పేదరాలి కానుక

(మార్కు 12:41-44)

21 1. దేవాలయమున కానుకపెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను.

2. ఒక పేద వితంతువు అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి, 3. ”ఈ పేద వితంతువు అందరికంటెను ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పు చున్నాను.

4. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి. కాని ఈమె తన పేదరికములో తన సమస్త జీవనమును సమర్పించినది” అని పలికెను.

యెరూషలేము పతనము-క్రీస్తు ప్రవచనము

(మత్తయి 24:1-2; మార్కు 13:1-2)

5.  కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు ”చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లు చున్నదో చూడుడు” అని చెప్పుకొనుచుండిరి.

6. అంతట యేసు వారితో ”ఈ కట్టడమును మీరు చూచుచున్నారుగదా! ఇచ్చట రాతిపైరాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును” అనెను.

యుగాంతపు సూచనలు

(మత్తయి 24:3-14; మార్కు 13:3-13)

7. అప్పుడు వారు ”బోధకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?” అని అడిగిరి.

8. అందుకు, ఆయన ”మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోస పోకుడు. అనేకులు నాపేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని మీరు వారివెంట వెళ్ళవలదు.

9. యుద్ధములను, విప్లవములనుగూర్చి వినినపుడు మీరు భయప డవలదు. మొదట ఇవి అన్నియు జరిగితీరును. కాని, అంతలోనే అంతమురాదు” అనెను.

10. ఇంకను ఆయన వారితో ఇట్లనెను: ”ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపైదాడి చేయును.

11. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయం కరమైన దృశ్యములు, గొప్పసూచనలు కనిపించును.

12. ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ముపట్టి, ప్రార్థనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతులయొద్దకు మిమ్ములను తీసికొనిపోవుదురు.

13. ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము.

14. మీరు అచట చెప్పవలసినదానిని గూర్చి కలవరపడకుడు.

15. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును.

16. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులుకూడ మిమ్మును ఇచ్చెదరు. మీలో కొంతమందినిచంపించెదరు.

17. నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు.

18. కాని మీ తలవెంట్రుకకూడ రాలిపోదు.

19. మీ సహనమువలన మీరు మీ ప్రాణములను దక్కించు కొందురు.

యెరూషలేము ముట్టడి

(మత్తయి 24:15-28; మార్కు 13:14-23)

20. ”యెరూషలేము ముట్టడింపబడుటను కాంచినపుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు.

21. అపుడు యూదయా సీమలో ఉన్న వారు పర్వతములకు పారిపోవలయును. పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలయును. వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు.

22. అవి ప్రతీకారదినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నియు జరిగితీరును.

23. ఆ రోజులందు గర్భిణులకు, బాలెంతలకు ఎంత బాధ! ఏలయన భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు.

24. జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. అన్యుల కాలము పరిపూర్తి అగువరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు.

మనుష్యకుమారుని పునరాగమనము

(మత్తయి 24:29-31; మార్కు 13:24-27)

25.  ”సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డుకాలము దాపురించును. సముద్రతరంగ గర్జనలతో ప్రజలెల్ల అల్లకల్లోలమగుదురు.

26. ఏలయన అంతరిక్షశక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తులవలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు.

27. అపుడు మనుష్యకుమారుడు శక్తితోను, మహామహిమతోను ఆకాశమున మేఘా రూఢుడై వచ్చుటను వారు చూచెదరు.

28. ఇవి అన్నియు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తలయెత్తి చూడుడు. ఏలయన, మీ రక్షణకాలము ఆసన్నమైనది.”

అంజూరపు చెట్టు ఉపమానము

(మత్తయి 24:32-35; మార్కు 13:28-31)

29. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను: ”అంజూరపు వృక్షమును, తదితర వృక్షములను చూడుడు. 30. అవి చిగురు తొడుగుట చూచినపుడు, వసంతకాలము సమీపించినదని తెలిసి కొందురు.

31. అట్లే ఇవిఅన్నియు సంభవించుట మీరు చూచినపుడు దైవరాజ్యము సమీపించినదని తెలిసికొనుడు.

32. ఇవి అన్నియు జరుగునంతవరకును, ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

33. భూమ్యాకాశములు గతించిపోవును. కాని నా మాటలు ఎన్నటికిగతించిపోవు.

అప్రమత్తత

34. ”తుఛ్ఛ విషయాసక్తితోను, త్రాగుడుతోను, చీకుచింతలతోను మీరుమందమతులుగాక, అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలె వచ్చిపడును.

35. ఏలయన, ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును.

36. మీరు రానున్న సంఘటనలనుండి రక్షింపబడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడును జాగరూకులై ప్రార్థన చేయుడు.”

37. ప్రతిదినమున యేసు దేవాలయమున ఉపదేశించుచు రాత్రి వెలుపలకు వెళ్ళి, ఓలివుపర్వత ముపై గడుపుచుండెను.

38. ఆయన బోధలు వినుటకై దేవాలయమునకు ప్రజలందరు ప్రాతఃకాలముననే వెళ్ళెడివారు.