క్రైస్తవ ప్రవర్తన

3 1. ప్రభువులకును, అధికారులకును లొంగి యుండి, విధేయులై, ఎట్టి సత్కార్యము చేయుటకైనను సంసిద్ధులై ఉండవలెనని నీ ప్రజలకు గుర్తుచేయుము.

2. ఎవ్వరిని గూర్చికాని చెడుగా మాటలాడక, జగడ మాడక, శాంతముగ ఉండి, అందరితో సౌమ్యముగ ప్రవర్తించుచుండవలెనని వారికి బోధింపుము.

3. మనమే ఒకప్పుడు మూఢులుగను, అవిధేయులుగను మోసపోయినవారముగ ఉంటిమి. సర్వవిధములగు మోహములకును, భోగములకును మనము దాసుల మైతిమి. ఈర్ష్యా ద్వేషములతో మన జీవితము గడిపితిమి. ఇతరులు మనలను ద్వేషించిరి. మనము వారిని ద్వేషించితిమి.

4.కాని, మనరక్షకుడగు దేవునికృపయు, ప్రేమయు ప్రత్యక్షమగుటతో, 5. ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యములవలనగాక, తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకును, నూతన జీవితమునకును సంబంధించిన జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను.

6. మన రక్షకుడగు యేసు క్రీస్తు ద్వారా, పవిత్రాత్మను విస్తారముగ దేవుడు మనపై కురియించెను.

7. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్యజీవమునకు వారసులమగుటకు ఆయన అటుల చేసెను. ఇది సత్యము.

8. దేవునియందు విశ్వాసముంచువారు సత్కార్య నిమగ్నులై శ్రద్ధవహించుటకుగాను నీవు ఈ విషయములను గట్టిగా బోధింపవలయునని కోరుచున్నాను. ఇవి మంచివియును, మనుజులకు ప్రయోజన కరములునై ఉన్నవి. 9. కాని మూర్ఖపువాదములకును, వంశావళులకును, తగవులకును, చట్టమును గూర్చిన వివాదములకును, దూరముగా ఉండుము. ఏలయన అవి వ్యర్థమే కాని, వాటి మూలమున ఏ ప్రయోజనము లేదు.

10. మత భేదములను సృష్టించువానికి ఒకి రెండు పర్యాయములు బుద్ధిచెప్పిన తరువాత వానితో ఎట్టి సంబంధము ఉంచుకొనకుము.

11. ఏలయన అట్టివాడు కలుషాత్ముడు. అతని పాపములే అతడు దోషి అని నిరూపించును.

తుది ఉత్తరువు

12. నేను శీతకాలమును నికోపోలిలో గడపదలచితిని. కనుక నేను ఆర్తెమానైనను, తుకికునైనను నీయొద్దకు పంపినపుడు వెంటనే బయలుదేరి అచటకురమ్ము.

13. న్యాయవాదియగు జేనాసును, అపోల్లోను వెంటనే ప్రయాణము కట్టించి పంపుము. వారి ప్రయాణమునకు కావలసినవన్నియు చూడుము.

14. మన ప్రజలు నిష్ఫలులుకాకుండ అవసరమును బట్టిసమయోచితముగా సత్కార్యములను శ్రద్ధగా చేయుట నేర్చుకొనవలెను.

15. నా తోడి వారందరును నీకు శుభాకాంక్షలు పంపుచున్నారు. మనవిశ్వాసమునుబట్టిమమ్ము  ప్రేమించువారందరకు మా శుభాకాంక్షలు తెలియ జేయుము.

దేవుని కృప మీ అందరితో ఉండునుగాక!