దేవాలయ పతనము – ప్రభు ప్రవచనము

(మత్తయి 24:1-2; లూకా 21:5-6)

13 1. యేసు దేవాలయము నుండి వెళ్ళుచుండగా శిష్యులలో ఒకడు ”బోధకుడా! ఈ రాళ్ళు ఎట్టివో, ఈ కట్టడములు ఎట్టివో చూడుడు” అనెను.

2. ”మీరు చూచు ఈ గొప్ప కట్టడములు రాతిమీద రాయి నిలువక నేలమట్టమగును” అని యేసు పలికెను.

శ్రమలు – హింసలు

(మత్తయి 24:3-14; లూకా 21:7-19)

3. యేసు ఓలివుకొండపై దేవాలయమునకు ఎదురుగా ఏకాంతమున కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయలు వచ్చి, 4. ”ఇవి అన్నియు ఎప్పుడు సంభవించును? వీని రాకడకు సూచన ఏమి?” అని అడిగిరి.

5. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను: ”మిమ్ము ఎవ్వరును మోసగింపకుండ మెలకువ కలిగిఉండుడు.

6. అనేకులు నాపేరిట వచ్చి ‘నేనే ఆయనను’ అని ఎందరినో మోసగింతురు.

7. మీరు యుద్ధములను గూర్చియు, వానికి సంబంధించిన వార్తలను గూర్చియు వినునపుడు కలవరపడకుడు. ఇవి అన్నియు జరిగి తీరును. అంతలోనే అంతము రాదు.

8. జాతికి జాతి, రాజ్యమునకు రాజ్యము విరుద్ధముగా లేచును. అనేక ప్రదేశములందు భూకంపములు కలుగును.క్షామములు సంభవించును. ఇవి అన్నియు వేదనలకు ప్రారంభ సూచనలు.

9. ”మీరు మెలకువతో వర్తింపుడు. ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు  అప్పగింతురు.  ప్రార్థనామందిరములలో మిమ్ము చెండాడుదురు. అధిపతుల ఎదుట, రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలిచెదరు.

10. కనుక ముందుగా సమస్త జాతుల వారికి సువార్త ప్రకటింపబడవలెను.

11. మిమ్ము అప్పగింప పట్టుకొనిపోవునపుడు ‘మేము ఏమి చెప్పవలెను?’ అని మీరు ఆతురపడవలదు. ఆ సమయమున మీకు ఒసగబడిన దానినే  మాట్లాడుడు. ఏలయన,  మాటాడునది మీరు కాదు, పవిత్రాత్మయే.

12. సోదరుడు సోదరుని, తండ్రి కుమారుని మృత్యు వునకు అప్పగించును. కన్నబిడ్డలే తల్లిదండ్రులకు వ్యతిరేకముగా నిలిచి చంపింతురు.

13. నా నామము నిమిత్తము మిమ్ము అందరును ద్వేషింతురు. అయినను తుదివరకు నిలిచినవాడే రక్షింపబడును.

మహోపద్రవములు

(మత్తయి 24:15-28; లూకా 21:20-24)

14. ”మీరు హేయమైన వినాశనము నిలువరాని చోట నిలుచుట చూచినపుడు (పఠించువాడు గ్రహించుగాక!) యూదయా సీమలో ఉన్నవారు పర్వత ములకు పారిపోవలెను.

15. మిద్దెపై నున్నవాడు సామగ్రికొరకు ఇంటిలోనికి దిగిరాకూడదు.

16. పొలములో పనిచేయువాడు తన పైవస్త్రము తీసి కొనుటకు వెనుకకు మరలిపోరాదు.

17. ఆ దినములందు గర్భిణులకు, బాలెంతలకు ఎంత బాధా కరము?

18. మీ పలాయనము శీతకాలమందు కాకుండునట్లు ప్రార్థింపుడు.

19. ఆ దినములందు సంభవింపనున్న ఆపదలు, సృష్టి ఆరంభమునుండి నేటివరకును రాలేదు, ఇక ముందును రావు.

20. దేవుడు ఆ దినముల సంఖ్యను తగ్గింపకున్నచో ఎవ్వడును జీవింపడు. కాని, ఎన్నుకొనబడినవారి నిమిత్తము అవి తగ్గింపబడెను.

21. అప్పుడు మీలో ఎవడైన ‘ఇదిగో! క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. లేక అక్కడ ఉన్నాడు’ అని చెప్పిన మీరు నమ్మవద్దు. 22. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు బయలు దేరి సాధ్యమయినయెడల దేవుడు ఎన్నుకొనిన వారిని మోసగించుటకు గొప్ప వింతలను మహత్కార్యములను చేయుదురు.

23. మీరు జాగరూకులైయుండుడు. ఇదిగో ముందుగానే సమస్తము మీతో చెప్పియున్నాను.

మనుష్యకుమారుని పునరాగమనము

(మత్తయి 24: 29-31; లూకా 21:25-28)

24. ”ఆ రోజులందు ఆ మహావిపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధురుడగును. చంద్రుడు కాంతిహీనుడగును.

25. అంతరిక్షము నుండి నక్షత్ర ములు రాలును. అంతరిక్షశక్తులు కంపించును.

26. అపుడు మనుష్యకుమారుడు మహాశక్తితో మహా మహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరు కాంతురు.

27. అపుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశమువరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగుచేయించును.

అంజూరపు చెట్టు ఉపమానము

(మత్తయి 24:32-35; లూకా 21:29-33)

28. ”అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు: దాని రెమ్మలు లేతవై చిగురించినపుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు.

29. అట్లే వీనిని అన్నింటిని మీరు చూచునపుడు ఆయన సమీపముననే, వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు.

30. ఇవన్నియు నెరవేరునంతవరకుఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను.

31. భూమ్యాకాశములు గతించిపోవునుగాని నా మాటలు గతించిపోవు.

లోకాంత్యము ఎప్పుడు?

(మత్తయి 24:36-44 లూకా 21:34-36)

32. ” ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలుగాని, కుమారుడుగాని, మరెవ్వరునుగాని ఎరుగరు.

33. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు.

34. ఆ గడియ ఇట్లుండును: ఒకానొకడు దేశాటనము వెళ్ళుచు, తన సేవకులను, ఆయా కార్య ములందు నియమించి, మెలకువతో ఉండుమని ద్వారపాలకుని హెచ్చరించెను.

35. యజమానుడు సంధ్యా సమయముననో, అర్ధరాత్రముననో, కోడికూయు వేళనో, ప్రాతఃకాలముననో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండుడు.

36. ఒక వేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించు చుండుట చూడవచ్చును.

37. మీకు చెప్పునదే అందరికి చెప్పుచున్నాను. జాగరూకులై ఉండుడు!”