ఉపోద్ఘాతము:
పేరు: హీబ్రూ భాషలోని ‘హోషేయ’అను పదమునకు తెలుగు అనువాదము ”యావే రక్షించెను” అని అర్థము. హోషేయ ప్రవక్త ఉత్తరరాజ్యమైన యిస్రాయేలుదేశ నివాసి. బేరి కుమారుడు. ఇతడు ప్రధానముగ ఉత్తరరాజ్యమును గురించి ప్రవచించెను. (7:5).
కాలము: క్రీ.పూ. 750-732. ఈ గ్రంథములో క్రీ.పూ. 750-725 మధ్యకాలము నాి వృత్తాంతములు వివరింపబడినవి.
రచయిత: హోషేయ మరియు అతని శిష్యులు.
చారిత్రక నేపథ్యము: హీబ్రూరాజ్యము సొలోమోను రాజు అనంతరము ఉత్తరరాజ్యము (యిస్రాయేలు), దక్షిణరాజ్యము (యూదా) అను రెండు రాజ్యములుగా విడిపోయినది. హోషేయ ఉత్తరరాజ్య స్థితిగతులను గురించి ప్రవచించెను. ఇతడు ఆమోసు, యెషయా ప్రవక్తల సమకాలికుడు. యావే దేవునికి మరియు ఆయన ప్రజలైన యిస్రాయేలీయులకు మధ్య ఉన్న సంబంధము భర్త మరియు భార్య మధ్య ఉన్న వైవాహిక సంబంధముగా ఈ గ్రంథమందు విశేషించి ఉదహరించబడినది. ఇందునుబ్టి యిస్రాయేలీయులు అన్యదేవతలను ఆరాధించడము మహాపరాధము. ఈ అవిశ్వసనీయతను హోషేయ వ్యభిచారముగా భావించెను. యిస్రాయేలీయులు సహాయార్థము యావే దేవుణ్ణి కాకుండ ఇతర రాజులను ఆశ్రయించిరి. ఇది సీనాయి నిబంధనమునకు విరుద్ధము. ఈ నేపథ్యములో హోషేయ ప్రవక్త ప్రవచించెను.
ముఖ్యాంశములు: యిస్రాయేలీయులు యావే దేవునికే గౌరవ ఆరాధనలు, విశ్వాసము వ్యక్తపరచడము చేయవలెననునది గ్రంథము యొక్క ముఖ్యాంశము. హోషేయ తన వ్యక్తిగత వైవాహిక జీవితానుభవాన్ని ఆధారముగా చేసుకొని యావే దేవుని నమ్ముకొని అంకిత భావముతో ఉండవలెనని యిస్రాయేలీయులకు బోధించడము మరొక ముఖ్యాంశము. తన భార్య గోమేరును అపవిత్రతనుండి కాపాడడానికి హోషేయ తన జీవితాన్నే పణముగా ప్టోడు. యిస్రాయేలీయులకు గత వైభవాన్ని గుర్తుచేస్తూ వారిని ప్రోత్సహించెను. యావే దేవుడు మానవరాజ్యములపై సార్వభౌమాధికారాన్ని కలిగియున్నాడు. హోషేయ కుటుంబజీవితము నిబంధన జీవితానికి సంకేతముగా ఉండును. నహూము గ్రంథము మినహా ఇతర ప్రవక్తల గ్రంథమువలె పునరుద్ధరణ – నూత్నీకరణ ఈ గ్రంథములో మరొక ప్రధానాంశము.
క్రీస్తుకు అన్వయము: 11:1 వచనము క్రీస్తు పసిబాలుడుగా ఐగుప్తులో గడిపిన కాలానంతరము తిరిగివచ్చుటను సూచించును (మత్త. 2:15). హోషేయ తన భార్య గోమేరును క్రయమునకు కొను సంఘటన క్రీస్తు తన రక్తముద్వారా పాపులను విమోచించుటను సూచించును. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలనే అంశాన్ని క్రీస్తు దేవుణ్ణి, ‘అబ్బా’ అని సంబోధించడానికి ఆధారముగా గ్రహించెదము. (11:1-12; లూకా 11:1-4). క్రీస్తుకు స్త్రీసభ వధువుకాగా, క్రీస్తు వరునిగా అను పౌలుభక్తుని పోలిక ఈ గ్రంథములో ప్రతిబింబించును.