మకుటము

1 1. తెకోవకు చెందిన కాపరియగు ఆమోసు పలుకు లివి. ఉజ్జీయా యూదాకును, యెహోవాషు కుమారు డైన యరోబాము యిస్రాయేలు రాజ్యమునకును రాజులుగానున్నపుడు, భూకంపమునకు రెండేండ్లు ముందట, యిస్రాయేలును గూర్చి ఈ సంగతులనెల్ల దేవుడు ఆమోసునకు వెల్లడిచేసెను.

ప్రారంభము

2. ఆమోసు ఇట్లనెను: ”ప్రభువు సియోను నుండి గర్జించును. యోరుషలేమునుండి ఆయన ధ్వానము ఉరుమువలె వినిపించును. కాపరులు సంచరించు గడ్డిబీళ్ళు  విలపించుచున్నవి. కర్మెలు పర్వతము బీడుగా మారినది”.

యిస్రాయేలీయులకు, వారి ఇరుగుపొరుగు జాతులకు శిక్ష

సిరియా

3. ప్రభువు ఇట్లనుచున్నాడు: ”దమస్కు చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున దానిని వెనుదీయక శిక్షించితీరుదును. ఎందుకనగ దాని ప్రజలు నూర్పిడి ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.

4. కావున నేను హజాయేలు ప్రాసాదముమీదికి, నిప్పును పంపుదును. బెన్హెదదు కోటలను తగులబెట్టుదును.

5. దమస్కు నగరద్వారములను బ్రద్దలు చేయుదును. ఆవెను లోయలోని ప్రజలను నిర్మూలింతును. బేతేదెను రాజును తొలగింతును. సిరియావాసులు కీరు దేశమునకు బందీలుగా వెళ్ళిపోవుదురు.

ఫిలిస్తీయా

6. ప్రభువు ఇట్లనుచున్నాడు: గాజా చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవఅతిక్రమము కారణమున నేను దానిని శిక్షించితీరుదును. గాజా ప్రజలు చెరప్టిన ఒకజాతినంతిని కొనిపోయి ఎదోమీయులకు బానిసలనుగా అమ్మిరి.

7. కావున నేను గాజా ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును. దాని నగరులను దహించి వేయుదును.

8. అష్దోదు, అష్కెలోను నగరముల రాజులను నిర్మూలింతును. ఎక్రోను నగరమును దండింతును. ఫిలిస్తీయులలో మిగిలినవారెల్లరును చత్తురు అని ప్రభువైన యావే సెలవిచ్చుచున్నాడు.

తూరు

9. ప్రభువిట్లనుచున్నాడు: తూరు చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని శిక్షించి తీరుదును. ఏలయన దాని జనులు సహోదరనిబంధనమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టుబడిన వారినందరిని ఏదోమీయులకు బానిసలనుగా అప్పగించిరి.

10. కావున నేను తూరు ప్రాకారములమీదికి నిప్పును పంపుదును. దాని కోటలను కాల్చివేయుదును”.

ఎదోము

11. ప్రభువిట్లనుచున్నాడు: ఎదోము చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని శిక్షించి తీరుదును. వారు నిర్దయులై ఖడ్గముతో తమ సోదరుల వెంటబడిరి. తమ కోపమును విడనాడక వారిని తునుమాడిరి.

12. కావున నేను తేమాను మీదికి నిప్పును పంపగా అది బోస్రా నగరులను కాల్చివేయును.

అమ్మోను

13. ప్రభువు ఇట్లనుచున్నాడు: అమ్మోను చేసిన మూడు అతిక్రమముల కారణమున,  దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని దండించి తీరుదును. వారు తమ పొలిమేరలను విస్తరింపచేసికొనుటకు సల్పిన యుద్ధములలో గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేసిరి.

14. కావున నేను రబ్బా నగర ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును. రణకేకలతోను, సుడిగాలి వీచునపుడు కలుగు ప్రళయమువలె దాని నగరులను కాల్చివేయుదును.

15. వారి రాజు, అతడి అధిపతులు చెరలోనికి కొనిపోబడుదురు”.

Previous                                                                                                                                                                                                     Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము