లేవీయుల విభాగములు, వారి బాధ్యతలు

23 1. దావీదు ఏండ్లుచెల్లి పండు ముదుసలైనపుడు తన కుమారుడు సొలోమోనును యిస్రాయేలీయులకు రాజును చేసెను.

2. దావీదు యిస్రాయేలు నాయకు లను, యాజకులను, లేవీయులను ప్రోగుచేసెను.

3. లేవీయులలో ముప్పది మరియు అంతకుమించిన ఏండ్లు గల పురుషులకు జనాభాలెక్కలు తయారు చేయించెను. వారు ముప్పది ఎనిమిది వేలమంది తేలిరి.

4. దావీదు వారితో ”ఇరువది నాలుగు వేలమందిని దేవాలయమున పరిచర్యచేయుటకును, ఆరువేలమందిని అధికారులుగను మరియు న్యాయాధి పతులుగను, 5. నాలుగువేల మందిని ద్వారపాలకులు గను, నాలుగువేలమందిని నేను స్వయముగా తయారు చేయించిన సంగీత వాద్యములతో దేవుని స్తుతించుటకును నియమించితిని” అనెను.

6. గెర్షోను, కోహాతు, మెరారి అను లేవీయులను దావీదు మూడువరుసలుగా విభజించెను.

7. గెర్షోను నకు గెర్షోనీయులలో లదాను, షిమీ అను ఇద్దరు కుమా రులు కలరు.

8-9. లదాను కుమారులు యహీయేలు, సేతాము, యోవేలు. వారు లదాను వంశములకు నాయకులైరి. షిమీ కుమారులు షెలోమోతు, హాజియేలు, హారాను.

10-11. షిమీ కుమారులు వయస్సు క్రమములో యహాతు, సీనా, యేయూషు, బెరీయా అనువారు నలుగురు. యోయూషు, బెరీయాలకు కుమారులు అంతగా కలుగలేదు. కనుక వారు ఇరువురు కలసి ఒక వంశముగా పరిగణింపబడిరి.

12. కోహాతు నలుగురు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

13. అమ్రాము తన యులు అహరోను, మోషే అనువారు. అహరోను, అతని వంశజులు నిత్యము పరమపవిత్రమైన వస్తువు లను నివేదించుటలో నిమగ్నులైయుండిరి. ప్రభువు సాన్నిధ్యమున సాంబ్రాణి పొగవేయుట, ఆయనను సేవించుట, ప్రభువునామమున ప్రజలను దీవించుట వారి పనులు.

14. కాని దైవసేవకుడైన మోషే తనయులు మాత్రము లేవీయులుగా పరిగణింపబడిరి.

15. గెర్షోము, ఎలియెజెరు మోషే తనయులు.

16. గెర్షోము తనయులకు నాయకుడు షెబూవేలు.

17. ఎలియెజెరు కుమారుడు రెహబ్యా ఒక్కడే. కాని అతని వంశజులు మాత్రము చాలమంది ఉండిరి.

18. ఇస్హారు కుమారుడు షెలోమీతు అతని వంశనాయ కుడు.

19. హెబ్రోను నలుగురు కుమారులు వయస్సు క్రమములో యెరీయా, అమర్యా, యెహజీయేలు, యెక్మెయాము. 20. ఉజ్జీయేలు కుమారులు మీకా, యిషియా.

21. మెరారి ఇద్దరు పుత్రులు మహ్లి, మూషి. మహ్లికి ఇద్దరు కుమారులు ఎలియెజెరు, కీషు.

22. ఎలియెజెరునకు చనిపోవునాికి కుమార్తెలే కాని కుమారులు లేరైరి. ఆ కుమార్తెలు తమ బంధువులైన కీషు వంశజులను పెండ్లియాడిరి.

23. మూషీ ముగ్గురు తనయులు మహ్లి, ఎదేరు, యెరేమోతు.

24. లేవీ వంశములవారిగాను, కుటుంబముల వారిగాను వీరుండిరి. వారెల్లరును తమ పేర్లు నమోదు చేయించుకొనిరి. ఇరువది లేక అంతకు మించిన ఏండ్లుగల లేవీవంశజులెల్లరును దేవాలయమున ఊడిగము చేసిరి.

25. దావీదు ”ప్రభువు యిస్రాయేలీయులకు శాంతిని దయచేసెను. ఆయన స్వయముగా యెరూషలేమున వసించును.

26. కనుక ఇక మీదట లేవీయులు ప్రభువు మందసమునుగాని ఆరాధన సమయమున వాడెడి వస్తుసామగ్రినికాని, మోసికొని పోనక్కరలేదు” అని చెప్పెను.

27-29. దావీదు తుది యాజ్ఞ ప్రకారము ఇరువదియేండ్లు అంతకుపైబడి ప్రాయముగల లేవీయులందరిని లెక్కించి వారికి ఈ క్రింది పనులను ఒప్పజెప్పిరి: ”అహరోను వంశజులైన యాజకుల చేతిక్రింద దేవాలయ ఆరాధనలో తోడ్పడుట, దేవాలయ ప్రాంగణములు, గదులను చూచుకొనుట, పరిశుద్ధవస్తువులను శుద్ధిచేయుట, దేవునియెదుట రొట్టెలను సమర్పించు పిండిని, పులిపిడి ద్రవ్యము లేకుండ చేసిన రొట్టెలను, పెనముమీద కాల్చిన రొట్టెలను, ఓలివు తైలముతో కలిపిన పిండిని మొదలైన వానిని పరిశీలించుట, కానుకలుగా అర్పించిన వస్తువు లను కొలుచుట లేక తూచుట వారి బాధ్యతలు.

30. వారు ప్రతిదినము ఉదయసాయంకాలములందు దేవాలయమున ప్రోగై ప్రభువును స్తుతింపవలయును.

31. విశ్రాంతిదినములందుగాని, అమావాస్యలందు గాని, ఇతర పండుగలందుగాని, ప్రభువునకు దహన బలులర్పించునపుడు వారు ప్రోగుకావలెను. ఈ సమ యమున ఎందరు లేవీయులు హాజరు కావలెనో ముందుగనే నిర్ణయింపబడెను. ప్రభువును నిరంతరము సేవించుట వారిపని.

32. దేవాలయమును, గుడార మును కాపాడుటయు, అహరోను వంశజులును మరియు తమకు బంధువులైన యాజకులకు సహా యము చేయుటయు వారి పూచీ”.