ఉపోద్ఘాతము:

పేరు: మాసిడోనియా ప్రాంతంలోని ఒక పట్టణం ఫిలిప్పి.  ఇచటి క్రైస్తవ సంఘం పౌలుకు అన్ని విధాల సహకరించింది. ఇది గుమోస అనే ద్వీపానికి ఎదురుగా పారే కోలుస్టర్‌ అనే నదికి దక్షిణంగా వుంటుంది.  ఇదొక పురాతన పట్టణం. క్రీ.పూ. 168-167లో రోమీయుల వశమైంది. క్రీ.శ. 50లో పౌలు ఫిలిప్పుకు చేరుకొని అచట మొది  ఐరోపా  సంఘాన్ని  స్థాపించాడు  (అ.కా. 16:12-40).  సిలాసుతో  పౌలు  ఈ  పట్టణాన్ని దర్శించాడు (1 తెస్స. 2:2).

కాలము: క్రీ.శ. 56.

రచయిత: పునీత పౌలు.

చారిత్రక నేపథ్యము: పౌలు తనకు ప్రీతిపాత్రుడైన ఫిలిప్పుతో, క్రైస్తవ సంఘస్తులతో తన మనోభావాలను పంచుకున్నాడు (1:12-26). ఫిలిప్పీయులకు తన ఆధ్యాత్మిక అంతిమ కోరికను (వీలునామా) కూడా రాసిచ్చాడు (3:1-14). తాను క్రీస్తు నిమిత్తం చెరసాలలో నున్నప్పటికి సంతోషంగా నున్నానని చెప్పుకున్నాడు. ఫిలిప్పీ సంఘస్తులు పౌలు ప్రేషిత పనులను సమర్థిస్తూ, ప్రోత్సహిస్తూ ధనసాయం చేశారు (4:16). అందుకు కృతజ్ఞతలు కూడా పంపాడు (4:18; 2:25-30).

ముఖ్యాంశములు: పౌలు ఫిలిప్పీ సంఘస్తులకు సువార్త బోధించాడు. క్రీస్తే మన జీవనం అనేది ప్రధానాంశం (1:12-29). క్రీస్తు విశ్వస్తుతిగీతం ప్రచండ విశ్వాస కావ్యంగా నిలుస్తుంది (2:6-11). క్రీస్తు వినయం, ఔన్నత్యం అనుకరణీయాలు. క్రీస్తు దైవస్వభావం గలవాడు (2:6). క్రీస్తు తన్ను తాను రిక్తుని (తగ్గించుకున్నాడు) చేసుకున్నాడు (2:7). క్రైస్తవ జీవితం వాస్తవిక సౌజన్యంతో నిండియుండాలి (3:1-11).

క్రీస్తు చిత్రీకరణ: ఈ గ్రంథంలో క్రీస్తును గూర్చి ఉన్నత చిత్రీకరణ లభిస్తుంది. క్రీస్తు మన నిమిత్తం తన దైవ స్వభావాన్ని పక్కన పెట్టడానికి కించిత్‌ కూడా సందేహించలేదు. బ్రతకడం అంటే క్రీస్తు కొరకే జీవించాలి (1:21). క్రీస్తు చూపించిన నిజమైన తగ్గింపు (రిక్తుడవడం) మనకు ఆదర్శంగా వుండాలి (2:5). క్రీస్తు మన మానవ శరీరాన్ని తన మహిమ గల శరీర స్థాయికి మార్చాడు (3:21). క్రీస్తు అన్ని స్థితులందు, సమయాలందు మనకు నిగూఢమైన విషయాలను ఎరుకపరుచు శక్తి (4:13).