులు బంధములలో చిక్కుకొనుటకును

               కారణమయ్యెను.

విగ్రహముల పుట్టుక

12.          విగ్రహములు పొడచూపుట వలన

               వ్యభిచారము పుట్టెను.

               అవి బయలు దేరినప్పినుండి

               నరుని జీవితము భ్రష్టమయ్యెను.    

13.          విగ్రహములు ఆదినుండియు లేవు,

               కలకాలమును ఉండబోవు.

14.          నరుని అహంకారము వలన

               అవి లోకము లోనికి వచ్చెను.

               కనుక అవి స్వల్పకాలముననే గతించును.

15.          పూర్వము ఒక తండ్రి తన పుత్రుడు

               తలవనితలంపుగా చనిపోగా ఘోర వ్యాకులత నొంది

               ఆ కుమారుని బొమ్మను చేసెను.

               నిన్న చచ్చిన నరుని, నేడు దేవునిగా చేసి పూజించెను

               అతడు తన క్రింది వారికిని

               ఆ దేవుని పూజించువిధానమును,

               రహస్యారాధన పద్ధతులును నేర్పిపోయెను.

16.          కాలక్రమమున ఆ దుష్టకార్యము బలపడి   నియమముగా మారిపోయెను.

               రాజుల శాసనము ద్వారా

               బొమ్మలు ఆరాధ్యదైవములు అయ్యెను.

17.          దూరముగానున్న రాజును తమ ముందట

               గౌరవింపగోరిన ప్రజలు అతని ఆకారమును

               ఊహించుకొని ప్రతిమను తయారుచేయుదురు.

               దూరమున వున్నవానిని  దగ్గరలో నున్నవానినివలె,

               ముఖస్తుతి చేయవలెనని వారి ఆశయము.

18.          ఈ బొమ్మలను చేసిన దురాశాపరుడైన

               కళాకారుడు ఆ రాజు గూర్చి

               ఏమాత్రము తెలియని వారినిగూడ

               అతని ఆరాధనకు పురికొల్పును.

19. అతడు రాజు మెప్పు బడయగోరి 

               మిగులనేర్పుతో  రాజుకంటె

               అతని ప్రతిమను సుందరముగా మలచును.

20.        సామాన్యులు ఆ ప్రతిమ

               సౌందర్యమునకు మురిసిపోయి,

               పూర్వము తాము నరునిగానెంచి గౌరవించినవానినే 

               ఇపుడు ఆరాధించుటకు పూనుకొందురు.

21.          ఈ రీతిగా ప్రజలు గోతిలో పడసాగిరి.

               వారు యాతనలను అనుభవించుటవలననో,

               లేక రాజాజ్ఞకు బద్ధులగుట వలననో,

               ఏ వస్తువునకును చెల్లని దివ్యత్వమును

               ఒక కొయ్యకో, బండకో అంటగ్టి

               వానిని పూజింపమొదలిడిరి.

విగ్రహరాధన వలన దుష్ఫలితములు

22.        వారు భగవంతుని గూర్చి

               సరిగా తెలిసికొనకపోవుట మాత్రమే కాదు,

               అజ్ఞానమను పోరాటమున గూడ చిక్కిరి.

               ఆ పోరాటము శాంతికి నిలయమని భ్రమపడిరి.

23.        వారు రహస్యారాధనలకు పాల్పడి,

               తమ బిడ్డలను బలి యిచ్చిరి.

               ఆ ఆరాధనలలో వెఱ్ఱి ఆవేశముతో

               ఘోరకార్యములు చేసిరి.

24.         అపవిత్రముగా జీవించి,

               అపవిత్రముగా వివాహములు చేసికొనిరి.

               ద్రోహబుద్ధితో పరస్పరము చంపుకొనిరి.

               లేదా పరస్త్రీలను చెరచిరి.

25.        ఎక్కడ చూచినను రక్తపాతము, చౌర్యము,

               మోసము, లంచము, ద్రోహము, అలజడి,

               అబద్ధము.

26.        సజ్జనులను బాధించుట, కృతఘ్నత,

               నైతిక పతనము, అసహజమైన లైంగికప్రక్రియలు,

               భగ్నవివాహములు, వ్యభిచారములు.

27. విగ్రహముల పేరు కూడ ఎత్తకూడదు.

               అి్టవాని పూజ ఎల్ల అనర్థములకు కారణము,

               ప్రారంభము, పర్యవసానము కూడ.

28.        విగ్రహారాధకులు వెఱ్ఱిఆవేశముతో

               పొలికేకలు వేయుదురు,

               లేదా అబద్ధ ప్రవచనములు పలుకుదురు,

               లేదా దుష్టజీవితము గడుపుదురు,

               లేదా మాట తప్పుదురు.

29. వారు కొలుచు విగ్రహములు నిర్జీవములు  కనుక

               తాము అబద్ధ ప్రమాణములు చేసినను

               ఎి్ట హాని కలుగదని భావింతురు.

30.        కాని  రెండు కారణముల వలన

               ఆ దుష్టులకు శిక్ష తప్పదు.

               మొదిది: వారు విగ్రహములను కొలిచినందున,

               దేవుని గూర్చి తప్పుగా నెంచిరి.

               రెండవది: వారు పరిశుద్ధుడైన దేవుని లెక్కచేయక

               కల్లలాడి నరులను మోసగించిరి. 

31.          దుర్మార్గులు తప్పు చేసినపుడు

               వారు చేసిన ప్రమాణములలోని శక్తికాక,

               వారికి ప్రాప్తింపనున్న పాపశిక్షయే

               వారిని వెంటబడి దండించును.