శాశ్వతమైన శాంతి

2 1. యూదా, యెరూషలేములను గూర్చి ఆమోసు

కుమారుడైన యెషయా చూచిన దర్శనమిది:

2.           కడవరిదినములలో

               ప్రభువు మందిరమున్న పర్వతము, 

               శైలములన్నిలోను ఉన్నతమైనదగును.

               కొండలన్నిలోను ఎత్తయినదగును.

               సకలజాతి జనులును 

               ప్రవాహమువలె దానిచెంతకు వత్తురు. 

3.           అనేకమంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు:

               ”మనము ప్రభువు పర్వతమునకు పోవుదము. యాకోబు దేవుని దేవళమునకు పోవుదము. ఆయన తన మార్గములు మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడచుదము.”

               ధర్మశాస్త్రము సియోనునుండి వచ్చును.

               ప్రభువువాక్కు

               యెరూషలేమునుండి బయల్వెడలును.

4.           ఆయనజాతులమధ్య తగవులు పరిష్కరించును. అనేక ప్రజలకు తీర్పుచెప్పును.

               వారు తమకత్తులను కఱ్ఱులుగా సాగగొట్టుకొందురు.

               తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకొందురు. ఒక జాతి మరియొకజాతి మీద కత్తిదూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షణపొందరు.

5.           యాకోబు వంశజులారా రండు!

               మనము ప్రభువుదయచేయు 

               వెలుగులోనడచుదము.

ప్రభువు ఆగమనము

6.           ప్రభూ! నీవు నీ ప్రజయైన

               యాకోబుసంతతిని పరిత్యజించితివి.

               దేశము తూర్పునుండి వచ్చిన

               మాంత్రికులతో నిండిపోయినది.

               ఫిలిస్తీయదేశమునవలె సోదెచెప్పువారు

               ఎల్లెడల కనిపించుచున్నారు.

               ప్రజలు అన్యజాతులతో పొత్తుచేయుచున్నారు.

7.            వారి దేశమున

               వెండిబంగారములు విస్తారముగానున్నవి.

               వారి సంపదలకు అంతమేలేదు.

               వారికి గుఱ్ఱములు సమృద్ధిగానున్నవి,

               రథములకు లెక్కయేలేదు.

8.           వారి దేశమున విగ్రహములు విరివిగానున్నవి.

               ఆ ప్రజలు తమ  చేతులతో మలచిన

               విగ్రహములను తామే ఆరాధించుచున్నారు.

9.           నరమాత్రులెల్లరును మన్నుగరతురు.

               ప్రభూ! నీవు వారిని క్షమించవలదు!

10.         ప్రభువు భీకర కోపమునుండి,

               ఆయన శక్తిప్రభావముల నుండి

               తప్పించుకొని దాగుగొనుటకు

               కొండ గుహలలోనికి జొరబడుడు.

               నేలబొరియల లోనికిదూరుడు.

11.           ఆ దినమున ప్రభువు

               నరుల పొగరును అణగద్రొక్కును.

               ప్రజల గర్వమును అణచివేయును.

               ప్రభువు మాత్రమే ఉన్నతుడగును.

12.          ఆ దినమున సైన్యముల కధిపతియైన ప్రభువు

               గర్వాత్ములను, ఉన్నతపదవిలో ఉన్నవారిని,

               అహంకారులను అణగద్రొక్కును.

13.          ఉన్నతములైన లెబానోను దేవదారులను,

               బాషాను సింధూరములను,

14.          ఉత్తుంగ పర్వతములను, ఎత్తయిన కొండలను, 

15.          ఎత్తయిన కోట బురుజులను,

               దుర్గప్రాకారములను,

16.          విలువగల తర్షీషు నావలను,

               అందమైన కళావస్తువులను

               ఆయన నాశనము చేయును.

17-18. ఆ దినమున ప్రభువు

               నరుల పొగరును అణగద్రొక్కును.

               ప్రజల గర్వమును అణచివేయును.

               ప్రభువు మాత్రమే ఉన్నతుడగును.

               విగ్రహములెల్ల క్రింద పడవేయబడును.

19.          ప్రభువు భూమిని గడగడలాడించుటకు

               లేచునపుడు అతని భీకరకోపము నుండియు,

               అతని శక్తి ప్రభావముల నుండియు

               తప్పించుకొని దాగుకొనుటకు

               కొండగుహలలోనికి జొరబడుదురు

               నేల బొరియలలోనికి దూరుదురు.

20-21.                 ఆ దినమున ప్రభువు

               భూమిని గడగడలాడించుటకు

               లేచునపుడు ఆయన భీకరకోపము నుండియు,

               ఆయన శక్తి ప్రభావములనుండియు తప్పించుకొని

               దాగుకొనుటకు కొండగుహలలోనికిని,       బండనెఱ్ఱెలలోనికిని జొరబడెవలెనన్న ఆశతో

ఆ దినమున నరులు తాము ఆరాధించుటకై చేసిన వెండిబంగారు విగ్రహములను చుంచెలుకల కును, గబ్బిలములకును పారవేయుదురు.

22.        ముక్కు బెజ్జములలో ఊపిరియున్న

               అల్పమానవుని లెక్కచేయ వాని బండారమెంత?